జ్వాలకు ‘క్లీన్‌స్పోర్ట్స్’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాలపై నిషేధం విధించాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చేసిన ప్రతిపాదన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జ్వాల పట్ల ‘బాయ్’ ప్రతీకార వైఖరిని అవలంబిస్తోందని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా సంస్థ ఆరోపించింది. క్రీడల్లో అవినీతిని దూరం చేయాలంటూ ప్రచారం చేస్తున్న ఈ సంస్థ తాజా వివాదంలో జ్వాలకు మద్దతు పలికింది. ‘ఇది ఒక ప్లేయర్, సంఘానికి మధ్య జరుగుతున్న గొడవ కాదు. ‘బాయ్’ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని లక్ష్యంగా చేసుకుంది. ఏ స్థాయిలోనైనా న్యాయం కోసం జరిగే పోరాటంలో మేం జ్వాలకు మద్దతుగా నిలుస్తాం’ అని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా కన్వీనర్ బీవీపీ రావు అన్నారు. మరో వైపు అశ్విని పొన్నప్ప కూడా తన డబుల్స్ భాగస్వామి జ్వాలకు సంఘీభావం తెలిపింది.
ద్రోణాచార్య అవార్డీ ఎస్‌ఎం ఆరిఫ్ కూడా ‘బాయ్’ ప్రతిపాదనను తప్పు పట్టారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించడం జ్వాల స్వభావమని, ఐబీఎల్‌లో జరిగిన వాస్తవాన్ని పట్టించుకోకుండా ఆమెను తప్పు పట్టడం అర్థం లేనిదని ఆయన చెప్పారు. మరో వైపు నిషేధానికి సంబంధించి మీడియానుంచే తప్ప తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని జ్వాల తండ్రి గుత్తా క్రాంతి చెప్పారు. ‘మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులాంటిది అందలేదు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. ఫ్రాంచైజీ ఢిల్లీ స్మాషర్స్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.
సహచరుల మద్దతు...
జ్వాలపై నిషేధం ప్రతిపాదనను సహచర ఆటగాళ్లు తప్పుపట్టారు. అరవింద్ భట్, రూపేశ్, సనావే థామస్ ఆమెకు మద్దతు పలికారు. ‘ఇదో తీవ్రమైన నిర్ణయం. జ్వాల జట్టు ఐకన్ ప్లేయర్‌గా ముందు నిలబడింది. ఒక వేళ అది తప్పు అయితే హెచ్చరికతో వదిలేస్తే సరి’ అని భట్ అభిప్రాయ పడ్డాడు. ‘నిషేధం అర్థం లేనిది. ఐబీఎల్‌లో ఏం జరిగినా అది సమష్టి నిర్ణయమే. జ్వాల భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించింది. ఆమెతో ఈ రకంగా వ్యవహరించవద్దు’ అని రూపేశ్, థామస్ సూచించారు.
విచారణకు మరో కమిటీ
జ్వాలపై నిషేధం విషయంలో అన్ని వైపులనుంచి విమర్శలు రావడంతో ‘బాయ్’ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. జ్వాలపై ఆరోపణలను విచారించేందుకు తాజాగా ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీని నియమించింది. ఐఓఏ సంయుక్త కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే, ల్యూజ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు దీపా మెహతా, సామాజిక కార్యకర్త స్వాతి శుక్లా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జ్వాలకు షోకాజ్ నోటీసు జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరనుంది. నెల రోజుల్లో కమిటీ ‘బాయ్’కు నివేదిక ఇస్తుంది. అయితే ఆలోగా ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు జ్వాల పేరు పరిగణనలోకి తీసుకోరని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా ప్రకటించారు.