ఒడెన్స్: ఇటీవలే జపాన్ ఓపెన్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రతీకారం తీర్చుకుంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 22–20, 21–18తో ప్రపంచ 5వ ర్యాంకర్ మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 5–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే కీలకదశలో సైనా పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
సాయిప్రణీత్ ఓటమి
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సాయిప్రణీత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. శ్రీకాంత్ 21–17, 21–15తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శుభాంకర్ డేను ఓడించగా... ప్రణయ్ 21–18, 21–19తో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 10–21, 15–21తో క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్‌లో భారత జోడీల పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–14, 18–21, 17–21తో చుంగ్ సియోక్–కిమ్ డ్యూక్‌యంగ్ (కొరియా) జంట చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీ 13–21, 18–21తో మ్యాడ్స్ పీటర్సన్–కోల్డింగ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 17–21తో నిక్లాస్ నోర్–సారా తిగ్సెన్ (డెన్మార్క్) జోడీ చేతిలోఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప – సిక్కి రెడ్డి జంట 21–15, 18–21, 21–23తో మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
మారిన్‌కు సైనా షాక్
Published Thu, Oct 19 2017 12:44 AM | Last Updated on Thu, Oct 19 2017 9:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment