ఒడెన్స్: దాదాపు ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు శుభారంభం లభించింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–12, 21–18తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లో కాస్త పోటీ లభించింది.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంక్‌లో ఉన్న శ్రీకాంత్ ముఖాముఖి కెరీర్‌లో టోబీ పెంటీపై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు వీరిద్దరు 2013 థాయ్‌లాండ్ ఓపెన్‌లో తలపడగా... శ్రీకాంత్ వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రౌండ్‌లో జేసన్ 21–13, 21–18తో భారత్‌కు చెందిన శుభాంకర్ డేను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. మూడో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 12–21, 14–21తో పరాజయం పాలయ్యాడు. ‘తొలి గేమ్‌లో చక్కగా ఆడాను. రెండో గేమ్‌లో టోబీ పుంజుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగుపెట్టాను.
ఇదో సాహసకార్యంలా అనిపిస్తోంది. గతంలో ఏనాడూ నేనింతకాలం మ్యాచ్‌లు ఆడకుండా విరామం తీసుకోలేదు. మొత్తానికి శుభారంభం చేసినందుకు ఆనందంగా ఉంది. కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. నా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. చివరిసారి నేను మార్చిలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడి తొలి రౌండ్‌లోనే ఓడిపోయాను. డెన్మార్క్ ఓపెన్ తర్వాత ఈ సీజన్‌లో మరే టోర్నీలోనూ ఆడటంలేదు. కరోనా సమయంలో లభించిన విరామాన్ని ఆస్వాదించాను. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి ఇంట్లోనే గడిపాను. ఆ తర్వాత ఆగస్టు తొలివారంలో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాను. ఈ టోర్నీలో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తా. జనవరి నుంచి తాజాగా సీజన్‌ను మొదలుపెడతా’ అని గుంటూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment