మారిన్‌... కాచుకో! | India Open 2017: It's PV Sindhu vs Carolina Marin in Final | Sakshi
Sakshi News home page

మారిన్‌... కాచుకో!

Published Sun, Apr 2 2017 12:59 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

మారిన్‌...  కాచుకో!

మారిన్‌... కాచుకో!

ఇండియా ఓపెన్‌ ఫైనల్లోకి సింధు
నేడు ఒలింపిక్‌ చాంపియన్‌ మారిన్‌తో అమీతుమీ
సెమీస్‌లో సుంగ్‌ జీ హున్‌పై విజయం


స్వదేశంలో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఆరోసారి ఈ టోర్నీలో ఆడుతోన్న సింధు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా మారిన్‌తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో మారిన్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునేందుకు సింధుకు మరో అవకాశం వచ్చింది.  

న్యూఢిల్లీ: గతంలో సైనా నెహ్వాల్‌ సాధించిన ఘనతలను ఒక్కోటి అధిగమిస్తున్న పీవీ సింధు మరో చిరస్మరణీయ విజయానికి చేరువైంది. స్వదేశంలో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌కు ఈ తెలుగు తేజం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ పీవీ సింధు 76 నిమిషాల్లో 21–18, 14–21, 21–14తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. సుంగ్‌ జీ హున్‌తో 11వ సారి తలపడిన సింధు ఏడోసారి గెలుపొందడం విశేషం.

ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–5తో వెనుకబడి ఉంది. అంతర్జాతీయ టోర్నీలో వీరిద్దరూ చివరిసారి గత డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లో తలపడగా... సింధు వరుస గేముల్లో 21–17, 21–13తో మారిన్‌పై గెలిచింది. అయితే ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మ్యాచ్‌లో మాత్రం మారిన్‌ (హైదరాబాద్‌ హంటర్స్‌) 11–8, 12–14, 11–2తో సింధుపై గెలిచింది. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఫైనల్‌ హోరాహోరీగా సాగే అవకాశముంది.

క్వార్టర్‌ ఫైనల్లో సైనాపై సాధికారిక విజయం సాధించిన సింధు అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించింది. అడపాదడపా స్మాష్‌ షాట్‌లు సంధిస్తూ, సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... అప్పుడప్పుడూ డ్రాప్‌ షాట్‌లు ఆడుతూ సింధు తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 5–7తో వెనుకబడినా... ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

రెండో గేమ్‌ ఆరంభంలో సింధు 5–1తో ముందంజ వేసినా... సుంగ్‌ జీ హున్‌ పట్టుదలతో ఆడి కోలుకుంది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన ఈ కొరియా స్టార్‌ 8–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు సింధు కూడా అనవసర తప్పిదాలు చేయడంతో రెండో గేమ్‌ను సుంగ్‌ జీ హున్‌ 21–14తో దక్కించుకుంది.

నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 4–0తో మూడో గేమ్‌లో శుభారంభం చేసింది. విరామ సమయానికి సింధు 11–4తో ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఆ తర్వాత సింధు నిలకడగా రాణించగా... సుంగ్‌ జీ హున్‌ పోరాడినా సింధును అందుకోలేకపోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాకపోవడం గమనార్హం. రెండో సెమీఫైనల్లో మారిన్‌ 21–16, 21–14తో అకానె యామగుచి (జపాన్‌)పై నెగ్గింది.  

ఎవరు బాగా ఆడితే...
దుబాయ్‌లో జరిగిన సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో నేను, మారిన్‌ హోరాహోరీగా తలపడ్డాం. అప్పుడు నేనే గెలిచాను. కానీ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ఆమె చేతిలో నాకు ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఢిల్లీలో మరో సమరానికి సిద్ధమయ్యాం. ఇక్కడ ప్రేక్షకుల మద్దతు నాకే వుంటుంది. దీంతో రాణిస్తాను. దుబాయ్, పీబీఎల్‌లతో పోల్చితే ఇక్కడ భిన్నమైన పరిస్థితులుంటాయి. గేమ్, పరిస్థితులు, శైలీ అంతా ఇక్కడ కొత్తకొత్తగానే ఉంటుంది. పైగా ఒకరి బలాబలాల గురించి మా ఇద్దరికీ బాగా తెలుసు. దీంతో ఈ మ్యాచ్‌లో తాజా వ్యూహం, తాజా గేమ్‌తో బరిలోకి దిగుతా. అంతిమంగా ఎవరు బాగా ఆడితే వాళ్లే విజేతగా నిలుస్తారు. నేను బాగా ఆడతాననే ఆశిస్తున్నా. – సింధు
నేటి ఫైనల్స్‌
మధ్యాహ్నం గం. 2.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement