gutta jwala
-
కామన్వెల్త్ విజేతలకు కాసుల పంట
కశ్యప్‌కు రూ. 50 లక్షలు కోచ్‌లకు కూడా నగదు ప్రోత్సాహకం తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలుచుకున్న పారుపల్లి కశ్యప్‌కు రూ. 50 లక్షలు ప్రభుత్వం అందజేయనుంది. డబుల్స్‌లో రజతం సాధించిన గుత్తా జ్వాలకు రూ. 25 లక్షలు నగదు పురస్కారం దక్కనుంది. కాంస్యాలు సాధించిన ఆటగాళ్లకు రూ. 15 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కామన్వెల్త్లో రాష్ట్రానికి చెందిన గురుసాయిదత్, పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాలు సాధించగా... షూటర్ గగన్ నారంగ్ ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకున్నాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లను కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాతో గుర్తించింది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జ్వాల వ్యక్తిగత కోచ్ ఎస్ఎం ఆరిఫ్‌లకు కూడా చెరో రూ. 50 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. గ్లాస్గో క్రీడల్లో పాల్గొన్న జిమ్నాస్ట్ అరుణకు కూడా రూ. 3 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. మరో వైపు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అనంతరం ప్రకటించిన మొత్తం ఇప్పటికీ అందుకోని సైనా నెహ్వాల్‌కు కూడా త్వరలో దానిని ఇస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ క్రీడాకారులను సన్మానించడంతో పాటు ప్రకటించిన నగదు మొత్తాలను అందజేస్తారు. స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తాం: సీఎం కామన్వెల్త్లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు బుధవారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)ను కలిశారు. వీరితో పాటు కామన్వెల్త్లో పాల్గొనని సైనా నెహ్వాల్ కూడా సీఎంను కలిసింది. దాదాపు గంట పాటు ఆయన ఆటగాళ్లతో సుదీర్ఘంగా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు. కనీసం ప్రతీ రెండు నెలలకు ఒక జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహించగలిగి... ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో ఈ స్పోర్ట్స్ సిటీ ఉంటుందని సీఎం అన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలతో రావాలని ఈ సందర్భంగా ఆయన క్రీడా కార్యదర్శికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త క్రీడా విధానం రూపొందించడానికి సంబంధించి ఈ ఆటగాళ్లు కొన్ని సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న స్టేడియాల్లో అకాడమీలను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిభ గల ఆటగాళ్లకు ఇవ్వాలనే సూచనను కూడా సీఎం పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఈ ఆటగాళ్లను కేసీఆర్ కోరారు. రాష్ట్ర క్రీడాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న క్రీడాకారులు.... ఈ అంశంపై ఆయన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతిరాజ్ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె. తారక రామారావు (కేటీఆర్) కూడా ఇందులో పాల్గొన్నారు. -
నాకు గుర్తింపు దక్కడం లేదు!
‘డబుల్స్’ అంటే అలుసెందుకు? గుత్తా జ్వాల వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది. 30 ఏళ్ల ఈ హైదరాబాదీ ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో కాంస్య పతకంతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పటికీ... కేవలం ‘డబుల్స్’ ముద్రతో అంతగా లైమ్‌లైట్‌లోకి రాలేకపోయింది. దీనిపై బాహటంగానే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన జ్వాల డబుల్స్ అంటే చిన్న చూపెందుకని మరోసారి ప్రశ్నించింది. దశాబ్దానికిపైగా నిలకడైన కెరీర్‌ను కొనసాగిస్తున్న జ్వాల దీనిపై మాట్లాడుతూ ‘నేను సాధించిన పతకాలకు నజరానాలు అడగడం లేదు. నగదు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. నేనూ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్‌ననే గుర్తింపు కావాలి. ‘సింగిల్స్’లాగే నా విజయాలను గౌరవిస్తే చాలు’ అని చెప్పింది. ఒలింపిక్స్ (లండన్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను మేటి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించానంది. అయినా... ఇంకా తానేం నిరూపించుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇలాంటి ఘనవిజయాలున్న తన స్థానాన్ని భర్తీచేసే క్రీడాకారిణి ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బాయ్‌కు చురకలంటించింది. ‘ఎవరి మద్దతు లేకుండానే అనుకున్నవి సాధించాను. నా పతకాలను అసోసియేషన్ (బాయ్) గుర్తించకపోగా... లేని సాకుతో ఏకంగా వేటుకూ యత్నించారు. అయినా అన్నీ భరించాను. న్యాయపోరాటం చేశాను. ఏబీసీలో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను’ అని తెలిపింది. తన భాగస్వామి అశ్విని పొనప్ప కూడా రాణిస్తున్నా... ‘డబుల్స్’ నీడనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరునెలలుగా నరకం అనుభవించానని తిరిగి ఏబీసీ పతకంతో విమర్శలకు ప్రదర్శనతోనే బదులిచ్చానని జ్వాల పేర్కొంది. మానసిక స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని, తాజా పతకంతో తమ జోడి స్థైర్యం పెరిగిందని, ఇదే జోరుతో ముందడుగు వేస్తామని చెప్పింది. -
‘మిక్స్డ్’లో జ్వాల జోడి ఓటమి
సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నీ సైనాకు మరో పరీక్ష సింగపూర్: భారత స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో జ్వాల-జిష్ణు సాన్యాల్ (భారత్) జోడి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. కేవలం 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వాల-జిష్ణు ద్వయం 14-21, 18-21తో తాంగ్ చున్ మాన్-సాజ్ కా చాన్ (హాంకాంగ్) జోడి చేతిలో ఓటమి పాలైంది. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున ఏడో సీడ్ సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ పి.వి.సింధు, తన్వీ లాడ్, అరుంధతి పంతవానె, పి.సి.తులసి బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్లో ఎరికో హిరోస్ (జపాన్)తో సైనా; విరాంతో (ఇండోనేసియా)తో సింధు; ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)తో తన్వీ లాడ్; షిజుకా ఉచిదా (జపాన్)తో అరుంధతి; అనా రాన్‌కిన్ (న్యూజిలాండ్)తో తులసీ ఆడతారు. ముఖాముఖిలో సైనా, హిరోస్ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సైనా ఐదు టోర్నీల్లో ఆడింది. ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలువగా... మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లో... ఆల్ ఇంగ్లండ్, స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లీ డాంగ్ కియున్ (దక్షిణ కొరియా)తో కశ్యప్; అబ్దుల్ లతీఫ్ (మలేసియా)తో సాయిప్రణీత్; టకుమా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్; రుంబాకా (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్; సితికోమ్ (థాయ్‌లాండ్)తో ప్రణయ్ పోటీపడతారు. -
జ్వాలకు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలకు, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు సయోధ్య కుదిరింది. జ్వాలపై జీవితకాల నిషేధం విదించాలన్న ప్రతిపాదనను బాయ్ వెనక్కు తీసుకుంది. దీంతో ఈ హైదరాబాద్ అమ్మాయి అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేం దుకు లైన్ క్లియర్ అయింది. వచ్చే వారం కొరియాలో జరిగే టోర్నీలో జ్వాల బరిలోకి దిగే అవకాశం ఉంది. గతవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తాతో కలిసిన జ్వాల... తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చినట్లు సమాచారం. ‘బాయ్ తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నా. భవిష్యత్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తా. దేశానికి ఆడటం చాలా గౌరవంగా భావిస్తున్నా’ అని జ్వాల పేర్కొంది. బ్యాడ్మింటన్ లీగ్‌లో కొంత మంది ఆటగాళ్లను మ్యాచ్ ఆడకుండా అడ్డుకుందనే ఆరోపణలతో బాయ్ క్రమశిక్షణ కమిటీ ఆమెపై జీవితకాల నిషేధం లేదా ఆరేళ్ల సస్పెన్షన్ విధించాలని ప్రతిపాదించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని బాయ్ అధ్యక్షుడికి వదిలేసింది. -
జ్వాలకు ‘క్లీన్‌స్పోర్ట్స్’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాలపై నిషేధం విధించాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చేసిన ప్రతిపాదన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జ్వాల పట్ల ‘బాయ్’ ప్రతీకార వైఖరిని అవలంబిస్తోందని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా సంస్థ ఆరోపించింది. క్రీడల్లో అవినీతిని దూరం చేయాలంటూ ప్రచారం చేస్తున్న ఈ సంస్థ తాజా వివాదంలో జ్వాలకు మద్దతు పలికింది. ‘ఇది ఒక ప్లేయర్, సంఘానికి మధ్య జరుగుతున్న గొడవ కాదు. ‘బాయ్’ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని లక్ష్యంగా చేసుకుంది. ఏ స్థాయిలోనైనా న్యాయం కోసం జరిగే పోరాటంలో మేం జ్వాలకు మద్దతుగా నిలుస్తాం’ అని క్లీన్ స్పోర్ట్స్ ఇండియా కన్వీనర్ బీవీపీ రావు అన్నారు. మరో వైపు అశ్విని పొన్నప్ప కూడా తన డబుల్స్ భాగస్వామి జ్వాలకు సంఘీభావం తెలిపింది. ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా ‘బాయ్’ ప్రతిపాదనను తప్పు పట్టారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడించడం జ్వాల స్వభావమని, ఐబీఎల్‌లో జరిగిన వాస్తవాన్ని పట్టించుకోకుండా ఆమెను తప్పు పట్టడం అర్థం లేనిదని ఆయన చెప్పారు. మరో వైపు నిషేధానికి సంబంధించి మీడియానుంచే తప్ప తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని జ్వాల తండ్రి గుత్తా క్రాంతి చెప్పారు. ‘మాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులాంటిది అందలేదు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. ఫ్రాంచైజీ ఢిల్లీ స్మాషర్స్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. సహచరుల మద్దతు... జ్వాలపై నిషేధం ప్రతిపాదనను సహచర ఆటగాళ్లు తప్పుపట్టారు. అరవింద్ భట్, రూపేశ్, సనావే థామస్ ఆమెకు మద్దతు పలికారు. ‘ఇదో తీవ్రమైన నిర్ణయం. జ్వాల జట్టు ఐకన్ ప్లేయర్‌గా ముందు నిలబడింది. ఒక వేళ అది తప్పు అయితే హెచ్చరికతో వదిలేస్తే సరి’ అని భట్ అభిప్రాయ పడ్డాడు. ‘నిషేధం అర్థం లేనిది. ఐబీఎల్‌లో ఏం జరిగినా అది సమష్టి నిర్ణయమే. జ్వాల భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించింది. ఆమెతో ఈ రకంగా వ్యవహరించవద్దు’ అని రూపేశ్, థామస్ సూచించారు. విచారణకు మరో కమిటీ జ్వాలపై నిషేధం విషయంలో అన్ని వైపులనుంచి విమర్శలు రావడంతో ‘బాయ్’ ఇప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. జ్వాలపై ఆరోపణలను విచారించేందుకు తాజాగా ముగ్గురు సభ్యుల స్వతంత్ర కమిటీని నియమించింది. ఐఓఏ సంయుక్త కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే, ల్యూజ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు దీపా మెహతా, సామాజిక కార్యకర్త స్వాతి శుక్లా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జ్వాలకు షోకాజ్ నోటీసు జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని కోరనుంది. నెల రోజుల్లో కమిటీ ‘బాయ్’కు నివేదిక ఇస్తుంది. అయితే ఆలోగా ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు జ్వాల పేరు పరిగణనలోకి తీసుకోరని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి విజయ్ సిన్హా ప్రకటించారు.