జ్వాలపై విచారణ అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరణ
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అనుమతి తెచ్చుకున్నా, ఈ హైదరాబాదీపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) విచారణ ప్రక్రియ మాత్రం జరగనుంది. ఆమెకు బాయ్ విచారణ చేపట్టకుండా స్టే విధించేందుకు ఢిల్లీ హైకో్ర్టు శుక్రవారం నిరాకరించింది.
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా జ్వాల అనుచిత ప్రవర్తనపై బాయ్ క్రమశిక్షణ సంఘం చర్యలకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ జ్వాల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ ప్రక్రియ జరపకుండా స్టే విధించాలని అభ్యర్థించింది. అయితే కోర్టు ఇందుకు నిరాకరించింది. టోర్నీలో పాల్గొనేందుకు ఇంతకుముందు అనుమతిచ్చామని గుర్తు చేస్తూ, బాయ్ విచారణ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని జస్టిస్ వీకే జైన్ పేర్కొన్నారు. బాయ్ తీసుకున్న నిర్ణయం సముచితంకాదని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చని జ్వాలకు సూచించారు.