బంగా బీట్స్ బోణి
బంగా బీట్స్ బోణి
Published Mon, Aug 19 2013 3:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
లక్నో: సింగిల్స్‌లో రాణించడంతో బంగా బీట్స్ (బీబీ) జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో బోణీ చేసింది. మరోవైపు అవధ్ వారియర్స్ (ఏడబ్ల్యూ) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది. భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, పురుషుల సింగిల్స్‌లో వీ ఫెంగ్ చోంగ్ చేతులెత్తేయడంతో వారియర్లు కోలుకోలేకపోయారు. ఆదివారం లక్నోలో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మ్యాచ్‌లో బంగా బీట్స్ (బీబీ) 4-1తో వారియర్స్‌పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ తొలి పోరులో హూ యున్ (బీబీ) 21-11, 21-20తో వీ ఫెంగ్ చోంగ్ (ఏడబ్ల్యూ)పై గెలిచి బంగా బీట్స్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, అవధ్ స్టార్ ప్లేయర్ సింధు 16-21, 13-21తో ప్రపంచ 19వ ర్యాంకు క్రీడాకారిణి కరోలినా మారిన్ (బీబీ) చేతిలో పరాజయం చవిచూసింది. రెండు గేముల్లోనూ ఏపీ రైజింగ్ స్టార్ చేతులెత్తేసింది. తనకన్నా తక్కువ ర్యాంకు ప్రత్యర్థి దూకుడుకు ఏ దశలోనూ కళ్లెం వేయలేకపోయింది. ఈ టోర్నీలో పదో ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో పరాజయం.
దీంతో బీబీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అనంతరం జరిగిన పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడి మథియస్ బోయె-కైడో మార్కిస్ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. వీరిద్దరు చక్కని సమన్వయంతో రాణించడంతో 21-14, 21-19తో మోగెన్సన్-అక్షయ్ దివాల్కర్ (బీబీ)పై గెలుపొందారు. దీంతో అవధ్ జట్టు 1-2తో బీబీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్ (బీబీ), శ్రీకాంత్ (ఏడబ్ల్యూ)ల మధ్య పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో సీనియర్ ఆటగాడు, 14వ ర్యాంకర్ కశ్యప్ 20-21, 21-11, 11-9తో శ్రీకాంత్‌పై చెమటోడ్చి నెగ్గాడు.
తొలిగేమ్‌లో శ్రీకాంత్ స్మాష్‌లతో రెచ్చిపోగా... రెండో గేమ్‌లో పుంజుకున్న కశ్యప్ తన రాష్ట్ర సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే కశ్యప్ తన అనుభవాన్ని రంగరించి పోరాడాడు. వరస పాయింట్లు సాధించి స్కోరును సమం చేయడంతో పాటు చివర్లో మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక నామమాత్రమైన మిక్స్‌డ్ డబుల్స్‌లో కైడో మార్కిస్- మనీషా (ఏడబ్ల్యూ) జంట 21-20, 16-21, 8-11తో కార్‌స్టన్-మారిన్ (బీబీ) ద్వయం చేతిలో ఓడింది.
Advertisement