కల చెదిరె... | Dream disturbed | Sakshi
Sakshi News home page

కల చెదిరె...

Published Mon, Aug 17 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

కల చెదిరె...

కల చెదిరె...

♦ సైనా నెహ్వాల్‌కు రజతం   
♦ స్వర్ణ పతక పోరులో పరాజయం
♦ టైటిల్ నిలబెట్టుకున్న మారిన్   
♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
 
 జగజ్జేతగా అవతరించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆఖరి మెట్టుపై తడబడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా ‘సువర్ణాధ్యాయం’ లిఖించలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన అంతిమ సమరంలో సైనా వరుస గేముల్లో ఓడిపోవడంతో ‘పసిడి కల’ చెదిరింది. మరోవైపు మారిన్ వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా నిలిచి తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది.
 
 జకార్తా : ‘పసిడి’ పతకమే లక్ష్యంగా అంతిమ సమరంలో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఘనమైన ముగింపు ఇవ్వలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా పరాజయం పాలైంది. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సైనా 16-21, 19-21తో ఓటమి చవిచూసి రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ విజయంతో మారిన్... జీ జింగ్‌ఫాంగ్ (చైనా-2005, 2006) తర్వాత వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచింది. మారిన్ చేతిలో ఫైనల్లో ఓడిపోవడం సైనాకిది రెండోసారి. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైనల్లోనూ మారిన్ చేతిలోనే సైనా ఓడింది.

 ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో మారిన్‌పై ఆధిక్యంలో ఉన్నా ఈ గణాంకాలు ఫైనల్లో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. సైనాతో గతంలో ఇతర టోర్నీల్లో మూడుసార్లు ఫైనల్లో ఆడిన అనుభవం ఉన్న మారిన్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. ఇప్పటికే ప్రపంచ టైటిల్‌ను ఒకసారి సాధించిన మారిన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ సైనాను ఇబ్బంది పెట్టింది. చురుగ్గా కదులుతూ, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ, డ్రాప్ షాట్‌లు ఆడుతూ మారిన్ తొలి గేమ్‌లో పూర్తిగా ఆధిపత్యం చలాయించింది. మారిన్ మెరుగ్గా ఆడుతుండటంతో... మరోవైపు తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న సైనాపై మరింత ఒత్తిడి పెరిగింది.

తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో పుంజుకుంది. మారిన్ ఆటతీరుకు దీటుగా బదులిస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేసి 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మారిన్ మళ్లీ దూకుడు పెంచింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 12-12తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకదశలో మారిన్ 17-18తో పాయింట్ వెనుకజంలో ఉన్నా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా మరో పాయింట్ సాధించినా... ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో మారిన్ సంధించిన స్మాష్ షాట్‌ను సైనా బయటకు పంపడంతో స్పెయిన్ అమ్మాయి విజయం ఖాయమైంది. సెమీఫైనల్స్‌లో ఓడిన లిందావెని ఫనెత్రి (ఇం డోనేసియా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) లకు కాంస్య పతకాలు లభించాయి.
 
   ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన సైనాకు అభినందనలు. టోర్నీ ఆసాంతం ఆమె బాగా ఆడింది. ఫైనల్లో కూడా ఎంతో పోరాట పటిమ ప్రదర్శించింది. ఇలాంటి ఆటగాళ్లు ఉండటం పట్ల గర్వపడుతున్న తెలంగాణ రాష్ట్రం మున్ముందు క్రీడల్లో కూడా అగ్రస్థానానికి చేరుతుంది.       
-తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు
 
  తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం సైనాపై ఒత్తిడి పెంచింది. దాంతో ఏకాగ్రత కోల్పోయినట్లుంది. నాకు తెలిసి ఆమె ఈ పోరులో మానసికంగా వెనుకబడింది. అయినా రజతం రావడం ఆనందకరం. విజయం కోసం సైనా శాయశక్తులా ప్రయత్నించింది. మా అమ్మాయిలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. కొన్ని లోపాలు అధిగమించడంతో పాటు ఫిట్‌గా ఉంటే వచ్చేసారి చాంపియన్ అవుతుంది.              
-హర్వీర్ సింగ్, సైనా తండ్రి
 
► ఎంతో శ్రమిస్తే గానీ వరల్డ్ చాంపియన్ కాలేరు. ఫర్వాలేదు... విజయంకంటే ఓటమి ఎక్కువ నేర్పిస్తుంది.           
-విశ్వనాథన్ ఆనంద్
 
► బ్యాడ్‌లక్ సైనా. అయినా భారత బ్యాడ్మింటన్‌లో తొలి రజతం. అందరికీ గర్వకారణం.
-గుత్తా జ్వాల
 
► చాలా బాగా ఆడావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. పోరాడినా ఈ రోజు కలిసి రాలేదు. మెరుగైన ప్లేయర్ చేతిలో ఓడావు.   
- అనిల్ కుంబ్లే
 
    ఫైనల్లో నేను నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదు. నేనింకా బాగా ఆడాల్సింది. తొలి గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్ని పాయింట్లు వేగంగా చేజార్చుకున్నాను. ఏం జరుగుతుందో ఆలోచించేలోపే స్కోరు సమమైపోయింది. ఫిట్‌నెస్‌పరంగా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో ఆటకంటే మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యం. రెండో గేమ్‌లోని కీలకదశలో నేను అనవసర తప్పిదాలు చేశాను. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతుండటం మారిన్‌కు అనుకూలాంశమైంది. ఆమె ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడింది.    
 -సైనా నెహ్వాల్
 
   గత ఏడాది విజయంతో పోలిస్తే ఈసారి మరింత సంతోషంగా ఉన్నాను. గతనెలలో కాలికి గాయమైంది. అసలు ఈ టోర్నీలో నేను ఆడతానో లేదో అనే అనుమానం కలిగింది. రెండు వారాల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఈ మెగా ఈవెంట్‌ను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో పొరపాట్లు చేయకూడదనే వ్యూహంతో ఆడాను. ఫలితం గురించి కాకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించి ఆడాను.  జకార్తా ప్రేక్షకులు నాకు మద్దతు ఇవ్వడం చూశాక నేను సొంతగడ్డపై ఆడుతున్నాననే భావన కలిగింది.
-కరోలినా మారిన్
 
 చెన్ లాంగ్‌దే పురుషుల టైటిల్
 పురుషుల సింగిల్స్ విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో చెన్ లాంగ్ 21-14, 21-17తో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియాకు పురుషుల డబుల్స్ టైటిల్ దక్కింది. ఫైనల్లో మొహమ్మద్ ఎహసాన్-హెంద్రా సెతియవాన్ ద్వయం 21-17, 21-14తో లియు జియోలాంగ్-కియు జిహాన్ (చైనా) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ విభాగంలో తియాన్ కింగ్-యున్‌లి జావో (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో నాన్ జింగ్-యున్‌లి జావో (చైనా) విజేతలుగా నిలిచారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. విజేత, రన్నరప్‌లకు స్వర్ణ, రజతాలు... సెమీస్‌లో ఓడినవారికి కాంస్య పతకాలు అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement