న్యూఢిల్లీ: ఆటగాళ్లు తమ వయోధ్రువీకరణను తప్పుగా వెల్లడించి పోటీల్లో పాల్గొంటే నిషేధం విధించాల్సిందేనని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించారు. ‘వయస్సును తక్కువ చేసి చూపించే ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మరొకరు ఆ తప్పుచేయకుండా నిరోధించాలంటే నిషేధం అమలు చేయాలి’ అని గోపీచంద్ అన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ)లు అలాంటి ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి. అయితే భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ మాత్రం నిషేధం సరికాదని అంటున్నారు. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తే సదరు ఆటగాళ్ల ప్రతిభను చంపేసినట్లే అవుతుందని అన్నారు.
అలా కాకుండా అండర్–15, 17, 19లలో పెద్ద వయస్సు వారు తప్పుడు ధ్రువీకరణతో పాల్గొంటే వాళ్లకు శిక్షగా ఈ వయోవిభాగాల నుంచి తప్పించి నేరుగా సీనియర్స్ కేటగిరీలో ఆడించడమే ఉత్తమమైన పరిష్కారమన్నారు. 2016లో కొందరు ఆటగాళ్లు తప్పు వయో ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొన్న కేసు విషయంలో విచారణ జరిపిన సీబీఐ నలుగురు ఆటగాళ్లు వయస్సు ధ్రువీకరణ పత్రాలను దిద్దినట్లు తేల్చింది. పలువురు జూనియర్ ఆటగాళ్ల తల్లిదండ్రులు వయసు ధ్రువీకరణ అంశంపై, తప్పుడు ధ్రువీకరణపై చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు చర్యలు చేపట్టే విధాన నిర్ణయం తీసుకోవాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని (బాయ్) ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment