సాత్విక్, చిరాగ్ శెట్టి
కిడాంబి శ్రీకాంత్ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్‌కోర్ట్ స్మాష్‌ను సంధించాడు... ప్రత్యర్థి క్రిస్టీ వద్ద దానికి జవాబు లేకపోయింది... అంతే! శ్రీకాంత్ వెనుదిరిగి రాకెట్ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు... కనీసం ప్రత్యర్థికి మర్యాదపూర్వకంగా శ్రీకాంత్ ఒక షేక్ హ్యాండ్ అన్నా ఇవ్వమంటూ రిఫరీ చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా మన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది... శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు... ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించాడు... వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. లక్ష్య సేన్ 20 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడంతోపాటు మూడు బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ అందుకున్నాడు...
హెచ్‌ఎస్ ప్రణయ్ ఖాతాలోనూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ ఉండగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్... డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఇటీవల సంచలనాలు సృష్టిస్తోంది. విడివిడిగా చూస్తే వీరంతా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించారు... అంతకుముందు తరంలో ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ కూడా భారత బ్యాడ్మింటన్ స్థాయిని పెంచే ఆటను ప్రదర్శించారు. కానీ జట్టుగా, కలిసికట్టుగా, సమష్టిగా చూస్తే మాత్రం భారత్ ఖాతాలో భారీ విజయం లోటు ఇన్నేళ్లుగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. ఈ చిరస్మరణీయ ఘట్టం ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనే ఆవిష్కృతమైంది కాదు... గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరిన ప్రస్థానమిది.
సాక్షి క్రీడా విభాగం
భారత జట్టు థామస్ కప్ కోసం వెళ్లినప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు... గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న ఆటగాళ్లతో పాటు అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లు ఉన్న ప్రత్యర్థులను దాటి మన జట్టు ముందంజ వేయడం కష్టమనిపించింది. ఎవరి నుంచైనా ఏదైనా అద్భుత ప్రదర్శన వచ్చినా ఇతర మ్యాచ్‌లూ వరుసగా గెలిస్తే తప్ప జట్టుకు విజయం దక్కదు. అయితే ఎలాంటి ఆశలు లేకుండా పోవడమే టీమ్‌కు మేలు చేసింది.
తమను ఎవరూ నమ్మని సమయంలో ఆటగాళ్లే తమను తాము నమ్మారు... వారికి కోచ్‌లు అండగా నిలిచి స్ఫూర్తిని నింపారు. జట్టు ప్రకటించిన తర్వాత టోర్నీ ఆరంభానికి ముందు భారత బృందం ‘వి విల్ బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసుకుంది. చాంపియన్‌గా నిలిచే వరకు ఇందులో ప్రతీ క్షణం స్ఫూర్తి నింపే సందేశాలే. చివరకు మన షట్లర్లు చిరస్మరణీయ విజయంతో తామేంటో చూపించారు. సెమీస్ చేరడంతోనే కనీసం కాంస్యం ఖాయం చేసుకొని మన టీమ్ టోర్నీలో తొలి పతకంతో కొత్త చరిత్ర సృష్టించింది. కానీ ఆ జోరు తుది లక్ష్యాన్ని అందుకునే వరకు ఆగలేదు.
అందరూ అదరగొట్టగా...
బ్యాడ్మింటన్‌కు ప్రపంచకప్‌లాంటి థామస్ కప్‌లో భారత్‌కు విజయం అందించినవారిని చూస్తే ఒక్కరి ఖాతాలోనూ ఒలింపిక్ పతకం లేదు! కానీ ఈ మెగా టోర్నీకి వచ్చేసరికి అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. అజేయ ఆటతో శ్రీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లీగ్ దశలో భారత్ ఒక మ్యాచ్ ఓడినా శ్రీకాంత్ మాత్రం ఒక్కసారి కూడా నిరాశపర్చలేదు. ఇక క్వార్టర్స్, సెమీస్‌లలో ప్రణయ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు 2–2తో సమంగా నిలిచిన స్థితిలో చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే ఆటగాడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది.
కానీ ప్రణయ్ ఎంతో పట్టుదలగా నిలబడ్డాడు. తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడి జట్టును గెలిపించాడు. అదృష్టవశాత్తూ ఫైనల్లో అతను ఆడాల్సిన అవసరమే రాలేదు. రెండు నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశపర్చిన లక్ష్య సేన్ అసలు సమరంలో సత్తా చాటాడు. ఫైనల్లో అతడు తన స్థాయిని ప్రదర్శించడం భారత్ అవకాశాలు పెంచింది. ఇక విశ్వసనీయమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్–చిరాగ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే థామస్ కప్‌లాంటి ఈవెంట్లలో బలహీన డబుల్స్ కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడుతూ వచ్చిన భారత్‌కు ఈ ద్వయం కారణంగా ముందంజ వేసే అవకాశం దక్కింది.
ఇంతింతై వటుడింతై...
థామస్ కప్‌లో భారత్ గెలవడమే కాదు, గెలిచిన తీరుకు కూడా జేజేలు పలకాల్సిందే. ఈ రోజు మన ఘనతను చూసి సాధారణ అభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆటను దగ్గరి నుంచి చూసిన వారికి ఈ విజయం విలువేమిటో మరింత బాగా కనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా షటిల్ పరిస్థితులు గొప్పగా ఏమీ లేవు. కానీ గోపీచంద్ కోచ్‌గా మారిన తర్వాత షటిల్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
సరిగ్గా చెప్పాలంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత ఆటపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సైనా సాధించిన వరుస విజయాలు ఈ క్రీడ స్థాయిని పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సైనా మెరవడంతో బ్యాడ్మింటన్ కూడా ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటిగా మారింది. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన రజతం ఈ క్రీడ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. సాధారణ క్రీడాభిమానులు కూడా బ్యాడ్మింటన్‌ను అనుసరించసాగారు.
ప్రపంచంలో ఏ మూల టోర్నీ జరిగినా వాటి ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇక ఆయా దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు టోర్నీ వేదికలకు వెళ్లి మరీ మన షట్లర్లను ప్రోత్సహించసాగారు. పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా బ్యాడ్మింటన్ ఫలితాలను చర్చిస్తుండటంతో సంబంధం లేనివారి దృష్టి కూడా ఆటపై పడింది. కొన్నేళ్ల క్రితం వరకు మన షట్లర్లు మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టడం, టాప్–100 ర్యాంకుల్లో ఉండటం కలగానే అనిపించేది. కానీ ఇప్పుడు ఎంతో మంది నేరుగా పెద్ద టోర్నీల్లో తలపడుతున్నారు. ఈ పురోగతి అంతా నేటి థామస్ కప్ విజయం వరకు తీసుకెళ్లిందంటే అతశయోక్తి కాదు.
Comments
Please login to add a commentAdd a comment