గోపీచంద్ ఎందుకు స్పందించడు?
సాక్షి, హైదరాబాద్: ఓ తెలుగు క్రీడాకారిణికి అన్యాయం జరుగుతున్నా బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ ఎందుకు స్పందించడం లేదని డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ప్రశ్నించింది. ఐబీఎల్‌లో తన ప్రవర్తనపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ జీవిత కాల బహిష్కరణ విధించాలని సూచించగా ఢిల్లీ హైకోర్టు దీనిపై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అండగా నిలిచిన వారికి జ్వాల కృతజ్ఞతలు తెలిపింది. ‘ఢిల్లీ హైకోర్టు నాకు అనుకూలంగా తీర్చు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
తిరిగి ఆడనుండడం ఆనందాన్నిస్తోంది. మున్ముందు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించి గర్వపడేలా ఆడతాను. బాయ్ నాపై కుట్రపూరితంగా వ్యవహరించింది. బంగా బీట్స్‌తో మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల మార్పు చేర్పులపై నాకుగాని, ఫ్రాంచైజీకి గాని ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చీఫ్ రిఫరీ స్వయంగా చెప్పారు. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన క్లీన్ స్పోర్ట్స్ ఇండియా (సీఎస్ఐ), అశ్విని, బంగా బీట్స్ కోచ్ విమల్ కుమార్, సీనియర్ కోచ్ ఆరిఫ్, స్నేహితులకు కృతజ్ఞతలు. అశ్విని నాకు మద్దతివ్వడంతో డెన్మార్క్ ఓపెన్ నుంచి నాతోపాటు తన పేరును కూడా తొలగించారు.
అయితే సొంత రాష్ట్రానికే చెందిన కోచ్ గోపీచంద్ మాత్రం ఇప్పటిదాకా ఈ విషయంలో స్పందించింది లేదు. ఆయన నాకెందుకు మద్దతివ్వడం లేదో? నేను ఈ వారం డెన్మార్క్ బయలు దేరాల్సి ఉండగా బాయ్ నుంచి ఇప్పటిదాకా సమాచారం లేదు’ అని జ్వాల తెలిపింది. క్షమాపణ చెబితే నిషేధం ఎత్తేస్తామని చెబుతున్న బాయ్ వైఖరి గమనిస్తే ఇదంతా కావాలని చేసిన పనేనన్న విషయం అర్థమవుతోందని చెప్పింది. మరోవైపు దేశ ప్రతిష్టకు సంబంధించిన క్రీడల్లో ఇలాంటి చేష్టలు సరికాదని, అందరు క్రీడాకారులు ఇటువంటి దుశ్చర్యలను ప్రతిఘటించాలని జ్వాల తండ్రి క్రాంతి కోరారు.
చైనా ఓపెన్‌కూ దూరం!
అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేందుకు గుత్తా జ్వాలను అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చర్యలు మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఈ డబుల్స్ స్టార్‌ను డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పించగా తాజాగా నవంబర్ 12 నుంచి జరిగే చైనా ఓపెన్‌కు సైతం ఎంట్రీని పంపలేదని జ్వాల తెలిపింది. ఈ టోర్నీకి మంగళవారం లోపు ఆటగాళ్ల ఎంట్రీలను పంపాల్సి ఉంది.
‘నాకైతే ఈ విషయంలో సమాచారం లేదు కానీ చైనా ఓపెన్‌కు కూడా నా ఎంట్రీని పంపలేదని అశ్విని పొన్నప్ప చెప్పింది. ఇప్పటిదాకా నా సొంత డబ్బులతోనే టోర్నీలను ఆడుతున్నాను. అయినా కూడా నన్ను ఆడనీయడం లేదు. అసలు మీరెవరు నన్ను అడ్డుకునేందుకు? నేనెవరికీ అడ్డు రావడం లేదు. నా సొంత డబ్బులతోనే నేను ఆడుతున్నాను. నాకు బ్యాడ్మింటనే జీవితం. బాయ్ వైఖరిపై గోపీచంద్‌కు కాల్ చేశాను. ఈవిషయంలో నేనేమీ చేయలేనని ఆయన జవాబిచ్చారు’ అని జ్వాల తెలిపింది.