దూకుడు కొనసాగిస్తా! | I want to do well and win a medal at Rio 2016 Olympics: Saina Nehwal | Sakshi
Sakshi News home page

దూకుడు కొనసాగిస్తా!

Published Wed, Jun 15 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

దూకుడు కొనసాగిస్తా!

దూకుడు కొనసాగిస్తా!

దాదాపు 15 నెలల విరామం తర్వాత దక్కిన సూపర్ సిరీస్ టైటిల్... వరుసగా ముగ్గురు పటిష్ట ప్రత్యర్థులపై విజయం... ఆటతీరులో ఒక్కసారిగా అనూహ్య మార్పు... స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా, రియో ఒలింపిక్స్‌కు ముందు కీలక విజయాన్ని అందుకుంది. గాయం నుంచి కోలుకున్న అనంతరం దక్కిన ఈ విజయం రియో కోసం స్ఫూర్తినిస్తుందని ఆమె చెబుతోంది.
 
* సరైన సమయంలో టైటిల్ గెలిచా  
* ఒలింపిక్స్ స్వర్ణం సులువు కాదు 
* ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సైనా

సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను ప్రదర్శించిన ఆట తనకే ఆశ్చర్యం కలిగించిందని భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. గతానికి భిన్నంగా బాగా దూకుడుగా ఆడిన తాను, ఇకపై కూడా ఇలాగే ఆడతానని స్పష్టం చేసింది. సిడ్నీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన అనంతరం సైనా మంగళవారం మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...
 
తాజా విజయంపై...
నా దృష్టిలో ఇది చాలా గొప్ప విజయం. వరల్డ్ చాంపియన్‌షిప్, చైనా ఓపెన్‌లో ఫైనల్ చేరినా... టైటిల్ దక్కలేదు. అన్నింటికీ మించి రెండు నెలలు కాలి గాయంతో తీవ్రంగా బాధపడ్డాను. ఒక దశలో ఏమైపోతుందో అనిపించింది. అలాంటిది ఇప్పుడు కోలుకొని మళ్లీ టైటిల్ గెలవగలిగాను. ఈ దశలో నాకు ఒక విజయం ఎంతో అవసరం. ర్యాంకింగ్ తగ్గడంతో నాపై ఒత్తిడి కూడా నెలకొంది. నిజాయితీగా చెప్పాలంటే ఫిట్‌నెస్ నిరూపించుకుంటే చాలనుకున్నాను. గెలవడంపై ఆశలు పెట్టుకోలేదు.  కీలకమైన ఒలింపిక్స్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసం పెంచే విజయం ఇది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది.
 
టోర్నీలో ఎదుర్కొన్న ప్రత్యర్థులపై...
గతంలో నాకు ఎప్పుడూ ఒకే టోర్నీలో ఇంత సవాల్ ఎదురు కాలేదు. రెండో రౌండ్‌లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌తో పాటు క్వార్టర్స్‌లో రచనోక్, సెమీస్ యిహాన్, ఫైనల్లో సున్ యులాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులతో తలపడాల్సి వచ్చింది. చాలా కఠినమైన మ్యాచ్‌లు ఎదుర్కొని టైటిల్ సాధించగలిగాను. ముఖ్యంగా రచనోక్‌తో మ్యాచ్‌లో తొలి గేమ్ ఒక్కటే 40 నిమిషాలు సాగింది. 28-26తో గెలవడం నాపై నమ్మకాన్ని పెంచింది. ఒలింపిక్స్‌కు ముందు ఇలాంటి మ్యాచ్‌లు ఆడటం కూడా మంచిదే. నేను కష్టపడేందుకు ఎప్పుడూ వెనుకాడను. తొలి మ్యాచ్ ఓడినా నా సాధన తీరులో తేడా ఉండదు. కానీ గొప్ప మ్యాచ్‌లు గెలిచినప్పుడు కలిగే ఆనందమే వేరు.
 
రియోలో పతకావకాశాలపై...
ప్రతీ ప్లేయర్‌కు ఒలింపిక్ మెడల్ అనేది ఒక కల. నేను ఒకసారి సాధించగలిగాను. కానీ ఇప్పుడు దానికంటే మెరుగ్గా ఆడి స్వర్ణం గెలవాలని భావిస్తున్నా. కానీ అంత సులువు కాదు. ప్రతీ దేశానికి చెందిన షట్లర్లు ఎంతో సన్నద్ధమై వస్తారు. ఇతర టోర్నీలతో పోలిస్తే మరింత పోటీ ఉంటుంది. అయితే నేను చాలా కష్టపడుతున్నా. నా శ్రమ వృధా పోదని నమ్మకం. 100 శాతం కష్టపడతా. అప్పటి వరకు నేను జాగ్రత్తగా ఫిట్‌నెస్ కాపాడుకోవడంపై కూడా దృష్టి పెట్టా. ఈసారి ఒలింపిక్స్‌కు నాతో పాటు మా నాన్న కూడా వస్తున్నారు. నాలుగు రోజులు ముందుగా వెళితే అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేస్తుంది. ఇక మరో టోర్నీ లేకుండా నేరుగా ఒలింపిక్సే లక్ష్యం.
 
మారిన ఆట శైలిపై...
క్రికెట్‌లో విరాట్ కోహ్లి తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. మా షట్లర్లలో కరోలినా మారిన్ చాలా వేగంగా ఆడుతుంది. నిజానికి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నా ఆటతీరు నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇంత దూకుడుగా నేను ఎప్పుడూ ఆడలేదు. చాలా ఎక్కువ సార్లు స్మాష్, హాఫ్ స్మాష్‌లు కొట్టాను. కొన్ని రోజులుగా సాధన చేశాను కానీ ఫలితం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఎంత దూకుడుగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. కోర్టులో వేగంగా కదిలే ఉత్సాహం వస్తుంది. మున్ముందు కూడా ఇదే తరహాలో అటాకింగ్ ఆటను ఆడాలని నిర్ణయించుకున్నా.
 
కోచ్ విమల్ కుమార్ పాత్రపై...
స్ట్రోక్స్ మెరుగు కావడంలో విమల్ కుమార్ సర్ పాత్ర ఎంతో ఉంది. నా ఆటలో వేగం పెరిగేందుకు కూడా ఆయనే కారణం. నాతో పాటు వచ్చిన ఇండోనేసియా కోచ్ ఉమేంద్ర రాణా కూడా ఎంతో సహకరించారు. గాయం వల్ల నా కాళ్లలో కొంత చురుకుదనం తగ్గింది. కానీ వారి శిక్షణతో మెల్లమెల్లగా అంతా సర్దుకుంది. ఈ మధ్య అమ్మాయిలు కూడా చాలా వేగంగా ఆడుతున్నారు. దానిని అందుకోవాలంటే కొత్త తరహా వ్యూహాలతో సిద్ధం కావాలి. ఇప్పుడు వెంటనే నా రియో సన్నాహాలు మొదలవుతాయి. నెలన్నర రోజులు శ్రమిస్తాను. సాంకేతికంగా నేను గొప్ప ప్లేయర్‌ను కాకపోయినా కష్టపడే నేను నా ఆటను మెరుగుపర్చుకున్నా. కోచ్‌తో పాటు ఫిజియో, ఇతర సిబ్బంది కూడా నా గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒలింపిక్స్‌లో నా విజయావకాశాలు పెంచుతాయని నా నమ్మకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement