షట్లర్స్ ఫ్యాక్టరీ | Shutlers factory.. Pullela Gopichand | Sakshi
Sakshi News home page

షట్లర్స్ ఫ్యాక్టరీ

Published Sun, Aug 20 2017 4:00 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM

Shutlers factory.. Pullela Gopichand

చాంపియన్లను తయారు చేస్తున్న పుల్లెల గోపీచంద్‌ అకాడమీ   
- అన్ని స్థాయిలలో విజేతలుగా నిలుస్తున్న ఆటగాళ్లు 
సంవత్సరాల శ్రమకు లభిస్తున్న ఫలితాలు  
భవిష్యత్తులో మరింత మంది స్టార్లు 

 
అది హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ప్రాంగణం... సుదీర్ఘంగా సాగిన ప్రాక్టీస్‌ తర్వాత లభించిన కొద్ది పాటి విరామ సమయం... ఆ కొద్ది సమయంలోనే తమ పరిచయం, తాము వచ్చిన కారణం, తమ ఆలోచనలను గోపీచంద్‌తో పంచుకునేందుకు పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అందులో ఎక్కువ మంది ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు. గోపీచంద్‌ అనుమతిస్తే అకాడమీతో జత కూడేందుకు... ఏదో రూపంలో స్పాన్సర్‌షిప్‌ అందజేసేందుకు వచ్చిన వారే. దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను వారు చర్చిస్తున్నారు. మరికొందరు ఆటగాళ్ల బ్రాండింగ్‌ గురించి, ఇతర ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్నారు. గోపీచంద్‌కు ఇటీవల ఇది రొటీన్‌గా మారిపోయింది. రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం నెగ్గిన తర్వాత ఇలాంటి వాటి కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. 
 
ఒకప్పుడు ఇదే అకాడమీ నిర్మాణం కోసం సహకారం కావాలంటూ ఆయన ఎక్కని, దిగని మెట్టు లేదు. అడగని కార్పొరేట్‌ సంస్థ లేదు. ఒక రకమైన లెక్కలేనితనంతో చిన్న చూపు చూసినవారు కొందరైతే... అసలు బ్యాడ్మింటన్‌ను ఎవరు పట్టించుకుంటారంటూ మొహం మీదే అనేసిన వారు మరెందరో. అయితే వారి మాటలు గోపీచంద్‌ లక్ష్యాన్ని మార్చలేదు. చాంపియన్లను తయారు చేయాలన్న తన పట్టుదల ముందు అవన్నీ చిన్న చిన్న విఘ్నాలుగా కనిపించాయే తప్ప... మనకెందుకులే ఇదంతా అంటూ కాడి పడేయాల్సినంతగా భయపెట్టలేదు. కష్టాలు, సమస్యలు ఎన్ని చెప్పుకున్నా... చివరకు ఫలితాలతోనే తనను ప్రపంచం అంచనా వేస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే వెనకడగు వేయలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ తన కలను నిజం చేసుకున్నారు. అకాడమీ నుంచి అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడంలో విజయవంతమయ్యారు.  
 
సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి... ఈ జాబితా ఇంతటితో ఆగిపోలేదు. రుత్విక శివాని, మేఘన, రాహుల్‌ యాదవ్‌... తదితరులు దీనికి కొనసాగింపు... గాయత్రి, సామియా, విష్ణు...ఇది రాబోయే విజేతల వరుస... ఒకరా, ఇద్దరా బ్యాడ్మింటన్‌ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న వారిలో ఎక్కువ మంది గోపీచంద్‌ అకాడమీ నుంచి వచ్చినవారే. భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా మారిన ఈ అకాడమీపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌....  
 
మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది
గోపీచంద్‌ 2004 నవంబర్‌లో ఆటగాడిగా ఆఖరి సారిగా ఒక అంతర్జాతీయ టోర్నమెంట్‌ బరిలోకి దిగారు. హైదరాబాద్‌లోనే జరిగిన ఆసియా శాటిలైట్‌ టోర్నీలో విజేతగా నిలిచారు. అప్పటికే వరుస గాయాలకు పదే పదే జరిగిన శస్త్ర చికిత్సల తర్వాత పునరాగమనంలో గెలిచిన టైటిల్‌ అది. ఈ విజయం తర్వాత ప్రధాన టోర్నీలలో మళ్లీ గెలవడం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. దాంతో ప్లేయర్‌గా కెరీర్‌ ముగిసింది.  
 
అదీ ఆరంభం... 
2001లో గోపీచంద్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచే సమయానికి భారత్‌లో బ్యాడ్మింటన్‌కు సౌకర్యాల పరంగా అనుకూల వాతావరణం ఏమీ లేదు. తర్వాతి మూడేళ్లలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్‌లో కూడా ఎల్బీ ఇండోర్‌ స్టేడియం మినహా మరో చెప్పుకోదగ్గ వేదిక లేదు. ఇలాంటి స్థితిలో ఆడిన గోపీచంద్‌... మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది బ్యాడ్మింటన్‌లో వెలుగులోకి రావొచ్చని నమ్మారు. అదే ఆలోచనతో కోచ్‌గా మారి బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.  
 
ప్రభుత్వ సహకారంతో... 
2004లోనే అప్పటి ‘శాప్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమితా దావ్రా చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో గోపీచంద్‌ అకాడమీని ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం వైపు నుంచి ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఇందులో పెద్ద మొత్తం ఇండోనేసియా కోచ్‌కే చెల్లించాల్సి వచ్చేది. కొంత మంది వర్ధమాన షట్లర్లు, కొత్తవారితో కలిసి 30 మందితో అకాడమీ ప్రారంభమైంది. సంవత్సరం పాటు ప్రభుత్వ నిధులతో అకాడమీ నడిచింది. కానీ ఆ తర్వాత ఆ మొత్తాన్ని కొనసాగించేందుకు వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ దశలో గోపీచంద్‌ సొంత డబ్బులతోనైనా అకాడమీని నడిపించాలని పట్టుదల ప్రదర్శించారు. 2008 వరకు సొంత డబ్బును ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది.  
 
అత్యుత్తమంగా... 
ప్రపంచ స్థాయి కోర్టులు, శిక్షణ, జిమ్, ఫిజియోలు, డైటింగ్‌... ఇలా ప్రతీ అంశంలో గోపీచంద్‌ అకాడమీ సౌకర్యాలపరంగా ‘ది బెస్ట్‌’గా నిలుస్తుంది. పదేళ్ల వయసు ఉన్న చిన్నారుల నుంచి రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు వరకు ప్రస్తుతం అందరికీ ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. 2008లో ఏర్పాటైన అకాడమీకి తోడు అవుటర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌ సమీపంలో 2016లో భారత క్రీడా ప్రాధికార సంస్థ  సహకారంతో గోపీచంద్‌ రెండో అకాడమీ కూడా ఏర్పాటైంది. రెండు అకాడమీల్లో కలిపి 150 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఆటగాళ్లందరినీ మొత్తం 6 గ్రూప్‌లుగా విభజించారు. సింధు, శ్రీకాంత్‌ తదితర ఆటగాళ్ల కోచింగ్‌ గోపీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. గోపీ కాకుండా మరో 15 మంది కోచ్‌లు పని చేస్తున్నారు. వీరంతా మిగతా గ్రూప్‌లలోని ఆటగాళ్లకు కోచింగ్‌ ఇస్తారు.   
 
నోయిడాలో కూడా... 
హైదరాబాద్‌లో గోపీచంద్‌ అకాడమీ సూపర్‌ సక్సెస్‌ తర్వాత దేశవ్యాప్తంగా కూడా తమ వద్ద అలాంటి అకాడమీలు ఏర్పాటు చేయాలని, ఎంత డబ్బయినా వెచ్చిస్తామని ఆయనకు అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో చాలా వాటిని గోపి తిరస్కరించారు. ‘వీళ్లంతా ఇలా పెట్టుబడి పెట్టగానే అలా లాభం మొదలు కావాలని భావించేవాళ్లే. క్రీడల్లో అది సాధ్యం కాదు. దానిని పక్కా వ్యాపార దృష్టితో వారు చూశారు. అందుకే అంగీకరించలేదు’ అని గోపీచంద్‌ చెప్పారు. తన ఆలోచనలకు తగినట్లుగా, కేవలం మంచి ఫలితాలు రావాలనే నమ్మకంతో ముందుకు వచ్చిన వారితో కలిసి న్యూఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆయన అకాడమీని ఏర్పాటు చేశారు. గోపీచంద్‌ పేరును జోడిస్తూ గ్వాలియర్, వడోదర, తణుకు, సేలంలలో కూడా అకాడమీలు ఉన్నా... వాటిలో ఆయన భాగస్వామ్యం లేదు. అవసరమైనప్పుడు ఆయన తగిన మార్గనిర్దేశనం చేస్తుంటారు.  
 
లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాతే
2008లో అకాడమీ ప్రారంభమైనా నిర్వహణ కోసం  చెప్పుకోదగ్గ మద్దతు లభించలేదు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం సాధించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఇక్కడ మెరికల్లాంటి షట్లర్లను తయారు చేసే అవకాశం ఉందని అంతా గుర్తించారు. భవిష్యత్తు విజయాల్లో తాము కూడా భాగం కావాలని అనేక కంపెనీలు భావించాయి. ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ కూడా ఆ తర్వాత భాగంగా మారింది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆసక్తి కనబర్చాయి. ఇక స్పోర్ట్స్‌ అథారిటీ, భారత బ్యాడ్మింటన్‌ సంఘం రెగ్యులర్‌గా జాతీయ జట్టు శిక్షణ శిబిరాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో అకాడమీకి ఆర్థిక భారం తగ్గింది. ఇక గత ఏడాది ‘రియో’లో సింధు పతకం తర్వాతనైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  
 
దీర్ఘకాలిక లక్ష్యాలు... 
ఇప్పుడు అకాడమీ నుంచి వరుస విజయాలతో కీర్తి కనకాదులు సొంతం చేసుకుంటున్నవారు ఒక్క రోజులో స్టార్లుగా మారిపోలేదు. ఎన్నో ఏళ్ల శ్రమ, పట్టుదల వాటి వెనక ఉన్నాయి. గోపీచంద్‌ కూడా అందరికీ ఇదే చెబుతారు. కఠోర ప్రాక్టీస్, సరైన డైట్, రోజూవారీ క్రమశిక్షణ... ఈ మూడింటిని ఒక వారమో, నెల రోజులో కాకుండా కనీసం పదేళ్ల పాటు ఒకే తరహాలో కొనసాగించగలవారు మాత్రమే ఆటలోకి అడుగు పెట్టాలి. ఇన్‌స్టంట్‌గా కాకుండా సుదీర్ఘ లక్ష్యాలతో శ్రమిస్తేనే ఫలితాలు ఆశించవచ్చు. అంతే కానీ ఉత్సాహంతో రావడం, కొద్ది రోజులకే ఇంకా చాంపియన్‌ కావడం లేదని భావిస్తే ఏ అకాడమీ కూడా ఏమీ చేయలేదు అని ఆయన అంటారు. 
 
నిధుల వేటలో... 
అకాడమీ నిర్మాణం కోసం అప్పటికే గోపీచంద్‌కు ప్రభుత్వం 5 ఎకరాల స్థలం కేటాయించినా... ఆర్థిక సమస్యలతో అటువైపు దృష్టి పెట్టలేదు. అయితే 2006లో జాతీయ జట్టు చీఫ్‌ కోచ్‌గా ఎంపికయ్యాక శిక్షణ పరిధి మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన గచ్చిబౌలి అకాడమీలో నిర్వహణ గురించి కొన్ని సమస్యలు తలెత్తాయి. దాంతో అన్ని సౌకర్యాలతో కొత్త అకాడమీని నిర్మించాలని గోపీచంద్‌ నిర్ణయించుకున్నారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అప్పటికి కొద్ది రోజుల క్రితమే కట్టుకున్న ఇల్లును గోపీచంద్‌ కుదువ పెట్టారు (2012లో ఈ అప్పు తీరింది).

అయితే ఆ మొత్తం ఏమాత్రం సరిపోలేదు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అండగా నిలవడంతో గోపీచంద్‌ కల సాకారమైంది. ఆయన రూ. 4.5 కోట్లు అకాడమీ కోసం ఇచ్చారు. చివరకు 2008లో నిమ్మగడ్డ ఫౌండేషన్‌–పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభమైంది. క్రీడా పరికరాల ఉత్పత్తుల్లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘యోనెక్స్‌’ మొదటి నుంచీ అకాడమీకి అండగా నిలుస్తోంది. ఇక్కడి ఆటగాళ్ల శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో అవసరమైన షటిల్స్‌ను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు గుర్తింపు తెచ్చుకున్న షట్లర్లకు పూర్తి స్థాయిలో కిట్‌ కూడా అందజేస్తోంది.

ఇది తమపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని గోపీచంద్‌ చెబుతారు. అంతా బాగున్న సమయంలో కొంత మంది తప్పుదోవ పట్టించిన కారణంగా మధ్యలో ఒకసారి భూమి వెనక్కి ఇమ్మంటూ ప్రభుత్వం నుంచి నోటీసు వచ్చింది. దాని కోసం కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజు అధికారికంగా పూర్తి స్థాయిలో అకాడమీ భూమి మా చేతికొచ్చింది. సమస్యలను అధిగమించి దీనిని సమర్థంగా నడిపించడంలో గవర్నర్‌ నరసింహన్‌తో పాటు ఐఏఎస్‌ అధికారులు ఎస్పీ సింగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కమల్‌వర్ధన్‌ రావు ఎంతో సహకరించారు అని గోపీచంద్‌ అన్నారు.  
 
ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు... 
‘సొంత అకాడమీ ఉంటూ జాతీయ జట్టు చీఫ్‌ కోచ్‌గా ఎలా పని చేస్తావు’ అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. నిజానికి అది నాకు ఒక పదవి మాత్రమే. హోదా ఎలా ఉన్నా అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేయడమే నా పని. ఏ అకాడమీ నుంచి ఆటగాళ్లు వచ్చినా చివరకు వారు భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తారు. దేశం కోసం పతకం గెలుస్తారు. అది ముఖ్యం. అకాడమీ కోచ్, భారత కోచ్‌ రెండింటినీ నేను సమన్వయపరుస్తూ వెళ్లానే తప్ప ప్రత్యేకంగా సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. అజయ్‌ జయరామ్‌ అగ్రశ్రేణి ఆటగాడు. అతను నా అకాడమీలో కాకుండా సొంతంగా ముంబైలో ప్రాక్టీస్‌ చేసుకుంటాడు.

కానీ భారత కోచ్‌గా అతడికి నేను నా వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాను. అంతే గానీ నా అకాడమీ షట్లర్‌ కాదని నేను భావించను. అన్నింటికి మించి అందరికి తెలియని విషయం ఏంటంటే నేను గత 11 ఏళ్లలో భారత కోచ్‌ హోదాలో ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. ఇండియన్‌ ఆయిల్‌లో ఉద్యోగిగా నాకు వచ్చే జీతం, నా భార్య లక్ష్మి జీతంతో పాటు మా నాన్నగారి ఆదాయాన్ని మేం పూర్తిగా వాడుకున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొంతున్న వారిలో 70 శాతం మంది నుంచి నేను ఎలాంటి ఫీజులు తీసుకోవడం లేదు. కార్పొరేట్లు ఇచ్చే సహకారంతోనే దానిని భర్తీ చేస్తున్నాను. అకాడమీ నిర్వహణ అనేది నాకు ఎప్పుడూ ఆదాయ వనరు కాదు. అలా ఆలోచించి దీనిని మొదలు 
పెట్టలేదు.  
 
ఆయన పిల్లలు కూడా... 
తల్లిదండ్రుల బాటలోనే గోపీచంద్, లక్ష్మీల ఇద్దరు పిల్లలు కూడా బ్యాడ్మింటన్‌పైనే దృష్టి పెట్టారు. ఇతర ట్రైనీలతో పాటు వీరిద్దరు కూడా అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నారు. నిబంధనల విషయంలో వారికీ ఎలాంటి వెసులుబాటు ఉండదని గోపి చెప్పారు. కూతురు గాయత్రి జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక టైటిల్స్‌ సాధించి తన ప్రత్యేకత ప్రదర్శించగా... కుమారుడు సాయి విష్ణు కూడా అదే బాటలో ఉన్నాడు.  
 
ప్రపంచంలో నంబర్‌వన్‌... 
గోపీచంద్‌ అకాడమీ నుంచి పెద్ద ఎత్తున ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. సైనా నెహ్వాల్, పీవీ సింధులు ఒలింపిక్‌ పతకాలతో చెలరేగితే... మిగతా వారంతా అనేక పెద్ద స్థాయి అంతర్జాతీయ టోర్నీలలో విజేతలుగా నిలిచి సత్తా చాటారు. ఈ విజయాల వరుసకు బ్రేక్‌ రాకుండా గోపీచంద్‌ జాగ్రత్త తీసుకుంటారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణపైనే పూర్తిగా దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయి బృందంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒకవేళ సీనియర్లు విఫలమైనా ఆ లోటు కనిపించకుండా... తర్వాతి వారు దానిని అందుకునే విధంగా వారికి కోచింగ్‌ ఇస్తారు. దాని వల్ల మళ్లీ అండర్‌–13 నుంచి సీనియర్‌ విభాగం వరకు ఎక్కడా విజయాలకు విరామం లభించదు. చైనాలో 50 అకాడమీలు ఎంతో మంది ఆటగాళ్లను తయారు చేస్తున్నాయి. కానీ ఒకే అకాడమీ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ షట్లర్లు రావడం ఎక్కడా జరగలేదు. సౌకర్యాలు, ఫలితాలపరంగా ప్రపంచంలోనే మా అకాడమీ నంబర్‌వన్‌ అని గట్టిగా చెప్పగలను. ఆ విషయంలో నేను గర్వపడుతున్నాను అని గోపీచంద్‌ చెబుతారు.  
 
గోపీ పరీక్ష తర్వాతే... 
సహజంగానే గోపీచంద్‌ అకాడమీకి ఇప్పుడు ఉన్న గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దాంతో తమ పిల్లలు అక్కడ చేరితే చాంపియన్లుగా మారతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే నేరుగా తీసుకొచ్చి అకాడమీలో చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తున్నారు. అయితే గోపీచంద్‌ చెప్పిన దాని ప్రకారం... గత మూడేళ్లుగా అకాడమీలో దాదాపుగా అడ్మిషన్లు ఆగిపోయాయి. బేసిక్స్‌ నేర్చుకునే లెర్నర్స్‌ విభాగంలోనైతే ఎవరినీ తీసుకోవడం లేదు. కొంత మంది పెద్ద స్థాయి సిఫారసులతో వచ్చినా సరే వారికి కూడా నో ఎంట్రీనే. అయితే ప్రాథమిక స్థాయిలో అప్పటికే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన వారిని తీసుకొని మరింతగా సానబెట్టే అవకాశం మాత్రం ఇక్కడ ఉంది. అదీ గోపీచంద్‌ స్వయంగా తనదైన శైలిలో ఆటలో పరీక్ష నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వారికి అవకాశం లభిస్తుంది. అసాధారణ ప్రతిభ ఉందంటూ వచ్చే కొందరికి కూడా ఇదే వర్తిస్తుందని ఆయన అంటున్నారు.  
 
క్రమశిక్షణకు కేరాఫ్‌... 
అగ్రశ్రేణి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకొని ఉండవచ్చు... అప్పటికే పెద్ద టోర్నీలలో వరుస విజయాలు సాధిస్తూ ఉండవచ్చు... కానీ అకాడమీలో క్రమశిక్షణ విషయానికి వచ్చేసరికి మాత్రం అంతా ఒక్కటే. ఏ ఒక్కరూ తమ పరిధి దాటి ప్రవర్తించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. తమకు ఇచ్చిన షెడ్యూల్‌ను కచ్చితంగా, సమర్థంగా పాటించాల్సిందే. ఇన్నేళ్లలో క్రమశిక్షణకు సంబంధించి అకాడమీ నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం విశేషం. తాను కూడా ఈ అంశంలో కఠినంగా వ్యవహరిస్తానని గోపీచంద్‌ అన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యవస్థలో వాతావరణం చెడగొట్టేవారు ఒకరో, ఇద్దరో కచ్చితంగా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెట్టేయడం చాలా అవసరం. ఇక్కడ ట్రైనింగ్‌ కూడా పూర్తిగా నేను ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే సాగాలి. కొంత మంది ఆటగాళ్లు బయట గెలిచి రాగానే ఇలా కాదు అలా ఆడాలి అన్నట్లుగా తమ షెడ్యూల్‌ తామే మార్చుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే జూనియర్లకు సలహాలిస్తూ మాస్టర్‌లా మారే ప్రయత్నం చేస్తారు. కానీ అలా ప్రవర్తిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం నేను అసలే ఇవ్వను అని ఆయన చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement