ముంబై: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు జోరు లీగ్‌లోనూ కొనసాగింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో తెలుగమ్మాయి సింధుతో పాటు హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆమె మేటి ప్రత్యర్థి కరోలినా మారిన్‌పై పైచేయి సాధించింది. ప్రత్యక్ష వీక్షకులను, టీవీ ప్రేక్షకులను ఇలా అందరి కళ్లను ఆకట్టుకున్న మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగిన తొలి పోరులో హైదరాబాద్ హంటర్స్ 6–(–1)తో పుణే సెవెన్ ఏసెస్‌పై ఘనవిజయం సాధించింది. నిజానికి సింధు బరిలోకి దిగకముందే హంటర్స్ విజయం ఖాయమైంది. అయితే ఒలింపిక్ చాంపియన్ మారిన్ తన పుణే జట్టుకు ఓదార్పునిచ్చేందుకు బరిలోకి దిగినా... సింధు జోరు ముందు తలవంచింది. కడదాకా హోరాహోరీగా జరిగిన పోరులో స్టార్ షట్లర్ సింధు 11–15, 15–8, 15–13తో మారిన్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభంలో మొదట మారిన్ తన ‘పవర్’ చాటింది. దీంతో తొలిగేమ్ స్పెయిన్ స్టార్ వశమైంది. సింధు పదేపదే చేసిన అనవసర తప్పిదాలు కూడా మారిన్‌కు కలిసొచ్చాయి. కోర్టులో ఇద్దరు దీటుగా స్పందించినప్పటికీ మారిన్ షాట్లు పాయింట్లను తెచ్చిపెట్టాయి. తర్వాత రెండో గేమ్‌లో మాత్రం సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలివ్వలేదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా కష్టపడిన ఆమె ఈ గేమ్‌లో మారిన్‌ను తొందరగానే ఓడించింది.
ఇక చివరి గేమ్ మాత్రం అద్భుతంగా సాగింది. గెలుపు దశలో ఒక్కో పాయింట్ ఇద్దరికీ సమాన అవకాశాలిచ్చింది. మ్యాచ్ ముగిసేదశలో ఇద్దరు పిడికిలి బిగించారు. 13–13 స్కోరుదాకా దోబూచులాడిన విజయం చివరకు తెలుగు తేజం వరుసగా రెండు పాయింట్లు గెలవడంతో సింధు పక్షాన నిలిచింది. మొదట జరిగిన పురుషుల సింగిల్స్ తొలి పోటీలో మార్క్ కాల్జో (హంటర్స్) 10–15, 15–12, 15–14తో లక్ష్య సేన్‌పై గెలిచి హైదరాబాద్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. పురుషుల డబుల్స్‌ను పుణే ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇక్కడా నిరాశ తప్పలేదు. కిమ్ సా రంగ్– బొదిన్ ఇసార (హంటర్స్) ద్వయం 13–15, 15–10, 15–13తో చిరాగ్ శెట్టి–మథియాస్ బొయె జంటపై గెలువడంతో స్కోరు మైనస్ పాయింట్‌కు చేరింది. రెండో పురుషుల సింగిల్స్‌ను హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకొని బరిలోకి దిగింది. లీ హ్యూన్ ఇ (హంటర్స్) 15–14, 15–12తో బ్రిస్ లెవర్డెజ్‌ను చిత్తు చేశాడు. సింధు, మారిన్‌ల మ్యాచ్ తర్వాత చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ పోరులో ఇయోమ్ హ్యే వోన్– కిమ్ సా రంగ్ (హంటర్స్) జోడీ 15–14, 15–11తో వ్లాదిమిర్ ఇవనోవ్–లైన్ జాయెర్స్‌ఫెల్డ్ జంటపై గెలిచింది. నేడు (ఆదివారం) జరిగే పోటీల్లో ముంబై రాకెట్స్‌తో ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment