పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. గత ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ స్టార్ కరోలిన్ మారిన్ చేతిలో సింధు ఓడిన విషయం తెలిసిందే. భారత్‌కు చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ చాంపియన్‌షిప్ పెద్ద టోర్నీ అని అక్కడ అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారని ఆమె తెలిపారు. ‘అందరూ నాకు ఫైనల్ ఫోబియా ఉందంటున్నారు. నాకు ఆ ఫోబియా లేదు. ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఫైనల్లో కూడా గెలవాలనే నా సాయశక్తుల ప్రయత్నించా. స్పెయిన్ స్టార్ మారిన్ చాలా తెలివిగా ఆడింది. తొలి రౌండ్ నుంచి కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాను. ఫైనల్లో ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. చాలా బాగా ఆడి విజయం సాధించిన మారిన్‌కు అభినందనలు. నేను ఫస్ట్ గేమ్ గెలిచి ఉంటే ఆట వేరేలా ఉండేది. ఓడిపోవడం వల్ల నాపై మరింత ఒత్తిడి పెరిగింది.
చాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. ఈ ఏడాది రజతం సాధించాను.. కచ్చితంగా భవిష్యత్‌లో స్వర్ణం కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతున్నావని చాలా మంది అంటున్నారు. కానీ ఫైనల్ వరకు రావడమనేది చాలా కష్టం అని అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఫైనల్‌కు రాకుండానే ఇంటిముఖం పడుతున్నారు. తుదిపోరులో ఎవరైనా బాగా ఆడాలనే అనుకుంటారు. కొన్ని సార్లు ఆడొచ్చు లేక ఆడకపోవచ్చు. ఓడిపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని రానున్న టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా. మారిన్ అందరూ ప్లేయర్స్‌తోనూ చాలా దూకుడుగా ఆడుతుంది. ఒలింపిక్స్ తరువాత తనతో చాలా మ్యాచ్‌ల్లో తలపడ్డాను. ఎప్పుడూ ఎటాకింగ్‌తో ఆడుతోంది. కోర్టుల్లో మేమిద్దరం ప్రత్యర్థులం అయినప్పటికీ కోర్టు బయట మంచి స్నేహితులమని’ సింధు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment