తై జు యింగ్ , సైనా నెహ్వాల్
ఓడెన్స్: ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 52 నిమిషాల్లో 13–21, 21–13, 6–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేత తై జు యింగ్‌కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది వరుసగా 11వ పరాజయంకాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే సైనా ఓడిపోయింది.
ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్ ఆడుతోన్న తై జు యింగ్ తొలి గేమ్ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11–5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం తై జు యింగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment