గాయత్రి–ట్రెసా జోడీ కూడా
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్‌కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది.
36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్‌ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది.
కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది.
లక్ష్యసేన్ ముందంజ..
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్)పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్ సులువుగా మ్యాచ్‌ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్ 13–21, 19–21తో జియా హెంగ్ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో జియా హెంగ్‌తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఫైనల్‌కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సెమీస్‌లో ఓడింది.
గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్ (థాయిలాండ్)పై గెలుపొందగా...టాప్ సీడ్ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్ – లి ఖియాన్ చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఐదో సీడ్ తనీషా–ధ్రువ్ జంట 21–16, 21–15తో జీ హాంగ్ జూ–జియా యీ యాంగ్ (చైనా) ద్వయంపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment