
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.
డబుల్స్ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 21–19తో కాంగ్ మిన్ హ్యుక్–సియో సెయుంగ్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌లో 16–15తో ఆధిక్యంలో ఉన్నదశలో వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–16, 21–12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–13, 22–20తో జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ సైనా 17–21, 21–19, 11–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment