'సింధు మైండ్ గేమ్ ఆడింది'
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఏకాగ్రతను దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడిందని ప్రపంచ నంబర్ వన్, స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ చెప్పింది. శుక్రవారం రాత్రి జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై 19-21, 21-12, 21-15 నెగ్గిన అనంతరం మారిన్ మీడియాతో మాట్లాడింది. ముఖ్యంగా సింధుకు తొలి గేమ్ కోల్పోయిన తర్వాత ఆటపై తన ఫోకస్ పెంచానని తెలిపింది. రియోకు ముందు 4-3 గెలుపోటములతో సింధుపై మెరుగైన రికార్డున్న మారిన్ ఫైనల్లో నెగ్గి మరోసారి ఆధిపత్యాన్ని చాటిచెప్పింది.
సింధు చాలా ఆత్మవిశ్వాసంతో గేమ్ ఆడుతూ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని దీంతో మొదట్లో కొన్ని పాయింట్లు కోల్పోయినా, రెండో, మూడో గేమ్ లలో తన మెరుగైన ఆటను ఆడినట్లు పేర్కొంది. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేలా పాయింట్ సాధించిన ప్రతిసారి గట్టిగా అరవడంపై నోరు విప్పింది. మధ్యమధ్యలో షటిల్స్ మార్చడం, గట్టిగా అరవడం తన గేమ్ ప్లాన్ లో భాగమని వెల్లడించింది. దీంతో అంపైర్లు కొన్నిసార్లు ఆమెను మందలించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.
అయితే సింధు మాత్రం స్థిరంగా ఒకే షటిల్ తో ఆడుతూ తన దృష్టిని ఆట నుంచి మళ్లించడానికి ప్రయత్నించి ఉండొచ్చునని మారిన్ అభిప్రాయపడింది. బెస్ట్ టీమ్ తనకు అండగా ఉందని, అందుకే తన విజయం సాధ్యమని భావించినట్లు స్వర్ణ విజేత వివరించింది. స్వర్ణం నెగ్గిన తొలి యూరోపియన్గానే కాకుండా తొలి ఆసియేతర చాంపియన్గా స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ నిలిచిన విషయం తెలిసిందే.