రెండేళ్ల తర్వాత మళ్లీ టైటిల్ సొంతం
సయ్యద్ మోడీ ఓపెన్‌లో మూడోసారి విజేతగా నిలిచిన భారత స్టార్
పురుషుల సింగిల్స్ చాంప్ లక్ష్య సేన్
గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి మహిళల డబుల్స్ టైటిల్
లక్నో: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు చాంపియన్‌గా నిలిచింది. తద్వారా 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ప్రపంచ 119వ ర్యాంకర్ వు లువో యు (చైనా)తో 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో గెలుపొందింది. ఈ విజయంతో సింధుకు 15,750 డాలర్ల (రూ.13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోడీ ఓపెన్‌లో సింధు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి.
ఆమె 2017, 2022లోనూ విజేతగా నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్‌లో ఈ ఏడాది సింధుకిదే తొలి టైటిల్‌కాగా... ఓవరాల్‌గా 18వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. 29 ఏళ్ల సింధు చివరిసారి 2022 జూలైలో సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరలేదు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్ టోర్నిలో సింధు ఫైనల్ చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ‘ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. నా ప్రధాన లక్ష్యం గాయాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండటమే. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నా ఫిట్‌గా ఉంటే వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతా. ఈ ఏడాదిని టైటిల్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. జనవరి
నుంచి కొత్త సీజన్‌ను ప్రారంభిస్తా’ అని సింధు వ్యాఖ్యానించింది.
లక్ష్య సేన్ జోరు
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కే టైటిల్ లభించింది. 31 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో లక్ష్య సేన్ 21–6, 21–7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై గెలిచాడు. లక్ష్య సేన్‌కు 15,570 డాలర్ల (రూ. 13 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. లక్ష్య సేన్‌కు కూడా ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఈ సంవత్సరం లక్ష్య సేన్ మొత్తం 14 టోర్నిలు ఆడగా... ఈ టోర్నిలోనే ఫైనల్‌కు చేరుకొని టైటిల్ సాధించడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో పృథ్వీ కృష్ణ–సాయిప్రతీక్ (భారత్).. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) జోడీలు రన్నరప్‌గా నిలిచాయి.
గాయత్రి–ట్రెసా జోడీ అదుర్స్
మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గాయత్రి–ట్రెసా కెరీర్‌లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 21–11తో బావో లి జింగ్–లి కియాన్ (చైనా) జంటను ఓడించింది. ఈ ఏడాది ఓవరాల్‌గా గాయత్రి–ట్రెసా జోడీ 20 టోర్నిలు ఆడి ఎట్టకేలకు తొలి టైటిల్‌ను దక్కించుకుంది. గాయత్రి–ట్రెసా జంటకు 16,590 డాలర్ల (రూ. 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సంవత్సరం నిలకడగా రాణించిన గాయత్రి–ట్రెసా ద్వయం ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment