Syed Modi International Badminton
-
సింధు నిరీక్షణ ముగిసె...
లక్నో: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు చాంపియన్‌గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్‌లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్లో ఈ ఏడాది సింధుకిదే తొలి టైటిల్‌కాగా... ఓవరాల్‌గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్ టోర్నిలో సింధు ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ‘ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండటమే. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్‌గా ఉంటే వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది. లక్ష్య సేన్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కే టైటిల్ లభించింది. 31 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–6, 21–7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై గెలిచాడు. లక్ష్య సేన్‌కు 15,570 డాలర్ల (రూ. 13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్‌కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నిలు ఆడగా... ఈ టోర్నిలోనే ఫైనల్‌కు చేరుకొని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ–సాయిప్రతీక్ (భారత్).. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీలు రన్నరప్‌గా నిలిచాయి. గాయత్రి–ట్రెసా జోడీ అదుర్స్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గాయత్రి–ట్రెసా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 21–11తో బావో లి జింగ్–లి కియాన్ (చైనా) జంటను ఓడించింది. ఈ ఏడాది ఓవరాల్‌గా గాయత్రి–ట్రెసా జోడీ 20 టోర్నిలు ఆడి ఎట్టకేలకు తొలి టైటిల్‌ను దక్కించుకుంది. గాయత్రి–ట్రెసా జంటకు 16,590 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సంవత్సరం నిలకడగా రాణించిన గాయత్రి–ట్రెసా ద్వయం ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. -
ఫైనల్లో పీవీ సింధు
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్‌కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్‌ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది. లక్ష్యసేన్ ముందంజ.. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్)పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్ సులువుగా మ్యాచ్‌ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్ 13–21, 19–21తో జియా హెంగ్ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో జియా హెంగ్‌తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఫైనల్‌కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సెమీస్‌లో ఓడింది. గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్ (థాయిలాండ్)పై గెలుపొందగా...టాప్ సీడ్ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్ – లి ఖియాన్ చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఐదో సీడ్ తనీషా–ధ్రువ్ జంట 21–16, 21–15తో జీ హాంగ్ జూ–జియా యీ యాంగ్ (చైనా) ద్వయంపై గెలిచింది. -
సింధు నిరీక్షణకు తెర
లక్నో: రెండు సంవత్సరాల ఐదు నెలల నిరీక్షణకు తెర దించుతూ భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీలో టాప్ సీడ్ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్తో 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు 21–13, 21–16తో గెలిచింది. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన తర్వాత సింధు గెలిచిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. చాంపియన్‌గా నిలిచిన సింధుకు 11,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 55 వేలు), 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోదీ ఓపెన్‌లో సింధు విజేతగా నిలువడం ఇది రెండోసారి. 2017లోనూ సింధు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. రన్నరప్ గాయత్రి జోడీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–త్రిషా జాలీ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–త్రిషా ద్వయం 12–21, 13–21తో అనా చింగ్ యిక్ చియోంగ్–తియో మె జింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) ద్వయం 18–21, 15–21తో మాన్ వె చోంగ్–కయ్ వున్ తీ (మలేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జంట 21–16, 21–12తో హేమ నాగేంద్ర బాబు–గురజాడ శ్రీవేద్య (భారత్) జోడీపై నెగ్గి టైటిల్ దక్కించుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు..
Syed Modi International 300 Tournament: సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు, తెలంగాణ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సింధు 33 నిమిషాల్లో 21–16, 21–13తో లారెన్ లామ్ (అమెరికా)పై... సామియా 27 నిమిషాల్లో 21–6, 21–15తో కనిక (భారత్)పై గెలిచారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 9–21, 6–21తో ఆకర్షి కశ్యప్ (భారత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణ ప్రసాద్ జోడీ 15–21, 21–17, 21–8తో అయూబ్–లిమ్ కిమ్ వా (మలేసియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ ద్వయం 21–12, 21–7తో సిమ్రన్– రితికా జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. చదవండి: Australian Open 2022: యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానుకు దిమ్మతిరిగే షాక్ -
శ్రీకాంత్‌కు నిరాశ
లక్నో: భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 2019 సీజన్‌ను ఒక్క టైటిల్ నెగ్గకుండానే ముగించాడు. ఈ ఏడాది చివరి వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ సయ్యద్ మోదీ ఓపెన్‌లో శ్రీకాంత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 18–21, 19–21తో ప్రపంచ 43వ ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. సన్ వాన్ హోతో 11 సార్లు తలపడిన శ్రీకాంత్ ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 21–19, 21–16తో గతంలో మూడుసార్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి రితూపర్ణ దాస్ 24–26, 21–10, 21–19తో భారత్‌కే చెందిన శ్రుతి ముందాడపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్)తో రితూపర్ణ దాస్; హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)తో సౌరభ్ వర్మ తలపడతారు. -
మెయిన్ ‘డ్రా’కు సిరిల్
లక్నో: సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ 24–22, 21–18తో చిరాగ్ సేన్ (భారత్)పై, 21–16, 21–13తో కెవిన్ అల్టర్ (భారత్)పై విజయం సాధించాడు. సిరిల్‌తోపాటు భారత్‌కే చెందిన హర్షీల్ డాని కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి మామిళ్లపల్లి తనిష్క్‌తోపాటు రితిక, శ్రుతి ముందాడ, అమోలిక సింగ్ సిసోడియా కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్)తో చుక్కా సాయి ఉత్తేజిత రావు; రసిక రాజేతో తనిష్క్; యిమాన్ జాంగ్ (చైనా)తో గుమ్మడి వృశాలి; ప్రాషి జోషితో శ్రీకృష్ణప్రియ; శ్రుతితో ఐరా శర్మ; కేట్ ఫూ కునె (మారిషస్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ (భారత్)తో సిరిల్ వర్మ; తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్; మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్)తో రాహుల్ యాదవ్; సెర్గీ సిరాంట్ (రష్యా)తో సాయిప్రణీత్; పెర్సన్ (జర్మనీ)తో గురుసాయిదత్ ఆడతారు. -
ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్
లక్నో:సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్(భారత్)ఫైనల్ కు చేరాడు. ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-14, 21-7 తేడాతో 11వ సీడ్ బూన్సాక్ పోన్ సానా(థాయ్‌లాండ్)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమయ్యాడు. 32 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి సెట్ లో 11-6 తేడాతో ఆధిక్యంలో కొనసాగిన శ్రీకాంత్.. అదే ఊపును కొనసాగించి ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కు కూడా చేజార్చుకోకుండా మరో ఐదు పాయింట్లను సాధించి మరింత ముందుకు సాగిపోయాడు. యితే ఆ తరువాత పుంజుకున్న బూన్సాక్ వరుస పాయింట్లను సాధించినా ఆసెట్ ను కాపాడుకోలేకపోయాడు. ఇక రెండో సెట్ లో 12-6 తో ముందంజలోకి వెళ్లిన శ్రీకాంత్.. సెట్ ను కైవసం చేసుకునే క్రమంలో మిగతా 10 పాయింట్లలో ఒక పాయింట్ మాత్రమే బూన్సాక్ కు ఇచ్చి ఫైనల్ కు చేరాడు. దీంతో ఇదే టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించిన ఆటగాడిగా శ్రీకాంత్ గుర్తింపు సాధించాడు.