ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు
కోట్లాది భారతీయుల ఆకాంక్ష నెరవేరలేదు కానీ.. రియో ఒలింపిక్స్లో మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఫైనల్ సమరంలో భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైనా.. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది.
తొలి గేమ్ ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో మారిన్ దూసుకెళ్లగా, సింధు వెనుకబడింది. ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. మారిన్ కాసేపు ఆధిక్యతను కొనసాగించినా, సింధు పోరాటపటిమతో ఆమెను నిలువరించింది. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. సింధు ప్లేస్మెంట్లు, స్మాష్లతో అదరగొట్టింది.
రెండో గేమ్లో మారిన్ చెలరేగగా, సింధు జోరు తగ్గింది. ఆరంభంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యం ప్రదర్శించింది. తర్వాత సింధు, మారిన్కు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. కాగా మారిన్ వరుసగా 5 పాయింట్లు సాధించి 11-2 స్కోరుతో ముందంజ వేసింది. ఈ దశలో సింధు కాస్త జోరు పెంచడంతో స్కోరు 7-14కు చేరుకుంది. ఆనక మారిన్ను నిలువరించడంలో సింధు విఫలమైంది. స్పెయిన్ షట్లర్ అదే జోరు కొనసాగిస్తూ గేమ్ను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 1-1 గేమ్స్తో సమమైంది.
నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ మారిన్ దూకుడు ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు గెలిచి ముందంజ వేసింది. ఆ తర్వాత సింధుకు ఓ పాయింట్ రాగా, మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 6-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో సింధు పుంజుకుని వరుసగా రెండు పాయింట్లు గెలిచి మారిన్ను జోరును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. మారిన్ ఆధిక్యాన్ని 9-8కి తగ్గించిన సింధు స్కోరును 10-10తో సమం చేసింది. దీంతో ఫలితంపై ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. కాగా ఈ సమయంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ముందంజ వేసింది. తర్వాత మారిన్ను నిలువరించేందుకు సింధు శ్రమించినా ఫలితం లేకపోయింది. మారిన్ గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది.
కంగ్రాట్స్ సింధు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్
రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న పీవీ సింధుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సింధు సాధించిన విజయం చారిత్రాత్మకమని తన ట్వీట్లో కొనియాడారు. సింధు విజయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాందీ పలికే అద్భుతమైన, స్ఫూర్తిమంతమైన విజయమని ఆయన ప్రశంసించారు. సింధు తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు, కోచ్ గోపీచంద్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
Very well played @Pvsindhu1 Proud of your performance. Congrats on creating history by being the first Indian woman athlete to get a silver
— YS Jagan Mohan Reddy (@ysjagan) 19 August 2016