
సైనా మరో'సారీ'..
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాదిలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హైదరాబాదీకి మరోసారి నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా 17-21, 21-9, 15-21 స్కోరుతో పోర్న్టిప్ బురానప్రసెట్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్లోనూ భారత ఆటగాడు అజయ్ జయరామ్ 18-21, 12-21తో సోనీ డ్వి కున్కోరొ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాదిలో సైనా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. సీజన్ చివర్లోనైనా నెగ్గాలన్న సైనా ఆశలు నెరవేరలేదు. గాయాలు, పేలవ ఫామ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది.