ఓడినా...బంగారమే
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో సింధుకు రజతం
ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగుతేజం
ఆమె ఓడితేనేమి... ఆ పోరాటానికి సలామ్..
అది స్వర్ణం కాకపోతేనేమి... ఆ అసమాన ఆటకు మేమంతా గులామ్..
ఎన్నాళ్లయింది... దేశమంతా ఒక్కటై ఒక మ్యాచ్ కోసం ఇంతగా ఎదురు చూసి..
ఎంతకాలమయింది... బ్యాడ్మింటన్ ఆటపై ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించి..
ఇదంతా సింధు మహత్యమే... ఆమె చూపించిన అద్భుతమే...
రియో డి జనీరో: అత్యున్నత వేదిక... అంతిమ సమరం... బరిలో ఇద్దరు సూపర్ స్టార్స్... పాయింట్ పాయింట్ కోసం పోరాటం.. అభిమానులకు కావాల్సినంత వినోదం.. ఆఖరకు అనుభవాన్నే విజయం వరించింది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) విజేతగా అవతరించింది. భారత యువ తరంగం పూసర్ల వెంకట (పీవీ) సింధు రన్నరప్‌తో సంతృప్తి పడి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ పోరులో తొమ్మిదో సీడ్ సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది.
తడబడి...తేరుకొని...
ఫైనల్ చేరే క్రమంలో ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుస గేముల్లో విజయం సాధించిన సింధుకు తుది పోరులో మాత్రం భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. మారిన్ ఎడంచేతి వాటం క్రీడాకారిణి కావడంతో సింధు వ్యూహాలు అంతగా పనిచేయలేదు. గత మూడేళ్ల కాలంలో ఎంతో పురోగతి సాధించి వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ పూర్తి వైవిధ్యభరితంగా ఆడింది. ఒక్కోసారి సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ.... క్రాస్‌కోర్టు స్మాష్‌లు సంధిస్తూ... నెట్ వద్ద డ్రాప్ షాట్‌లు ఆడుతూ సింధు సత్తాకు పరీక్ష పెట్టింది. దాంతో తొలి గేమ్ ఆరంభంలో సింధు 6-11తో వెనుకబడిపోయింది. సింధు ఎంత ప్రయత్నించినా మారిన్‌కు ఇబ్బంది పెట్టడంలో సఫలం కాలేకపోయింది. సింధు 16-19తో వెనుకంజలో ఉన్నపుడు ఇక తొలి గేమ్ మారిన్ ఖాతాలో చేరడం ఖాయమనిపించింది. కానీ సింధు ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 27 నిమిషాల్లో 21-19తో కైవసం చేసుకుంది.
లయ తప్పి...
తొలి గేమ్‌ను కోల్పోయినా మారిన్‌లో ఏమాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదు. రెండో గేమ్ ఆరంభం నుంచే ఈ స్పెయిన్ స్టార్ దూకుడుగా ఆడింది. షటిల్‌ను పూర్తిగా నియంత్రిస్తూ సింధును తనకు నచ్చినట్టుగా ఆడించింది. గత మ్యాచ్‌ల్లో స్మాష్‌లతో చెలరేగిపోయిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం తక్కువసార్లు ఈ అస్త్రాన్ని వాడింది. అసలు మారిన్ తన ప్రత్యర్థికి స్మాష్‌లు సంధించే అవకాశం ఇవ్వలేదనడం సబబుగా ఉంటుంది. మారిన్ గేర్ మార్చడంతో సింధు ఆటతీరులో లయ తప్పింది. అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లు కోల్పోయి రెండో గేమ్‌ను 22 నిమిషాల్లో 12-21తో చేజార్చుకుంది.
హోరాహోరీ...
నిర్ణాయక మూడో గేమ్‌లో కూడా మారినే తొలి పాయింట్ సాధించింది. అదే ఊపులో 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు కొన్ని అద్భుతమైన షాట్‌లు ఆడి స్కోరును 10-10తో సమం చేసింది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు (14-16) చేరింది. అయితే తానెందుకు నంబర్‌వన్‌గా ఉన్నానో, ప్రపంచ చాంపియన్ అయ్యానో నిరూపిస్తూ మారిన్ మళ్లీ చెలరేగింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 20-14తో విజయానికి చేరువైంది. సింధు మరో పాయింట్ సాధించినా... ఆ వెంటనే ఈ హైదరాబాద్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో మారిన్ విజయం సంబరంలో మునిగిపోయింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి యూరోపియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
కోట్లాది భారతీయుల ఆశలు మోస్తూ ఒలింపిక్స్ ఫైనల్ బరిలోకి దిగిన మన మేలిమి ముత్యం సింధు మెడలో రజత మాల పడింది. స్వర్ణంపై గురి పెట్టి, సర్వం పణంగా పెట్టి సుదీర్ఘంగా పోరాడిన తెలుగు తేజం చివరకు ప్రత్యర్థికి తలవంచింది. స్టేడియం మొత్తం ‘విశ్వ సింధు పరిషత్’గా మారిపోయి మన భారత బిడ్డను అడుగడుగునా ప్రోత్సహిస్తుండగా... అలవాటైన రీతిలో అదరగొడుతూ ఆధిక్యంలో దూసుకెళ్లిన క్షణాన ‘బంగారు’ బాట కళ్ల ముందుగా కనిపించింది. అయితే అంతలోనే ఆటను మార్చేసి, అటుపై ఆఖరి వరకు అవకాశం ఇవ్వని స్పానిష్ బుల్ మన ఆశలు ఆవిరి చేసింది.
రియో ఒలింపిక్స్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు రజత పతకం అందుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ కరోలినా మారిన్ 19-21, 21-12, 21-15తో సింధును ఓడించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా, ఇప్పుడు రజతంతో సింధు ఆ రికార్డును సవరించింది. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే వెండి వెలుగులతో సింధు చరిత్ర సృష్టించింది. 2000లో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి సింధునే కావడం విశేషం. మరో వైపు బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకం నెగ్గిన తొలి యూరోపియన్‌గా మారిన్ ఘనత సాధించింది.