ఇంకొక్కటే...
ఇంకొక్కటే...
Published Sun, Nov 20 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
ఫుజు (చైనా): కెరీర్‌లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్క విజయం దూరంలో నిలిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి అంతిమ సమరానికి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 11-21, 23-21, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది.
గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2-3తో వెనుకబడింది. వీరిద్దరూ చివరిసారి 2014 స్విస్ ఓపెన్‌లో తలపడగా... సున్ యు గెలిచింది.
గతంలో సుంగ్ జీ హున్‌పై ఐదుసార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో తడబడిన సింధు రెండో గేమ్‌లో తేరుకుంది. అయితే కీలకదశలో సుంగ్ జీ హున్ పాయింట్లు నెగ్గి 20-17తో ముందంజ వేసి విజయానికి ఒక పాయింట్ దూరంలో నిలిచింది. ఈ దశలో సింధు అద్వితీయంగా ఆడి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 21-20తో ఆధిక్యంలోకి వచ్చింది.
ఆ తర్వాత సుంగ్ స్కోరును 21-21తో సమం చేసినా... సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను 23-21తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఆధిక్యం ఇద్దరితోనూ దోబూచులాడింది. ఆ తర్వాత పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి అయితే కళ్లుచెదిరే ఫోర్‌హ్యాండ్ షాట్‌తో సింధు 20-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్ కోల్పోయినా... సహనంతో ఆడి మరో పాయింట్ సాధించి సింధు విజయాన్ని ఖాయం చేసుకుంది.
నేటి ఫైనల్స్
ఉదయం గం. 10.30 నుంచి
స్టార్ స్పోర్‌ట్స-4లో ప్రత్యక్షప్రసారం
Advertisement
Advertisement