Denmark Open badminton tournament
-
డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం
ఓడెన్స్ (డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్.. జపాన్‌కు చెందిన కొడాయ్ నరవోకా చేతిలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలవ్వగా, ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి జోడీ.. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వేయ్ ఇక్ జోడీ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. వీరి ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం సమాప్తమైంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ప్రిలిమినరీ దశలో ఓటమిపాలయ్యారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ ముందంజ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. డబుల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు
ఒడెన్స్: టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 36 నిమిషాల్లో 11–21, 12–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది. ఆన్ సెయంగ్‌తో పోరులో సింధు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. తొలుత సింధు 2–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఆన్ సెయంగ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఆన్ సెయంగ్ వెనుదిరిగి చూడలేదు. ఇక రెండో గేమ్‌లోనూ ఆన్ సెయంగ్ జోరు కొనసాగింది. ఈ గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరు స్కోర్లు సమం కాకపోవడం ఆన్ సెయంగ్ ఆధిపత్యానికి నిదర్శనం. మరోవైపు టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ తొలి గేమ్‌ను 17–21తో చేజార్చుకున్నాక గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 12–21, 21–15తో బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్ (థాయ్‌లాండ్)పై పోరాడి గెలిచింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు సులభంగా చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న బుసానన్ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారి తీసింది. ఇక్కడ లయను అందుకున్న సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21–23, 9–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, లక్ష్యసేన్ 15–21, 7–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 15–21, 15–21తో గో జె ఫీ–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంట చేతిలో ఓడగా... మరో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 15–21, 21–17, 12–21తో ఫజార్ అల్ఫియాన్– మొహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం ధ్రువ కపిల–సిక్కి రెడ్డి 17–21, 21–19, 11–21తో తాంగ్ చున్మన్– త్సెయింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ జోరు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత అగ్రశ్రేణి షట్లర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–14తో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–15, 7–21, 17–21తో హాన్స్ క్రిస్టియాన్ సోల్బెర్గ్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. దూకుడే మంత్రంగా... 33 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే 9–4తో జోరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు 11–8తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17–9తో దూసుకెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆరంభంలో శ్రీకాం త్ 5–8తో వెనుకబడ్డాడు. ఈ దశలో పుంజుకున్న అతను వరుసగా 6 పాయింట్లు స్కోర్ చేసి 11–8తో రేసులోకి వచ్చాడు. జేసన్ 10–11తో శ్రీకాంత్‌ను సమీపించాడు. మరోసారి ధాటిగా ఆడిన శ్రీకాంత్ 15–11... 19–11తో ప్రత్యర్థిపై దాడి చేసి విజయా న్ని దక్కించుకున్నాడు. నేడు జరుగనున్న క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్–2 ఆటగాడు చౌ టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
ఒడెన్స్: దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు శుభారంభం లభించింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–18తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ లభించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్ ముఖాముఖి కెరీర్లో టోబీ పెంటీపై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు వీరిద్దరు 2013 థాయ్‌లాండ్ ఓపెన్‌లో తలపడగా... శ్రీకాంత్ వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రౌండ్లో జేసన్ 21–13, 21–18తో భారత్‌కు చెందిన శుభాంకర్ డేను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 12–21, 14–21తో పరాజయం పాలయ్యాడు. ‘తొలి గేమ్‌లో చక్కగా ఆడాను. రెండో గేమ్‌లో టోబీ పుంజుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగుపెట్టాను. ఇదో సాహసకార్యంలా అనిపిస్తోంది. గతంలో ఏనాడూ నేనింతకాలం మ్యాచ్‌లు ఆడకుండా విరామం తీసుకోలేదు. మొత్తానికి శుభారంభం చేసినందుకు ఆనందంగా ఉంది. కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. నా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. చివరిసారి నేను మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడి తొలి రౌండ్లోనే ఓడిపోయాను. డెన్మార్క్ ఓపెన్ తర్వాత ఈ సీజన్లో మరే టోర్నీలోనూ ఆడటంలేదు. కరోనా సమయంలో లభించిన విరామాన్ని ఆస్వాదించాను. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే గడిపాను. ఆ తర్వాత ఆగస్టు తొలివారంలో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాను. ఈ టోర్నీలో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తా. జనవరి నుంచి తాజాగా సీజన్‌ను మొదలుపెడతా’ అని గుంటూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. -
సైనాకు మళ్లీ నిరాశ
ఓడెన్స్: ఈ ఏడాది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశలు అడియాసలయ్యాయి. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 52 నిమిషాల్లో 13–21, 21–13, 6–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేత తై జు యింగ్‌కు 54,250 డాలర్లు (రూ. 39 లక్షల 78 వేలు) 11,000 పాయింట్లు... రన్నరప్ సైనాకు 26,350 డాలర్లు (రూ. 19 లక్షల 32 వేలు) లభించాయి. ఈ చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సైనాకిది వరుసగా 11వ పరాజయంకాగా, ఈ ఏడాదిలో ఐదో ఓటమి. ఈ సంవత్సరంలోనే ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్లోనూ తై జు యింగ్ చేతిలోనే సైనా ఓడిపోయింది. ఈ ఏడాది తొమ్మిదో ఫైనల్ ఆడుతోన్న తై జు యింగ్ తొలి గేమ్ ఆరం భం నుంచే ఆధిపత్యం చలాయించింది. 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరును కొనసాగించి 15 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సైనా వ్యూహాలు మార్చి తన ప్రత్యర్థి దూకుడుకు పగ్గాలు వేసింది. విరామానికి 11–5తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం తై జు యింగ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చకచకా పాయింట్లు సాధించి 11–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తై జు యింగ్ ఇక వెనుదిరిగి చూడకుండా ఈ ఏడాది ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
శ్రీకాంత్ సాధించెన్...
ఇలా వచ్చాడు. అలా గెలిచాడు. టీవీ ముందున్న అభిమానులను... కోర్టులో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నమ్మశక్యంకానిరీతిలో కేవలం 25 నిమిషాల్లోనే ఫైనల్‌ను ముగించాడు. బరిలో దిగిన తొలి క్షణం నుంచే దక్షిణ కొరియా ఫైనల్ ప్రత్యర్థి లీ హున్ ఇల్‌ను హడలెత్తించి అద్వితీయ పద్ధతిలో విజేతగా అవతరించాడు. ఈ విజయంతో శ్రీకాంత్ ఈ ఏడాది తన ఖాతాలో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. తద్వారా సైనా నెహ్వాల్ తర్వాత ఒకే ఏడాదిలో మూడు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన రెండో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో లీ హున్ ఇల్ అద్భుతంగా ఆడాడు. మేమిద్దరం గతంలో ముఖాముఖిగా ఆడకపోయినా ఈ టోర్నీలో అతని మ్యాచ్‌లను పరిశీలించి వ్యూహం సిద్ధం చేసుకున్నాను. నా బలం అటాకింగ్. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాలని నిర్ణయించుకున్నాను. నిలకడగా పాయింట్లు రావడంతో నా వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సీజన్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ సాధించినందుకు ఆనందంగా ఉంది. వచ్చే వారం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడతాను. ఈ సీజన్లో మిగిలిన టోర్నీల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నాను. –‘సాక్షి’తో శ్రీకాంత్ ఒడెన్స్: బహుశా ఎవరూ ఊహించకపోయుండొచ్చు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ టైటిల్‌ను శ్రీకాంత్ ఇంత అలవోకగా గెలుస్తాడని..! అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ప్రస్తుత పోటీదృష్ట్యా ఓ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్ ఆద్యంతం హోరాహోరీగా సాగుతుందని భావించిన వారందరూ ఆదివారం ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ సీజన్లో తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–10, 21–5తో ప్రపంచ 22వ ర్యాంకర్ లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)ను చిత్తుగా ఓడించాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 58 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లీ హున్ ఇల్కు 28,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 53 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి గేమ్‌లో 7... రెండో గేమ్‌లో 11 సెమీస్‌లో టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో 92 నిమిషాలు ఆడి మూడు గేముల్లో అతడిని ఓడించడం... 20 ఏళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో ఆడుతుండటం... 615 మ్యాచ్‌ల అనుభవం... ఇలా ఏ రకంగా చూసినా శ్రీకాంత్‌తో ఫైనల్లో తలపడిన ప్రత్యర్థి లీ హున్ ఇల్ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. అయితేనేం ఇవేమీ శ్రీకాంత్ పట్టించుకోలేదు. కేవలం తనకు తెలిసిన పద్ధతిలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. తొలి గేమ్ ఆరంభంలో వరుసగా రెండు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్ ఆ తర్వాత చెలరేగాడు. వరుసగా రెండు లేదా మూడు పాయింట్లు సాధిస్తూ ముందుకు సాగాడు. స్కోరు 13–8 వద్ద శ్రీకాంత్ వరుసగా 7 పాయింట్లు గెలిచి 20–8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం లీ హున్ రెండు పాయింట్లు గెలిచినా, శ్రీకాంత్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్ తొలి పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్ విశ్వరూపమే చూపించాడు. ఒకటా... రెండా... వరుసగా 11 పాయింట్లు గెలిచి 11–1తో ఈ తెలుగు తేజం ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ తన జోరును కొనసాగించడంతో లీ హున్ రెండో గేమ్‌ను 12 నిమిషాల్లో కోల్పోయి చేతులెత్తేశాడు. అంతర్జాతీస్థాయిలో నేను చూసిన ఏకపక్ష ఫైనల్ ఇదేనేమో! మా ప్రణాళికలన్నీ కోర్టులో శ్రీకాంత్ పక్కాగా అమలు చేశాడు. శ్రీకాంత్ ఆటతీరుకు తగ్గట్టుగా కోర్టులో పరిస్థితులు ఉన్నాయి. షటిల్ గమనాన్ని శ్రీకాంత్ అనుకూలంగా మార్చుకొని ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. –‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ ► డెన్మార్క్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ప్లేయర్‌కు లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టైటిల్‌ను సాధించగా... ఇపుడు శ్రీకాంత్ ఆయన సరసన నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాత్రం 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్‌ను సాధించింది. ► ఈ సీజన్లో శ్రీకాంత్ సాధించిన సూపర్ సిరీస్ టైటిల్స్ సంఖ్య (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్). ► ఒకే ఏడాది మూడు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన భారత క్రీడాకారులు. 2010లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో (సింగపూర్, ఇండోనేసియా, హాంకాంగ్ ఓపెన్ టైటిల్స్) ఈ ఘనత సాధించగా... తాజాగా శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో ఈ అద్భుతం చేశాడు. -
నలుగురూ క్వార్టర్స్‌కు
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఒడెన్స్: సింగిల్స్ విభాగంలో బరిలో ఉన్న నలుగురు తెలుగు క్రీడాకారులు... డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి. సింధు 21-17, 21-19తో కిస్నియా పొలికర్పోవా (రష్యా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ సైనా నెహ్వాల్ 21-12, 21-10తో మినత్సు మితానీ (జపాన్)ని ఓడించింది. కిస్నియాతో 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుంది. 4-0 ఆధిక్యంతో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సింధు చివరి వరకు దాన్ని కొనసాగించింది. రెండో గేమ్‌లో 2-2తో స్కోరు సమమైనా హైదరాబాద్ అమ్మాయి దూకుడుగా ఆడి 19-15తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో రష్యా అమ్మాయి పుంజుకుని చకచకా పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 19-20కి తగ్గించింది. అయితే తన అనుభవాన్ని రంగరించిన సింధు ఓ చక్కని షాట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల రెండో రౌండ్లో పారుపల్లి కశ్యప్ 21-17, 17-21, 22-20తో హోయామ్ రుంబాకా (ఇండోనేసియా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-12, 21-15తో జెన్ హో సు (చైనీస్ తైపీ)ని ఓడించాడు. రుంబాకాతో గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో 13-13తో స్కోరు సమమైన తర్వాత భారత్ కుర్రాడు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గాడు. 17-13 స్కోరుతో వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌లో ఇండోనేసియా ప్లేయర్ 7-1 ఆధిక్యంతో చెలరేగాడు. ఈ దశలో కశ్యప్ వరుసగా 6 పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసినా.... ప్రత్యర్థి ముందు నిలువలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో ముందంజ వేసిన కశ్యప్ 20-20 స్కోరు వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించడం కలిసొచ్చింది.