హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగానే గచ్చిబౌలిలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో సాధన చేస్తున్నానని వరల్డ్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. గోపీచంద్ కోరిన మీదటే ‘శాట్స్’ తమ శిక్షణకు స్టేడియాన్ని సిద్ధం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒలింపిక్స్‌లో తాము పోటీ పడే తరహా వాతావరణం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉండటమే తాను అక్కడికి వెళ్లేందుకు కారణమని ఆమె వెల్లడించింది.
‘నాకూ, చీఫ్ కోచ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య అంతా బాగుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఇదే తరహా వేదికపైనే ఒలింపిక్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా ఏసీ బ్లోయర్లు మ్యాచ్‌లో షటిల్ దిశను ప్రభావితం చేస్తాయి. దానికి అలవాటు పడాలంటే అలాంటి సౌకర్యం ఉన్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సాధన చేసేందుకు నాకు ‘సాయ్’ కూడా అనుమతి ఇచ్చింది’ అని సింధు పేర్కొంది. కొన్నాళ్ల క్రితం తాను లండన్ వెళ్లినప్పుడు తన కుటుంబంతో విభేదాల గురించి వచ్చిన వార్తలపై చాలా బాధపడ్డానని, అయితే అందరికీ తాను వివరణ ఇస్తూ ఉండలేనని సింధు వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment