Super Series title
-
జయహో సింధు...
⇒ స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ⇒ ఇండియా ఓపెన్ విజేతగా తెలుగు తేజం ⇒ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ మారిన్‌పై గెలుపు ⇒ రూ. 15 లక్షల 79 వేల ప్రైజ్‌మనీ సొంతం ఎట్టకేలకు సొంతగడ్డపై పూసర్ల వెంకట (పీవీ) సింధు సత్తా చాటింది. ఇన్నాళ్లూ విదేశాల్లో నిలకడగా విజయాలు సాధించిన ఈ తెలుగు అమ్మాయి స్వదేశంలో ‘సూపర్ సిరీస్’ టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి విజేతగా అవతరించింది. రియో ఒలింపిక్స్‌చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో సాధికారిక ఆటతీరుతో సింధు పైచేయి సాధించింది. న్యూఢిల్లీ: ముఖాముఖి రికార్డులో వెనుకంజ... ఎడంచేతి వాటం ప్రత్యర్థి... పాయింట్ గెలిచినపుడల్లా తనదే పైచేయి అన్నట్లు సంకేతం చూపిస్తూ కవ్వింపు... లయలో ఉన్నపుడు దానిని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోవడం... సింధును సొంతగడ్డపై ఎలాగైనా ఓడించాలని కరోలినా మారిన్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సాధించలేకపోయింది. చివరి పాయింట్ వరకు ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతూ... ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ సింధు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్వదేశంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను హస్తగతం చేసుకొని విజయ గర్జన చేసింది. స్థానిక సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సొంత ప్రేక్షకులు, అభిమానుల మధ్య సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ మారిన్‌కు 12,350 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.8 లక్షలు)తోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఆరంభం నుంచి దూకుడు... గత మూడేళ్ల కాలంలో ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చి చైనాతోపాటు ఇతర ఆసియా దేశాల స్టార్ క్రీడాకారిణులను హడలెత్తిస్తున్న మారిన్ పరీక్షను ఈసారి సింధు పక్కా ప్రణాళికతో అధిగమించింది. మారిన్‌తో తొమ్మిదోసారి ఆడుతున్న సింధు తన ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై చక్కగా హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. తొలి గేమ్‌లో తొలి పాయింట్ మారిన్ గెల్చుకున్నా... సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకసారి సింధు ఖాతాలో పాయింట్లు చేరితే... మరోసారి మారిన్ది పైచేయి అయింది. వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన మారిన్ స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం 19–18తో ముందుకు వెళ్లింది. కానీ సింధు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడుతూ కళ్లు చెదిరే స్మాష్‌లను సంధిస్తూ వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను 22 నిమిషాల్లో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు శుభారంభం చేసింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచింది. సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయాలని మారిన్ ప్రయత్నించినా ఆమె ఆటలు సాగలేదు. విరామానికి సింధు 11–7తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత మారిన్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సింధు నిలకడగా పాయింట్లు గెలుస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. చివరకు మారిన్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ సింధు వశమైంది. పురుషుల చాంప్ అక్సెల్సన్ అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) విజేతగా నిలిచాడు. ఫైనల్లో అక్సెల్సన్ 21–13, 21–10తో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సింధు కెరీర్లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్. గత ఏడాది ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను సాధించింది. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ టైటిల్. గతంలో సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మూడుసార్లు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రెండుసార్లు... సయ్యద్ మోడి ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఒకసారి... ఇండోనేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఒకసారి విజేతగా నిలిచింది. మారిన్‌తో తొమ్మిదిసార్లు ఆడిన సింధు ఆమెపై నాలుగోసారి గెలిచింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన తర్వాత వీరిద్దరూ మరో టోర్నీలో ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. గత ఏడాది చివర్లో దుబాయ్‌లో జరిగిన సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మారిన్‌పై సింధు గెలిచింది. అంతేకాకుండా మారిన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాను. తొలి గేమ్ నేను గెలవడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఓవరాల్‌గా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ ఫలితంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆరంభం నుంచీ ఇద్దరం ప్రతి పాయింట్ కోసం పోరాడాం. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. ఎవరి కెరీర్లో అయినా ఒడిదుడుకులు ఉండటం సహజం. సక్సెస్‌కు అడ్డదారులు లేవు. నిరంతరం శ్రమిస్తూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తే విజయాలు అవే వస్తాయి. – సింధు సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన పీవీ సింధును తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఈ టోర్నీలో ఆమె అసమాన ప్రతిభ కనబరిచిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 3 ఇండియా ఓపెన్‌కు సూపర్ సిరీస్ హోదా (2011లో) లభించాక... ఈ టైటిల్‌ను గెలిచిన మూడో భారత ప్లేయర్ సింధు. ఇంతకుముందు 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో, అదే ఏడాది కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. 2010లో ఈ టోర్నీకి గ్రాండ్‌ప్రి గోల్డ్ హోదా ఉన్న సమయంలో సైనా నెహ్వాల్ టైటిల్ సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు వలియవిటీల్ జంట చాంపియన్‌గా నిలిచింది. -
సైనా మెరిసె...
-
సైనా మెరిసె...
మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ సొంతం సారావక్ (మలేసియా): కొత్త ఏడాదిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి చాంపియన్‌గా అవతరించింది. గత నవంబరులో మోకాలి గాయం నుంచి కోలుకున్నాక సైనా నెగ్గిన తొలి అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. 46 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 22–20, 22–20తో ప్రపంచ 67వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. గత ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత సైనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. సైనా కెరీర్లో ఇది తొమ్మిదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 23వ టైటిల్. విజేతగా నిలిచిన సైనాకు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 12 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి పోర్న్‌పవీతో ముఖాముఖిగా ఆడిన ప్రపంచ పదో ర్యాంకర్ సైనాకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. 19–20 స్కోరు వద్ద గేమ్ పాయింట్ కాచుకున్న సైనా వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా పలుమార్లు ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 20–16 వద్ద సైనా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 20–20తో సమమైంది. అయితే కీలకదశలో తేరుకున్న సైనా వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయంతోపాటు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సైనా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. మోకాలికి శస్త్ర చికిత్స జరిగిన సమయం నుంచి టైటిల్ గెలిచిన ఈ క్షణం వరకు నా ప్రయాణం ఎంతో కఠినంగా, ఉద్వేగంగా సాగింది. క్లిష్ట సమయంలో నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు విమల్ కుమార్, ఉమేంద్ర రాణాలకు కృతజ్ఞతలు. గాయం నుంచి కోలుకునేందుకు సహకరించిన నా ఫిజియోలు హీత్ మాథ్యూస్, చందన్ పొద్దార్, అరవింద్ నిగమ్‌లకు ఈ టైటిల్ అంకితం ఇస్తున్నాను. – సైనా నెహ్వాల్ -
ఇంకొక్కటే...
ఫుజు (చైనా): కెరీర్లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్క విజయం దూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి అంతిమ సమరానికి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 11-21, 23-21, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకబడింది. వీరిద్దరూ చివరిసారి 2014 స్విస్ ఓపెన్‌లో తలపడగా... సున్ యు గెలిచింది. గతంలో సుంగ్ జీ హున్‌పై ఐదుసార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో తడబడిన సింధు రెండో గేమ్‌లో తేరుకుంది. అయితే కీలకదశలో సుంగ్ జీ హున్ పాయింట్లు నెగ్గి 20-17తో ముందంజ వేసి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచింది. ఈ దశలో సింధు అద్వితీయంగా ఆడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 21-20తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సుంగ్ స్కోరును 21-21తో సమం చేసినా... సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 23-21తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఆధిక్యం ఇద్దరితోనూ దోబూచులాడింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి అయితే కళ్లుచెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్‌తో సింధు 20-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... సహనంతో ఆడి మరో పాయింట్ సాధించి సింధు విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి ఫైనల్స్ ఉదయం గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స-4లో ప్రత్యక్షప్రసారం -
కల చెదిరింది...
‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లో ఓడిన సైనా రన్నరప్‌తో సరి ప్రపంచ చాంప్ మారిన్‌కు టైటిల్ బర్మింగ్హమ్: తన కెరీర్లో మరో ‘తొలి’ ఘనతను సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి తుది మెట్టుపై తడబడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-16, 14-21, 7-21 స్కోరుతో ప్రస్తుత ప్రపంచ, యూరో చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. వరుసగా తొమ్మిదోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన సైనా తొలిసారి ఫైనల్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అయితే విజేతగా నిలిచి ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ సరసన నిలవాలని ఆశించిన సైనాకు ప్రత్యర్థి మారిన్ నిరాశను మిగిల్చింది. గతేడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ ఈ విజయంతో తన కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించింది. క్వార్టర్స్‌లో, సెమీస్‌లో పటిష్టమైన చైనా క్రీడాకారిణులను ఓడించిన సైనా అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. తొలి గేమ్‌లో పూర్తి విశ్వాసంతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఆరంభంలో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పదునైన స్మాష్‌లు, కోర్టులో చురుకైన కదలికలతో మారిన్‌పై ఆధిపత్యాన్ని చలాయించిన సైనా అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన సైనా 6-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంవైపు సాగుతున్నట్లు అనిపించింది. అయితే అప్పటిదాకా సైనా ఆటతీరును బేరీజు వేసుకున్న మారిన్ నెమ్మదిగా పుంజుకోవడం ప్రారంభించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... సైనాను కోర్టుకిరువైపులా ఆడిస్తూ... అవకాశం దొరికినప్పుడల్లా కళ్లు చెదిరే స్మాష్‌లు సంధిస్తూ... ఈ స్పెయిన్ అమ్మాయి జోరు పెంచింది. 12-13తో వెనుకబడిన దశ నుంచి తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఊపులో మారిన్ రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. ళీ నిర్ణాయక మూడో గేమ్‌లో మారిన్ చెలరేగిపోగా... సైనా డీలా పడింది. అనవసర తప్పిదాలకు తోడు షటిల్స్ గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై వరుసగా పాయింట్లు కోల్పోయింది. అసలేం జరుగుతుందో సైనా తెలుసుకునేలోగా మారిన్ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16-4తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. చివరకు స్మాష్ షా ట్‌తో విజయాన్ని ఖాయం చేసుకొని ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌గా అవతరించింది. రన్నరప్‌గా నిలిచిన సైనా నెహ్వాల్‌కు 19 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 లక్షల 92 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. విజేత కరోలినా మారిన్‌కు 37,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 54 వేలు)తోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. సూపర్ సిరీస్ స్థాయి టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకొని ఓడిపోవడం సైనాకిది మూడోసారి. గతంలో సైనా 2011 ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో; 2012 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. రెండో గేమ్ నుంచి ఏకాగ్రత కోల్పోయాను. త్వరగా పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను తొందరగా ముగించాలని చూశాను. అనవసర పొరపాట్లు చేసి ఒత్తిడికి లోనయ్యాను. అగ్రశ్రేణి క్రీడాకారిణులతో ఆడుతున్నపుడు ఏ దశలోనైనా ఏమైనా జరగొచ్చు. ఎవరైనా ఏదో ఒకదశలో ఒత్తిడికి లోనవ్వచ్చు. ఫైనల్లో నా విషయంలో అదే జరిగింది. -సైనా నెహ్వాల్ మోదీ, కేసీఆర్ అభినందన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినా... సైనాను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిందని, చక్కని ఆటతీరు కనబరిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభినందించారు.