కామన్వెల్త్ విజేతలకు కాసుల పంట
కశ్యప్‌కు రూ. 50 లక్షలు
కోచ్‌లకు కూడా నగదు ప్రోత్సాహకం
తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్‌లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని బహుమతిగా ప్రకటించింది. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలుచుకున్న పారుపల్లి కశ్యప్‌కు రూ. 50 లక్షలు ప్రభుత్వం అందజేయనుంది. డబుల్స్‌లో రజతం సాధించిన గుత్తా జ్వాలకు రూ. 25 లక్షలు నగదు పురస్కారం దక్కనుంది.
కాంస్యాలు సాధించిన ఆటగాళ్లకు రూ. 15 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కామన్వెల్త్‌లో రాష్ట్రానికి చెందిన గురుసాయిదత్, పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాలు సాధించగా... షూటర్ గగన్ నారంగ్ ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకున్నాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌లను కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాతో గుర్తించింది.
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జ్వాల వ్యక్తిగత కోచ్ ఎస్‌ఎం ఆరిఫ్‌లకు కూడా చెరో రూ. 50 లక్షలు ప్రభుత్వం ప్రకటించింది. గ్లాస్గో క్రీడల్లో పాల్గొన్న జిమ్నాస్ట్ అరుణకు కూడా రూ. 3 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. మరో వైపు ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అనంతరం ప్రకటించిన మొత్తం ఇప్పటికీ అందుకోని సైనా నెహ్వాల్‌కు కూడా త్వరలో దానిని ఇస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ క్రీడాకారులను సన్మానించడంతో పాటు ప్రకటించిన నగదు మొత్తాలను అందజేస్తారు.
స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తాం: సీఎం
కామన్వెల్త్‌లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు బుధవారం సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్)ను కలిశారు. వీరితో పాటు కామన్వెల్త్‌లో పాల్గొనని సైనా నెహ్వాల్ కూడా సీఎంను కలిసింది. దాదాపు గంట పాటు ఆయన ఆటగాళ్లతో సుదీర్ఘంగా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని అన్నారు.
కనీసం ప్రతీ రెండు నెలలకు ఒక జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ నిర్వహించగలిగి... ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చే స్థాయిలో ఈ స్పోర్ట్స్ సిటీ ఉంటుందని సీఎం అన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలతో రావాలని ఈ సందర్భంగా ఆయన క్రీడా కార్యదర్శికి సూచించారు. ఈ సందర్భంగా కొత్త క్రీడా విధానం రూపొందించడానికి సంబంధించి ఈ ఆటగాళ్లు కొన్ని సూచనలు చేశారు.
అందుబాటులో ఉన్న స్టేడియాల్లో అకాడమీలను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిభ గల ఆటగాళ్లకు ఇవ్వాలనే సూచనను కూడా సీఎం పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఈ ఆటగాళ్లను కేసీఆర్ కోరారు. రాష్ట్ర క్రీడాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న క్రీడాకారులు.... ఈ అంశంపై ఆయన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతిరాజ్ శాఖ మంత్రి, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కె. తారక రామారావు (కేటీఆర్) కూడా ఇందులో పాల్గొన్నారు.