సింధును  చేరని స్వర్ణం | PV Sindhu Says Its Frustrating To Lose The Final Again | Sakshi
Sakshi News home page

సింధును  చేరని స్వర్ణం

Published Mon, Aug 6 2018 1:01 AM | Last Updated on Mon, Aug 6 2018 5:09 AM

PV Sindhu Says Its Frustrating To Lose The Final Again - Sakshi

వేదిక మారింది. ప్రత్యర్థి మారింది. పతకం రంగు మాత్రం మారలేదు. తుది ఫలితంలోనూ తేడా రాలేదు. విశ్వ విజేతగా అవతరించ డానికి అవసరమైన విజయాన్ని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట (పీవీ) సింధు అందుకోలేకపోయింది. ఏడాది కాలంగా వేధిస్తోన్న ‘ఫైనల్‌ ఫోబియా’ను ఆమె ఈసారీ అధిగమించలేకపోయింది. ఫలితంగా వరుసగా రెండో ఏడాదీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు అత్యున్నతస్థాయి టోర్నమెంట్‌లలో ఎలా నెగ్గాలో.. ఎలా ఆడాలో చూపిస్తూ స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మారిన్‌ మరోసారి విజయగర్జన చేసింది. ముచ్చటగా మూడోసారి స్వర్ణం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించింది.   

నాన్‌జింగ్‌ (చైనా): భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ‘స్వర్ణ స్వప్నం’ సాకారం కాలేదు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన ఈ తెలుగు తేజం ఆశలను స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మారిన్‌ వమ్ము చేసింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మూడో ర్యాంకర్‌ సింధు 19–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్‌ మారిన్‌ చేతిలో ఓటమి పాలైంది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్‌దే పైచేయిగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక  ప్లేయర్‌గా మారిన్‌ కొత్త చరిత్ర సృష్టించింది. 2014 ఫైనల్లో లీ జురుయ్‌ (చైనా)పై, 2105 ఫైనల్లో సైనా నెహ్వాల్‌ (భారత్‌)పై గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్‌ 2016 రియో ఒలింపిక్స్‌ ఫైనల్లో సింధునే ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. తాజా విజయంతో మారిన్‌ ఖాతాలో 13 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ సింధు ఖాతాలో 11 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు చేరాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు పతకాలు మినహా ఎలాంటి ప్రైజ్‌మనీ దక్కదు.   

ఆధిక్యం... తడబాటు... 
తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన సింధు తుది పోరులోనూ ఆ జోరు కొనసాగిస్తుందని అనిపించింది. తొలి గేమ్‌లో 1–3తో వెనుకబడిన దశలో ఆమె వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సింధు 15–11తో ముందంజ వేసింది. అయితే ఈ టోర్నీలో అందరికంటే ఎక్కువ దూకుడుగా ఆడుతున్న మారిన్‌ వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందలేదు. గతంలో సింధును ఆరుసార్లు ఓడించిన అనుభవమున్న ఈ స్పెయిన్‌ స్టార్‌ ర్యాలీలు ఆడుతూనే, స్మాష్‌లతో వాటిని ముగిస్తూ లయలోకి వచ్చింది. వరుసగా ఐదు పాయింట్లు గెలిచిన మారిన్‌ 16–15తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం కీలకదశలో పాయింట్లు గెలిచి 25 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో మారిన్‌ రెండో గేమ్‌లో చెలరేగిపోయింది. గెలవాల్సిన గేమ్‌ను కోల్పోయిన సింధు డీలా పడిపోయింది. మారిన్‌ దూకుడైన ఆటతీరుకు ఎలా సమాధానమివ్వాలో తెలియక ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలు చేస్తూ 2–11తో వెనుకబడిపోయింది. యామగుచితో జరిగిన సెమీఫైనల్‌ రెండో గేమ్‌లో 12–19తోవెనుకంజలో ఉండి వరుసగా 8 పాయింట్లు సాధించి 20–19తో ఆధిక్యంలోకి వచ్చిన సింధు ఫైనల్లో మాత్రం అలాంటి అద్భుతమైన పునరాగమనం చేయలేకపోయింది. స్కోరు 20–10 వద్ద మారిన్‌ సర్వీస్‌లో సింధు రిటర్న్‌ షాట్‌ బయటకు వెళ్లడంతో స్పెయిన్‌ స్టార్‌ విజయ సంబరాలు చేసుకుంది. 

ఎదురులేని మొమోటా  
పురుషుల సింగిల్స్‌ విభాగంలో కెంటో మొమోటా రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్‌ అవతరించాడు. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ మొమోటా 21–11, 21–13తో మూడో ర్యాంకర్‌ షి యుకి (చైనా)పై గెలుపొందాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ టైటిల్‌ సాధించడం ఇదే ప్రథమం. టైటిల్‌ గెలిచిన క్రమంలో మొమోటా కేవలం ఒక గేమ్‌ మాత్రమే కోల్పోవడం విశేషం.  

సింధుకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు 
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రజత పతకం సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

►6 గత ఏడాది కాలంలో పీవీ సింధు తాను చేరుకున్న ఆరు ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ (మారిన్‌ చేతిలో), థాయ్‌లాండ్‌ ఓపెన్‌ (ఒకుహారా చేతిలో), కామన్వెల్త్‌ గేమ్స్‌ (సైనా నెహ్వాల్‌ చేతిలో), ఇండియా ఓపెన్‌ (బీవెన్‌ జాంగ్‌ చేతిలో)... గత సంవత్సరం వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో (అకానె యామగుచి చేతిలో), హాంకాంగ్‌ ఓపెన్‌ (తై జు యింగ్‌ చేతిలో)లలో సింధు రన్నరప్‌గా నిలిచింది.  


ఫైనల్లో మరోసారి ఓడిపోవడం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తరహాలో జరిగింది. తాజా ఫలితంతో చాలా బాధ పడుతున్నాను. తర్వాతి టోర్నమెంట్‌కు సన్నద్ధం కావాలంటే మళ్లీ మానసికంగా దృఢంగా మారి ప్రాక్టీస్‌ చేయాలి. ఒక్కో రోజు మనకు కలిసి రాదు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే కాబట్టి బలంగా నిలబడాలి. మెరుగైన ఫలితాన్ని ఆశించాను అందుకే ఈ ఫలితం మరింత నిరాశ కలిగించింది. అయితే ఫైనల్‌ వరకు రావడంపై  సంతోషంగా ఉన్నా. గెలుపోటములు జీవితంలో భాగమని భావించి దీనిని స్వీకరించాలి. మారిన్‌ ఆటలో వేగం ఉండటమే కాకుండా ఆమె చాలా దూకుడుగా ఆడింది. టోర్నమెంట్‌ మొత్తం ఆమె ఇదే తరహాలో చెలరేగింది. నిజానికి ఆ వేగాన్ని నిరోధించే లక్ష్యంతోనే నేనూ సాధన చేశాను. కానీ ఆమె ఇంకా మెరుగ్గా ఆడింది. తొలి గేమ్‌ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో? రెండో గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. నేను కొట్టిన స్మాష్‌లన్నీ బయటకు వెళ్లాయి. ఇది నా రోజు కాదని మాత్రమే చెప్పగలను. తొలి గేమ్‌లో ఒక దశలో 14–9తో ఆధిక్యంలో ఉండి కూడా సులువుగా పాయింట్లు ఇచ్చేశాను. నేనూ వేగంగా ఆడే ప్రయత్నంలో పొరపాట్లు జరిగిపోయాయి. 17–17 వద్ద ఆమె అటాకింగ్‌ చేస్తున్నప్పుడు నేను మరింత ఓపిగ్గా ఆడాల్సింది.                 
- పీవీ సింధు   

రియో ఒలింపిక్స్‌ తర్వాత ఫామ్‌ కోల్పోయాను. సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా ఆనందాన్ని ఎలా వ్యక్తిపరచాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నో రకాల భావోద్వేగాలతో నా శరీరం నిండిపోయింది.  గత వారం రోజులగా నాపై నేను ఉంచిన నమ్మకం, ఆత్మవిశ్వాసం నిజమైనందుకు సంతోషంగా ఉంది.          
– కరోలినా మారిన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement