జయహో సింధు...
⇒ స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ కైవసం
⇒ ఇండియా ఓపెన్ విజేతగా తెలుగు తేజం
⇒ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ మారిన్‌పై గెలుపు
⇒ రూ. 15 లక్షల 79 వేల ప్రైజ్‌మనీ సొంతం
ఎట్టకేలకు సొంతగడ్డపై పూసర్ల వెంకట (పీవీ) సింధు సత్తా చాటింది. ఇన్నాళ్లూ విదేశాల్లో నిలకడగా విజయాలు సాధించిన ఈ తెలుగు అమ్మాయి స్వదేశంలో ‘సూపర్ సిరీస్’ టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి విజేతగా అవతరించింది. రియో ఒలింపిక్స్‌చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో సాధికారిక ఆటతీరుతో సింధు పైచేయి సాధించింది.
న్యూఢిల్లీ: ముఖాముఖి రికార్డులో వెనుకంజ... ఎడంచేతి వాటం ప్రత్యర్థి... పాయింట్ గెలిచినపుడల్లా తనదే పైచేయి అన్నట్లు సంకేతం చూపిస్తూ కవ్వింపు... లయలో ఉన్నపుడు దానిని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోవడం... సింధును సొంతగడ్డపై ఎలాగైనా ఓడించాలని కరోలినా మారిన్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సాధించలేకపోయింది. చివరి పాయింట్ వరకు ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతూ... ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ సింధు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
స్వదేశంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను హస్తగతం చేసుకొని విజయ గర్జన చేసింది. స్థానిక సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సొంత ప్రేక్షకులు, అభిమానుల మధ్య సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ మారిన్‌కు 12,350 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.8 లక్షలు)తోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
ఆరంభం నుంచి దూకుడు...
గత మూడేళ్ల కాలంలో ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చి చైనాతోపాటు ఇతర ఆసియా దేశాల స్టార్ క్రీడాకారిణులను హడలెత్తిస్తున్న మారిన్ పరీక్షను ఈసారి సింధు పక్కా ప్రణాళికతో అధిగమించింది. మారిన్‌తో తొమ్మిదోసారి ఆడుతున్న సింధు తన ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై చక్కగా హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. తొలి గేమ్‌లో తొలి పాయింట్ మారిన్ గెల్చుకున్నా... సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకసారి సింధు ఖాతాలో పాయింట్లు చేరితే... మరోసారి మారిన్‌ది పైచేయి అయింది. వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన మారిన్ స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం 19–18తో ముందుకు వెళ్లింది. కానీ సింధు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడుతూ కళ్లు చెదిరే స్మాష్‌లను సంధిస్తూ వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను 22 నిమిషాల్లో కైవసం చేసుకుంది.
ఇక రెండో గేమ్‌లోనూ సింధు శుభారంభం చేసింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచింది. సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయాలని మారిన్ ప్రయత్నించినా ఆమె ఆటలు సాగలేదు. విరామానికి సింధు 11–7తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత మారిన్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సింధు నిలకడగా పాయింట్లు గెలుస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. చివరకు మారిన్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ సింధు వశమైంది.
పురుషుల చాంప్ అక్సెల్‌సన్
అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) విజేతగా నిలిచాడు. ఫైనల్లో అక్సెల్‌సన్ 21–13, 21–10తో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు.
సింధు కెరీర్‌లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్. గత ఏడాది ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను సాధించింది. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ టైటిల్. గతంలో సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మూడుసార్లు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రెండుసార్లు... సయ్యద్ మోడి ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఒకసారి... ఇండోనేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఒకసారి విజేతగా నిలిచింది.
మారిన్‌తో తొమ్మిదిసార్లు ఆడిన సింధు ఆమెపై నాలుగోసారి గెలిచింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన తర్వాత వీరిద్దరూ మరో టోర్నీలో ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. గత ఏడాది చివర్లో దుబాయ్‌లో జరిగిన సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మారిన్‌పై సింధు గెలిచింది. అంతేకాకుండా మారిన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాను. తొలి గేమ్ నేను గెలవడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఓవరాల్‌గా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ ఫలితంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆరంభం నుంచీ ఇద్దరం ప్రతి పాయింట్ కోసం పోరాడాం. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. ఎవరి కెరీర్‌లో అయినా ఒడిదుడుకులు ఉండటం సహజం. సక్సెస్‌కు అడ్డదారులు లేవు. నిరంతరం శ్రమిస్తూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తే విజయాలు అవే వస్తాయి. – సింధు
సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు
స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన పీవీ సింధును తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఈ టోర్నీలో ఆమె అసమాన ప్రతిభ కనబరిచిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
3 ఇండియా ఓపెన్‌కు సూపర్ సిరీస్ హోదా (2011లో) లభించాక... ఈ టైటిల్‌ను గెలిచిన మూడో భారత ప్లేయర్ సింధు. ఇంతకుముందు 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో, అదే ఏడాది కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. 2010లో ఈ టోర్నీకి గ్రాండ్‌ప్రి గోల్డ్ హోదా ఉన్న సమయంలో సైనా నెహ్వాల్ టైటిల్ సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు వలియవిటీల్ జంట చాంపియన్‌గా నిలిచింది.