![Denmark Open 2020: Kidambi Srikanth reaches first quarter-final - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/16/SRIKANTH.jpg.webp?itok=3nXPrhwz)
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత అగ్రశ్రేణి షట్లర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా... లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–15, 21–14తో జేసన్ ఆంథోనీ హోషుయె (కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–15, 7–21, 17–21తో హాన్స్ క్రిస్టియాన్ సోల్‌బెర్గ్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
దూకుడే మంత్రంగా...
33 నిమిషాల పాటు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి గేమ్‌లోనే 9–4తో జోరు కనబరిచిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు 11–8తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 17–9తో దూసుకెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆరంభంలో శ్రీకాం త్ 5–8తో వెనుకబడ్డాడు. ఈ దశలో పుంజుకున్న అతను వరుసగా 6 పాయింట్లు స్కోర్ చేసి 11–8తో రేసులోకి వచ్చాడు. జేసన్ 10–11తో శ్రీకాంత్‌ను సమీపించాడు. మరోసారి ధాటిగా ఆడిన శ్రీకాంత్ 15–11... 19–11తో ప్రత్యర్థిపై దాడి చేసి విజయా న్ని దక్కించుకున్నాడు. నేడు జరుగనున్న క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్–2 ఆటగాడు చౌ టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)తో శ్రీకాంత్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment