కొత్త చరిత్ర | The new history | Sakshi
Sakshi News home page

కొత్త చరిత్ర

Aug 16 2015 1:19 AM | Updated on Sep 3 2017 7:30 AM

కొత్త చరిత్ర

కొత్త చరిత్ర

ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం శుక్రవారమే ఖాయ మైనా... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా

ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సైనా
♦ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్
♦ సెమీస్‌లో ఫనెత్రిపై విజయం
♦ నేటి ఫైనల్లో మారిన్‌తో అమీతుమీ
 
 ఇప్పటికే ఎన్నో ‘తొలి’ ఘనతలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 38 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో ఏ విభాగంలోనైనా ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. నేడు జరిగే అంతిమ సమరంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ఒకవేళ  ఈ హైదరాబాద్ అమ్మాయి గెలిస్తే భారత క్రీడా చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించినట్టవుతుంది.
 
 జకార్తా : ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం శుక్రవారమే ఖాయ మైనా... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ శనివారం మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ప్లేయర్‌గా అరుదైన గౌరవాన్ని సంపాదించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-17, 21-17తో ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గతంలో ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ (ప్రకాశ్ పదుకొనే-1983లో; జ్వాల-అశ్విని జంట-2011లో; పీవీ సింధు-2013, 2014) కాంస్యాలే కావడం గమనార్హం. ఆదివారం జరిగే ఫైనల్లో సైనా నెగ్గితే స్వర్ణం దక్కుతుంది లేదంటే రజతంతో సంతృప్తి పడుతుంది. ఫలితం ఎలా ఉన్నా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తొలిసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్టయింది.

 వ్యూహం మార్చుకొని...
 క్వార్టర్ ఫైనల్లో ఏకంగా ఆరు మ్యాచ్ పాయిం ట్లను కాపాడుకొని, ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరిన ఫనెత్రిని సైనా తక్కువ అంచనా వేయలేదు. 20 ఏళ్ల తర్వాత ఓ ఇండోనేసియా క్రీడాకారిణి సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ఫనెత్రికి సొంత ప్రేక్షకుల మద్దతు లభించింది. అయినప్పటికీ ఇవేమీ సైనా ప్రదర్శనపై ప్రభా వం చూపలేదు. గతంలో రెండుసార్లు ఫనెత్రిని ఓడించిన సైనా ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్ ఆరంభంలో సైనా 2-6తో వెనుకబడ్డప్పటికీ వెంటనే తేరుకుంది.

 ఫనెత్రికి మోకాలిలో నొప్పి ఉండటంతో పట్టీ కట్టుకొని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి పూర్తి ఫిట్‌గా లేకపోవడం గమనించిన సైనా తన వ్యూహాన్ని కూడా మార్చుకొని ఆడింది. దూకుడుగా వెళ్లకుండా సుదీర్ఘ ర్యాలీలకు ప్రాధాన్యమిస్తూనే, అడపాదడపా డ్రాప్ షాట్‌లతో ఫనెత్రికి పరీక్ష పెట్టింది. కోర్టులో ఎక్కువ సమయం కదలికలు చేయడంతో ఫనెత్రికి ఇబ్బంది తప్పలేదు. అయినప్పటికీ సైనాకు సాధ్యమైనంత పోటీనిచ్చిన ఫనెత్రి నిలకడగా పాయింట్లు సాధించింది. స్కోరు 16-16 వద్ద సమంగా ఉన్నప్పుడు సైనా రెండు పాయింట్లు నెగ్గి 18-16తో ముందంజ వేసింది.

ఆ తర్వాత ఫనెత్రి ఒక పాయింట్ సాధించినా, మరోవైపు సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సైనా తన వ్యూహానికి కట్టుబడి ఆడింది. తొలి గేమ్‌తో పోలిస్తే రెండో గేమ్‌లో మాత్రం సైనా చేసిన అనవసర తప్పిదాలతోనే ఫనెత్రి ఖాతాలో పాయింట్లు చేరాయి. రెండో గేమ్‌లోనూ పలుమార్లు స్కోరు సమంగా నిలిచినా... కీలకదశలో సైనా తన అనుభవాన్ని రంగరించి పోరాడి పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21-17, 15-21, 21-16తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది.
 
 ఫైనల్‌కు చేరుతానని ఊహించలేదు. ఈ టోర్నీలో నేను ఆడిన కఠిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఫనెత్రికి స్థానిక ప్రేక్షకుల మద్దతు లభించింది. ఈ టోర్నీలో ఫనెత్రి చాలా మ్యాచ్‌ల్లో అద్భుతంగా పుంజుకొని గెలిచింది. అందుకే ఆమెను ఏదశలోనూ తక్కువ అంచనా వేయలేదు. మారిన్‌తో ఫైనల్లో నేను బాగా ఆడాలని కోరుకుంటున్నాను.
    -సైనా నెహ్వాల్
 
 అత్యుత్తమ ఆటతీరుతోనే...
 ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్‌తో నేడు జరిగే ఫైనల్లో సైనాకు మరో సవాలు ఎదురుకానుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ఆధిక్యంలో ఉన్నా... గత మార్చిలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో మారిన్ చేతిలో సైనా ఓడిపోయింది. ఏడాదికాలంగా అత్యంత నిలకడగా ఆడుతోన్న మారిన్‌ను ఓడించాలంటే సైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, తన అత్యుత్తమ ఆటతీరును కనబర్చాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement