'రియోకు వెళ్లకుండా ఉండాల్సింది'
గ్లాస్కో: గతేడాది రియో ఒలింపిక్స్ కు వెళ్లి పెద్ద పొరపాటు చేశానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తాజాగా స్పష్టం చేశారు. ఆ మెగా ఈవెంట్ కు వెళ్లకుండా ఉండే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లాస్కోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ లో సెమీస్ కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న నేపథ్యంలో సైనా మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా దాదాపు ఏడాది పాటు ఎదురైన పరాజయాల్ని గుర్తు చేసుకున్నారు. ' నేను రియోకు వెళ్లకుండా ఉండాల్సింది. నాకు గాయం అంత పెద్దదనే విషయం నాకు అప్పుడు తెలియదు. రియో ఒలింపిక్స్ లో ఆదిలోనే నిష్క్రమించడం చాలా బాధించింది. నా తల్లిదండ్రులు, కోచ్ సాయంతో తిరిగి పుంజుకున్నా. ఇంకా కుడి మోకాలు ఇబ్బందిగానే ఉంది'అని సైనా తెలిపింది.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో సెమీస్ కు చేరడం సంతోషం కల్గించిందని సైనా పేర్కొంది. ఈ చాంపియన్ షిప్ లో తనకు కష్టమైన డ్రా ఎదురుకావడంతో పతకం సాధిస్తానని అనుకోలేదన్న సైనా.. సెమీస్ కు చేరడం ఒక గొప్ప అనుభూతిని తీసుకొచ్చిందని తెలిపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 21-15 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై గెలుపొంది సెమీస్ బెర్తును పతకాన్ని ఖాయం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈరోజు జరిగే సెమీ ఫైనల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.