నలుగురూ క్వార్టర్స్‌కు
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్స్: సింగిల్స్ విభాగంలో బరిలో ఉన్న నలుగురు తెలుగు క్రీడాకారులు... డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి. సింధు 21-17, 21-19తో కిస్నియా పొలికర్‌పోవా (రష్యా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో ఏడోసీడ్ సైనా నెహ్వాల్ 21-12, 21-10తో మినత్సు మితానీ (జపాన్)ని ఓడించింది. కిస్నియాతో 31 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుంది. 4-0 ఆధిక్యంతో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన సింధు చివరి వరకు దాన్ని కొనసాగించింది. రెండో గేమ్‌లో 2-2తో స్కోరు సమమైనా హైదరాబాద్ అమ్మాయి దూకుడుగా ఆడి 19-15తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో రష్యా అమ్మాయి పుంజుకుని చకచకా పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 19-20కి తగ్గించింది. అయితే తన అనుభవాన్ని రంగరించిన సింధు ఓ చక్కని షాట్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల రెండో రౌండ్‌లో పారుపల్లి కశ్యప్ 21-17, 17-21, 22-20తో హోయామ్ రుంబాకా (ఇండోనేసియా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-12, 21-15తో జెన్ హో సు (చైనీస్ తైపీ)ని ఓడించాడు. రుంబాకాతో గంటా 9 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు గట్టిపోటీ ఎదురైంది. తొలి గేమ్‌లో 13-13తో స్కోరు సమమైన తర్వాత భారత్ కుర్రాడు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గాడు. 17-13 స్కోరుతో వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌లో ఇండోనేసియా ప్లేయర్ 7-1 ఆధిక్యంతో చెలరేగాడు. ఈ దశలో కశ్యప్ వరుసగా 6 పాయింట్లు నెగ్గి స్కోరును సమం చేసినా.... ప్రత్యర్థి ముందు నిలువలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరూ పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో ముందంజ వేసిన కశ్యప్ 20-20 స్కోరు వద్ద వరుసగా రెండు పాయింట్లు సాధించడం కలిసొచ్చింది.