పోరాడి ఓడిన శ్రీకాంత్
సింగపూర్ ఓపెన్
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ సంచలన ప్రదర్శనకు తెరపడింది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ అబ్బాయి సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీకాంత్ 19-21, 18-21తో ఓటమి చవిచూశాడు.
42 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ తన ప్రత్యర్థికి గట్టిపోటీనే ఇచ్చాడు. ప్రతి పాయింట్ కోసం లీ చోంగ్ వీని కష్టపడేలా చేశాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఒకదశలో శ్రీకాంత్ 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లి గేమ్‌ను దక్కించుకునేలా కనిపించాడు.
అయితే అపార అనుభవజ్ఞుడైన లీ చోంగ్ వీ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 21-19తో సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌నూ దూకుడుతో ప్రారంభించిన శ్రీకాంత్ 4-2తో ముందంజ వేశాడు. అయితే లీ చోంగ్ వీ వెంటనే తేరుకొని ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 4,350 డాలర్ల (రూ. 2 లక్షల 61 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.