‘మిక్స్‌డ్’లో జ్వాల జోడి ఓటమి
సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నీ
సైనాకు మరో పరీక్ష
సింగపూర్: భారత స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో జ్వాల-జిష్ణు సాన్యాల్ (భారత్) జోడి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. కేవలం 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వాల-జిష్ణు ద్వయం 14-21, 18-21తో తాంగ్ చున్ మాన్-సాజ్ కా చాన్ (హాంకాంగ్) జోడి చేతిలో ఓటమి పాలైంది. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
మహిళల సింగిల్స్‌లో భారత్ తరఫున ఏడో సీడ్ సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ పి.వి.సింధు, తన్వీ లాడ్, అరుంధతి పంతవానె, పి.సి.తులసి బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్‌లో ఎరికో హిరోస్ (జపాన్)తో సైనా; విరాంతో (ఇండోనేసియా)తో సింధు; ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా)తో తన్వీ లాడ్; షిజుకా ఉచిదా (జపాన్)తో అరుంధతి; అనా రాన్‌కిన్ (న్యూజిలాండ్)తో తులసీ ఆడతారు. ముఖాముఖిలో సైనా, హిరోస్ 3-3తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సైనా ఐదు టోర్నీల్లో ఆడింది. ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలువగా... మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో... ఆల్ ఇంగ్లండ్, స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లీ డాంగ్ కియున్ (దక్షిణ కొరియా)తో కశ్యప్; అబ్దుల్ లతీఫ్ (మలేసియా)తో సాయిప్రణీత్; టకుమా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్; రుంబాకా (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్; సితికోమ్ (థాయ్‌లాండ్)తో ప్రణయ్ పోటీపడతారు.