గుత్తా జ్వాల
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలకు, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)కు సయోధ్య కుదిరింది. జ్వాలపై జీవితకాల నిషేధం విదించాలన్న ప్రతిపాదనను బాయ్ వెనక్కు తీసుకుంది. దీంతో ఈ హైదరాబాద్ అమ్మాయి అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేం దుకు లైన్ క్లియర్ అయింది. వచ్చే వారం కొరియాలో జరిగే టోర్నీలో జ్వాల బరిలోకి దిగే అవకాశం ఉంది. గతవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తాతో కలిసిన జ్వాల... తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చినట్లు సమాచారం.
‘బాయ్ తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నా. భవిష్యత్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తా. దేశానికి ఆడటం చాలా గౌరవంగా భావిస్తున్నా’ అని జ్వాల పేర్కొంది. బ్యాడ్మింటన్ లీగ్‌లో కొంత మంది ఆటగాళ్లను మ్యాచ్ ఆడకుండా అడ్డుకుందనే ఆరోపణలతో బాయ్ క్రమశిక్షణ కమిటీ ఆమెపై జీవితకాల నిషేధం లేదా ఆరేళ్ల సస్పెన్షన్ విధించాలని ప్రతిపాదించింది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాన్ని బాయ్ అధ్యక్షుడికి వదిలేసింది.