TAI Tzu Ying
-
మలేసియా మాస్టర్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ.. మళ్లీ తైజు చేతిలో ఓటమి
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది. తొలి సెట్ లో ఓడిపోయిన సింధు, రెండో సెట్ లో పుంజుకుని విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో తైజు చేలరేగి ఆడింది. దీంతో మరో విజయాన్ని తైజు తన ఖాతాలో వేసుకుంది. కాగా తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్‌ఫైనల్స్‌లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు 22 మ్యాచ్‌ల్లో వీరిద్దరూ తలపడగా..5 మ్యాచ్‌ల్లో సిందూ,17 మ్యాచ్‌ల్లో తై జూ విజయం సాధించింది. చదవండి: Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే! -
తైజుయింగ్ మనసు గెలుచుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించి యావత్ భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్న తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్లో తనను ఒడించిన చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్ మనసు కూడా గెల్చుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఓటమి తరువాత సింధు నిజాయితీగా అందించిన మద్దతుతో తనకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు తైజూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. బంగారు పతకాన్ని కోల్పోవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒలింపిక్స్ కలల వేదికపై మూడోసారి అడుగుపెట్టి.. చివరకు ఫైనల్‌కు చేరుకున్నాను, కానీ ఫైనల్లో విజయం సాధించలేకపోయాను. లోపాలు ఎప్పుడూ ఉంటాయి, అయినా మెరుగైన ఫలితాన్ని సాధించడం ఉత్సాహాన్నిచ్చింది. తైజూయింగ్ యూ ఆర్ గ్రేట్ అంటూ తనను తాను అభినందించుకోవడం విశేషం ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటూ సింధుపట్ల తన గౌరవాన్ని చాటుకుంది. మ్యాచ్ తర్వాత సింధు పరుగెత్తుకువచ్చి ఆలింగనం చేసుకుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా, టప్ ఫైట్ ఇచ్చారు. కానీ ఈ రోజు మీది కాదంటూ అనునయంగా చెప్పి తను ఏడిపించేసిందంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు. కాగా రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా వీసీ సింధు రికార్డు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో తైజుయింగ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, కాంస్య పతకం మ్యాచ్‌లో హీ బింగ్ జియావోను ఓడించింది. దీంతో వీవీ సింధుపై ప్రశంసల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌కు ఒలింపిక్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. గట్టిగా పోరాడినప్పటికీ చైనాకు చెందిన చెన్ యు ఫే (18-21, 21-19, 18-21 తేడాతో) చేతిలో ఓటమి పాలై తైజుయింగ్ గోల్డ్ మెడల్ చేజార్చుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా పోరాడి చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. View this post on Instagram A post shared by Tai Tzu Ying戴資穎 (@tai_tzuying) -
పీవీ సింధూపై తైజుయింగ్ ప్రతీకారం, తొలిసారి ఫైనల్‌కు..
టోక్యో: గత రెండు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరని తైజుయింగ్ ఎట్టకేలకు పతకానికి బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్లో పీవీ సింధూను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రియో ఒలింపిక్స్‌లో సింధూ చేతిలో ఓడిన తైజూయింగ్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఫలితంగా తన కేరీర్లో తొలి ఒలింపిక్స్ పతకం అందుకోనుంది. శనివారం జరిగిన సెమీస్-2 మ్యాచ్‌లో పీవీ సింధూపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన తైజు దూకుడైన ఆటతో వరుస గేమ్‌లలో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 21-18, రెండో గేమ్‌ను 21-12 తేడాతో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక తైజుయింగ్ చేతిలో సింధూకు ఇది 14 వ ఓటమి. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు ముఖా ముఖి తలపడగా సింధూ కేవలం 5 సార్లు మాత్రమే విజయం సాధించింది. తాజాగా పోటీపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పీవీ సింధూ వరుసగా ఓటముల పాలైంది. తన కేరీర్లో మెత్తం 559 మ్యాచ్‌ల్లో 407 గెలిచిన తైజుయింగ్ ప్రపంచ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో చైనా షట్లర్ చెన్ యూ ఫెయ్ తో తైజుయింగ్ తలపడనుంది. మరో వైపు కాంస్య పతకం వేటలో హీ బింగ్ జియాతో సింధూ పోటీపడనుంది. రియో ఒలింపిక్స్‌లో సింధు తైజుయింగ్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సెమీఫైనల్లో పీవీ సింధుకు కఠిన సవాల్? పైచేయి ఎవరిదో?
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పీవీ సింధుకు సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తైజుయింగ్ (చైనీస్ తైపీ) రూపంలో కఠిన సవాల్ ఎదురుకానుంది. ఎందుకంటే ఇప్పటివరకు సింధు, తైజుయింగ్‌తో 18 సార్లు తలపడగా కేవలం ఐదు సార్లు మాత్రమే విజయం సాధించింది. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన తైజుయింగ్ అద్భుత ప్రదర్శలతో 12 మ్యాచుల్లో విజయం సాధించింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. తన కేరీర్లో మెత్తం 558 మ్యాచ్‌ల్లో 406 గెలిచిన తైజుయింగ్ ప్రపంచ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు తైజుయింగ్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలుచుకోలేదు.ఇది సింధుకు కాస్త ఊరటనిచ్చే విషయం. ముఖ్యంగా లండన్, రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న తైజుయింగ్ కనీసం క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకపోవడం గమనార్హం. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఆమె ఓటమి పాలైంది. 2020 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి తైజుయింగ్ రియో ఒలింపిక్స్‌కు ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఇద్దరి మధ్య శనివారం జరగనున్న సెమీఫైనల్ పోరుకై ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరిది పైచేయి అవుతుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది. -
చాంప్స్ తై జు యింగ్, అక్సెల్సన్
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చాంపియన్స్‌గా నిలిచారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అక్సెల్సన్ 21–13, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... తై జు యింగ్ 21–19, 21–15తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ చెన్ యుఫె (చైనా)ను బోల్తా కొట్టించింది. 1999లో పీటర్ గేడ్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి డెన్మార్క్ ప్లేయర్‌గా అక్సెల్సన్ గుర్తింపు పొందాడు. సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన అక్సెల్సన్, తై జు యింగ్‌లకు 77 వేల డాలర్ల చొప్పున (రూ. 57 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో బెంగళూరు రాప్టర్స్
నేడు జరిగే తొలి సెమీఫైనల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు; శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో పుణే సెవెన్ ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ జట్టు తలపడతాయి. ఆదివారం ఫైనల్ జరుగుతుంది సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 5–0తో అవధ్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. గెలిచిన జట్టే ముందంజ వేసే ఈ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్, బ్రైస్ లెవెర్డెజ్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో అదరగొట్టారు. ‘ట్రంప్’ మ్యాచ్‌లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ నెగ్గడంతో రాప్టర్స్ రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీస్ దారిని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ వారియర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, పుణే సెవెన్ ఏసెస్ సెమీస్ చేరాయి. పురుషుల డబుల్స్‌తో మొదలైన ఈ పోరులో అరుణ్ జార్జి–రియాన్ అగుంగ్ సపుట్రో (రాప్టర్స్) జోడీ 15–14, 7–15, 11–15తో సంగ్ హ్యూన్–షిన్ బెక్ చియోల్ (అవధ్) ద్వయం చేతిలో కంగుతింది. అయితే అవధ్ ‘ట్రంప్’ పోరులో జయరామ్ 9–15, 9–15తో లెవెర్డెజ్ (రాప్టర్స్) చేతిలో ఓడిపోవడంతో వచ్చిన పాయింట్ కూడా చేజారింది. మహిళల సింగిల్స్‌లో తై జు యింగ్ (రాప్టర్స్) 15–12, 15–12తో బీవెన్ జాంగ్ (అవధ్)పై నెగ్గింది. అనంతరం రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా సాయిప్రణీత్ (రాప్టర్స్) 15–11, 15–13తో విన్సెంట్ (అవధ్)ను ఓడించి జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 4–0తో అవధ్‌పై గెలుపును ఖాయం చేసుకుంది. ఇక ఆఖరి మిక్స్డ్ డబుల్స్ పోరులో చన్ పెంగ్ సూన్– ఇయోమ్ హి వోన్ (రాప్టర్స్) జోడీ 7–15, 15–12, 15–11తో సంగ్ హ్యూన్–క్రిస్టీనా పెడర్సన్ (అవధ్) జంటపై గెలిచింది. -
మళ్లీ ఓడిన సింధు
సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. మహిళల సింగిల్స్‌లో సింధు 15–11, 13–15, 9–15తో తై జు యింగ్ (బెంగళూరు రాప్టర్స్) చేతిలో ఓడింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 0–3తో బెంగళూరు రాప్టర్స్ చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో సత్తా చాటిన సింధు... తర్వాతి రెండు గేమ్‌ల్లో విఫలమై పరాజయం పాలైంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్‌లో బెన్ లేన్–వ్లాదిమిర్ ఇవనోవ్ (హైదరాబాద్) ద్వయం 13–15, 15–9, 12–15తో పెంగ్ సూన్ చాన్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన హైదరాబాద్ ప్లేయర్ సౌరభ్ వర్మ 12–15, 15–10, 6–15తో బ్రైస్ లెవెర్డెజ్ (బెంగళూరు) చేతిలో ఓడాడు. పీబీఎల్ నిబంధనల ప్రకారం ‘ట్రంప్ కార్డు’ వాడిన ఆటగాడు ఓడితే... అతని జట్టుకు ఒక పాయింట్‌ను పెనాల్టీగా విధిస్తారు. దాంతో హైదరాబాద్ (–1)–2తో వెనుకబడింది. మిక్స్డ్ డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పెంగ్ సూన్ చాన్–యోమ్ హే వోన్ (బెంగళూరు) జోడీ 13–15, 11–15తో వ్లాదిమిర్ ఇవనోవ్–సిక్కిరెడ్డి (హైదరాబాద్) ద్వయం చేతిలో ఓడింది. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో డారెన్ లియూ (హైదరాబాద్) 11–15, 6–15 తో సాయి ప్రణీత్ (బెంగళూరు)చేతిలో ఓడాడు. -
హంటర్స్‌కే సింధు
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో మరోసారి ఇద్దరు అగ్రశ్రేణి షట్లర్ల హవా కొనసాగింది. పీవీ సింధు, తై జు యింగ్‌లను లీగ్ అనుమతించిన గరిష్ట మొత్తం రూ. 77 లక్షలకు వరుసగా హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు రాప్టర్స్ జట్లు సొంతం చేసుకున్నాయి. ఐదో సీజన్ కోసం మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వేలంలో మొత్తం 154 మంది షట్లర్లు పాల్గొన్నారు. ఏడు జట్లు ఒక్కో ఆటగాడిని కొనసాగించాయి. వేలానికి ముందే ఇద్దరు స్టార్లు సైనా నెహా్వల్, కిడాంబి శ్రీకాంత్ టోరీ్నకి దూరం కాగా... రెండు జట్లు ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ కూడా ఆరి్థకపరమైన కారణాలతో పీబీఎల్ నుంచి తప్పుకోవడంతో లీగ్ 9 జట్ల నుంచి 7కు తగ్గింది. చెన్నై స్మాషర్స్ జట్టు పేరు మార్చుకొని ఈసారి చెన్నై సూపర్‌స్టార్స్‌గా బరిలోకి దిగనుంది. న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో మరోసారి సొంత జట్టుకే ప్రాతినిధ్యం వహించనుంది. మంగళవారం జరిగిన వేలంలో హైదరాబాద్ హంటర్స్ రూ. 77 లక్షలతో సింధును కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. పీబీఎల్ నిబంధనల ప్రకారం గత ఏడాది ఒక ప్లేయర్‌కు గరిష్టంగా రూ. 70 లక్షలు చెల్లించారు. సింధుకు కూడా అదే మొత్తం దక్కింది. ఈ ఏడాది వారిని కొనసాగించాలంటే రూ. 70 లక్షలు గానీ లేదంటే అదనంగా 10 శాతం మించకుండా ఇవ్వవచ్చు. దాంతో హంటర్స్ రూ. 77 లక్షలతో సింధును సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)కి కూడా వేలంలో రూ. 77 లక్షలు దక్కాయి. గత సీజన్లో తై జు యింగ్ అహ్మదాబాద్ టీమ్‌కు ఆడింది. అయితే ఈసారి ఆ జట్టు లేకపోవడంతో వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. కనీస విలువ రూ. 70 లక్షలతోనే తై జు వేలం ప్రారంభమైంది. బెంగళూరు, పుణే ఆమె కోసం పోటీపడి రూ. 77 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దాంతో నిబంధనల ప్రకారం ‘డ్రా’ తీశారు. ఇందులో ఆమె డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టుకు ఎంపికైంది. ఇటీవల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న డబుల్స్ స్పెషలిస్ట్ సాత్విక్ సాయిరాజ్ వేలం ఆసక్తికరంగా సాగింది. కనీస ధర రూ. 25 లక్షలతో అతని వేలం మొదలు కాగా... హైదరాబాద్, అవ«ద్‌లతో పోటీ పడి చివరకు రూ. 62 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్íÙప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ను రూ. 32 లక్షలకు బెంగళూరు అట్టి పెట్టుకుంది. వేలంలో చెప్పుకోదగ్గ విలువ పలికిన కీలక ఆటగాళ్లలో పారుపల్లి కశ్యప్ (రూ. 43 లక్షలు–ముంబై), సౌరభ్ వర్మ (రూ. 41 లక్షలు–హైదరాబాద్) ఉన్నారు. యువ సంచలనం లక్ష్య సేన్‌ను చెన్నై రూ. 36 లక్షలకు తీసుకుంది. స్టార్స్ దూరం... గత సీజన్లో ఆడిన ప్రపంచ మాజీ చాంపియన్ అక్సెల్సన్ (డెన్మార్క్), ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆంటోన్సెన్ (డెన్మార్క్), రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఈసారి బరిలోకి దిగడం లేదు. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా, శ్రీకాంత్, సమీర్ వర్మ, ప్రణయ్ కూడా ఆడటంలేదు. వేలంలో పేరు నమోదు చేసుకున్నా భారత డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పను ఏ జట్టూ తీసుకోలేదు. ►10 పీబీఎల్–5లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న క్రీడాకారుల సంఖ్య. సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సుమీత్ రెడ్డి, పుల్లెల గాయత్రి, రుత్విక శివాని, సిక్కి రెడ్డి, రితూపర్ణ దాస్ (తెలంగాణ); పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్). -
సెమీస్‌కు చేరిన పీవీ సింధు
బాసెల్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై ఆమె 12-21, 23-21, 21-19 తేడాతో గెలుపొందింది. కాగా నిన్న జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించిన విషయం తెలిసిందే. -
ఎదురులేని సింధు
గ్వాంగ్జౌ (చైనా): సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న సింధు లీగ్ దశను అజేయంగా ముగించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలుపొందింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అకానె యామగుచి 21–18, 11–12తో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గాయం కారణంగా తై జు యింగ్ రెండో గేమ్ మధ్యలో వైదొలగడంతో యామగుచిని విజేతగా ప్రకటించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు; నొజోమి ఒకుహారా (జపాన్)తో అకానె యామగుచి తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో భారత యువతార సమీర్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–9, 21–18తో కాంతపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) 21–14, 21–8తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచాడు. రెండు విజయాలు సాధించిన సమీర్ వర్మ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో షి యుకి (చైనా)తో సమీర్ వర్మ; సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో కెంటో మొమోటా ఆడతారు. -
తై జుకు సింధు చెక్
రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్‌పై సింధు విజయం సాధించింది... అంతే ఆ తర్వాత ఆమెను ఈ చైనీస్ తైపీ ప్రత్యర్థి వెంటాడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సార్లు తై జు ముందు సింధు తలవంచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు మార్చినా తెలుగమ్మాయికి విజయం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు ఆమె ప్రత్యర్థి అడ్డుగోడను ఛేదించింది. అద్భుత ప్రదర్శనతో తై జును ఓడించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. తొలి గేమ్‌ను కోల్పోయినా ఆ తర్వాత సింధు కోలుకున్నతీరు అసమానం. గ్వాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్ సవాల్‌ను ఛేదించింది. తనకు పదేపదే పరాజయాన్ని చవిచూపిస్తున్న చైనీస్ తైపీ ప్రత్యర్థిని కసిదీరా ఓడించింది. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ ఈవెంటైన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఎ’ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగుతేజం, ఒలింపిక్ రన్నరప్ సింధు 14–21, 21–16, 21–18తో తై జును కంగుతినిపించింది. తొలి గేమ్‌లో ప్రతికూల ఫలితం వచ్చినా... తర్వాత గేముల్లో పట్టుదలతో ఆడింది. చివరి దాకా పట్టుసడలించకుండా ఆడిన సింధు 2–1 గేమ్‌లతో ప్రత్యర్థిని ఓడించింది. మొదటి 16 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో తై జు జోరే కనబడింది. అనవసర తప్పిదాలతో పాటు విన్నర్స్ కొట్టడంలో విఫలమైన సింధు 2–6తో వెనుకబడింది. స్మాష్‌లు, రిటర్న్ షాట్లతో తై జు తన ఆధిక్యాన్ని 17–12కు పెంచుకుంది. కాసేపటికే మరో నాలుగు పాయింట్లు సాధించిన తైపీ నంబర్‌వన్ తొలి గేమ్‌ను 21–14తో ముగించింది. ఇక రెండో గేమ్‌లో మాత్రం సింధు జాగ్రత్తగా ఆడింది. గేమ్ మొదలైన కాసేపటికే 6–3తో తన ఆధిపత్యాన్ని చాటింది. సుదీర్ఘ ర్యాలిలో మరింత దూకుడు కనబర్చిన సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడింది. చూస్తుండగానే 11–6కు చేరిన ఆమె... ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్ ను చేజిక్కించుకునేదాకా చెమటోడ్చింది. 19–13 స్కోరుకు చేరాక సింధు ఈ గేమ్‌ను క్షణాల వ్యవధిలోనే తన వశం చేసు కుంది. చివరి గేమ్‌లో మొదట 0–3తో వెనుకబడిన భారత స్టార్ మ్యాచ్ సాగుతున్న కొద్ది టచ్‌లోకి వచ్చింది. 11–12 స్కోరుతో ప్రత్యర్థిని నిలువరించిన ఆమె క్రాస్ కోర్టు రిటర్న్ షాట్లతో తై జు యింగ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి గేమ్ తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ పోరులో సమీర్ వర్మ 21–16, 21–7తో వరుస గేముల్లో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. -
సైనాకు మళ్లీ నిరాశ
ఓడెన్స్: ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 52 నిమిషాల్లో 13–21, 21–13, 6–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేత తై జు యింగ్‌కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది వరుసగా 11వ పరాజయంకాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే సైనా ఓడిపోయింది. ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్ ఆడుతోన్న తై జు యింగ్ తొలి గేమ్ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11–5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం తై జు యింగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
సింధు రెండో‘సారీ’
కౌలూన్ (హాంకాంగ్): బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. వరుసగా రెండో ఏడాది ఆమె రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18–21, 18–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌తో సింధు ఈ సీజన్‌ను ముగిస్తుంది. చివరిసారి గతేడాది రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు చేతిలో ఓడిన తై జు యింగ్ ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. 44 నిమిషాలపాటు జరిగిన హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు యింగ్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తై జు యింగ్ వ్యూహాత్మక ఆటతీరు ముందు సింధు ప్రణాళికలు పనిచేయలేదు. తొలి గేమ్ ఆరంభంలోనే 3–0తో, ఆ తర్వాత 7–2తో ఆధిక్యంలోకి వెళ్లిన తై జు యింగ్ అదే దూకుడుతో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 12–12 వద్ద తై జు యింగ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. -
సైనా నెహ్వాల్ అవుట్
దుబాయ్:భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల గ్రూప్-బి మ్యాచ్ లో సైనా నెహ్వాల్ 21-16, 18-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 51నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా పోరాడి ఓడింది. తొలి సెట్ ను సైనా అవలీలగా గెలిచినా.. రెండో సెట్ లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.ఈ క్రమంలోనే రెండో సెట్ ను సైనా కోల్పోయింది. కాగా నిర్ణయాత్మక మూడో సెట్ లో తీవ్ర ఒత్తిడికి లోనైన సైనా 14-21 తో గేమ్ ను చేజార్చుకుంది. దీంతో సైనా ఖాతాలో ఒక గెలుపు, రెండు ఓటములు ఉండటంతో టోర్నమెంట్ నుంచి నిష్ర్రమించక తప్పలేదు.