satvik sai Raj
-
మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 95,861 పాయింట్లతో టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ ... మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి ఈ ఏడాది జరిగిన రెండు ప్రధాన టోరీ్నల్లోనూ (మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాక సాత్విక్ –చిరాగ్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్ చి లీ–ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్కోల్ఫన్–ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సాత్విక్-చిరాగ్ జోడిని అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ వీరిద్దరి విజయ పరంపర కొనసాగించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇవాళ జరిగిన కొరియా ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్‌పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో గెలుపొందారు. తొలి గేమ్‌ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్‌లో పుంజుకున్న భారత ద్వయం.. ప్రత్యర్థి సర్వీస్‌ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లింది. 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన మూడో గేమ్‌లోనూ బలమైన స్మాష్ సర్వీస్‌లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్‌ను ముగించి చాంపియన్స్‌గా అవతరించింది. ఓవరాల్‌గా సాత్విక్-చిరాగ్ జోడికి ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్. సాత్విక్-చిరాగ్ జోడి గత నెలలో ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కూడా గెలుచుకుంది. -
మన కుర్రోడికి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ ట్విటర్ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు తేజం సాత్విక్సాయిరాజ్కి, అలాగే చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. అందరూ గర్వపడేలా గెలుపొందారంటూ ట్వీట్ చేశారాయన. అంతకు ముందు ఒక ప్రకటన ద్వారా.. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్‌ను భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. My congratulations and best wishes to our very own Telugu boy @satwiksairaj and @Shettychirag04! You’ve made us all very proud. pic.twitter.com/VLJxScA29n — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, 2023 ఇదీ చదవండి: ఏపీకి నాలుగు జాతీయ జల అవార్డులు -
Indonesia Open 2023: చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ
జకార్తా: భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి.. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ భారత ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీపై వరుస సెట్లలో (21-17, 21-18) విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకున్నారు. ఇండోనేసియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇది తొలి టైటిల్. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం నెగ్గిన నెల రోజుల అనంతరం ఇండోనేసియా ఓపెన్ టైటిల్‌ను కూడా చేజిక్కించుకోవడం విశేషం. కాగా, సాత్విక్-చిరాగ్ జోడీ.. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే,ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ జోడీ ఇటీవలికాలంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, థామస్ కప్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలాగే సూపర్ 300 (సయ్యద్ మోదీ), సూపర్ 500 (థాయ్‌లాండ్, ఇండియా ఓపెన్), సూపర్ 750 (ఫ్రెంచ్ ఓపెన్) టైటిళ్లు సాధించారు. సాత్విక్ జోడీని అభినందించిన సీఎం జగన్ ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీని సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో ఈ జోడీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం జగన్. -
Indonesia Open: ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)పై సంచలన విజయం సాధించిన ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం.. ఇవాళ (జూన్ 17) జరిగిన సెమీఫైనల్లో అన్ సీడెడ్ దక్షిణ కొరియా జోడీ కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె పై 17-21 21-19 21-18 తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలో గంటా 7 నిమిషాల పాటు పోరాడిన భారత ద్వయం.. చెమటోడ్చి కొరియన్ పెయిర్‌పై గెలుపొందింది. భారత జోడీ తొలి సెట్ కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం తగ్గకుండా పోరాడి గెలిచింది. ఫైనల్లో సాత్విక్-చిరాగ్ ద్వయం.. ప్రముద్య కుసుమవర్ధన-ఎరేమియా ఎరిక్ యోచే రాంబటన్ (ఇండొనేసియా)-ఆరోన్ చియా-వూయ్ ఇక్ సోహ్ (మలేసియా) జోడీల మధ్య విజేతను ఢీకొంటుంది. కాగా, ప్రస్తుత సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. చదవండి: సాత్విక్–చిరాగ్ సంచలనం -
చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ జోడీ.. 52 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక పతకం ఖాయమైంది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–11, 21–12తో అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని ఓడించింది. HISTORY SCRIPTED 🥳🥳🥳 ➡️ Sat-Chi assured medal for India after 52 years in MD category ➡️ Medal from Indian doubles department after 9 years Well done boys, proud of you! 🥹🫶@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/dz5dG4n7Xe — BAI Media (@BAI_Media) April 28, 2023 ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ జోడీ 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని ఖరారు చేసుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 21–18, 5–21, 9–21తో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. కాంటా సునెయామ (జపాన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 9–13తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 18–21, 21–19, 15–21తో దెజాన్–గ్లోరియా విద్జాజా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
భారత్ పోరాటం ముగిసె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్ల పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ గాయంతో వైదొలగగా... కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ ఓడిపోయింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట కూడా నిరాశపరిచింది. గురువారం జరిగిన పోటీల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ 21–16, 15–21, 18–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో కంగుతిన్నాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 9–21, 12–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫె (చైనా) ధాటికి నిలువలేకపోయింది. మహిళల డబుల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జంట 9–21, 16–21తో ఆరో సీడ్ జాంగ్ షు జియాన్–జెంగ్ యు (చైనా) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్‌లో గరగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14–21, 10–21తో లియాంగ్ వి కెంగ్– వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఇంటిదారి పట్టింది. సాత్విక్ సాయిరాజ్ తుంటిగాయం వల్ల చిరాగ్ షెట్టితో కలిసి బరిలోకి దిగలేకపోయాడు. దీంతో చైనాకే చెందిన లియు చెన్–జువాన్ యి జంట వాకోవర్‌తో ముందంజ వేసింది. -
డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం
ఓడెన్స్ (డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత లక్ష్య సేన్.. జపాన్‌కు చెందిన కొడాయ్ నరవోకా చేతిలో 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలవ్వగా, ఇవాళ (అక్టోబర్ 22) జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి జోడీ.. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్, మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వేయ్ ఇక్ జోడీ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. వీరి ఓటమితో ఈ టోర్నీలో భారత పోరాటం సమాప్తమైంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ప్రిలిమినరీ దశలో ఓటమిపాలయ్యారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన అమలాపురం బుల్లోడు
Amalapuram Satwiksairaj Rankireddy: అమలాపురం కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్‌శెట్టితో కలిసి ఇంగ్లండ్ జట్టుపై సునాయాస విజయం సాధించాడు. కామన్వెల్త్ డబుల్స్ వ్యక్తిగత విభాగంలో తొలిసారి స్వర్ణ పతకంతో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే ఇదే క్రీడల టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన సాత్విక్.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా డబుల్ ధమాకా కొట్టినట్టయ్యింది. 2018 కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాత్విక్ స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. అయితే అప్పుడు టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో రజతం సాధించగా, ఇప్పుడు ఫలితం తారుమారైంది. మూడు నెలలు.. మూడు పతకాలు సాత్విక్ క్రీడా జీవితంలో ఇప్పుడు స్వర్ణయుగమనే చెప్పాలి. గడచిన మూడు నెలల్లో అతడి బ్యాడ్మింటన్ రాకెట్‌కు తిరుగులేకుండా పోయింది. మే నెలలో ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో సాత్విక్ ఆడిన విషయం తెలిసిందే. థామస్ కప్ చరిత్రలోనే భారత జట్టు సాధించిన అతి పెద్ద విజయం ఇది. మూడు నెలలు గడవకుండానే కామన్వెల్త్లో స్వర్ణం, రజతం సాధించడం ద్వారా మూడు నెలల్లో అంతర్జాతీయంగా మూడు అత్యుత్తమ పతకాలు సాధించిన ఘనతను సాత్విక్ సొంతం చేసుకున్నాడు. జీవితాశయం చేజారినా.. కుంగిపోకుండా.. గత ఏడాది జపాన్‌లో జరిగిన ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్‌శెట్టితో కలిసి మూడు మ్యాచ్‌లకు గాను రెండు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో సాత్విక్ జంట ఏదో ఒక పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం తృటిలో చేజారినా అతడు కుంగిపోలేదు. ఒలింపిక్స్ తరువాత ఫ్రాన్స్‌లో జరిగిన సూపర్–750లో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఓపెన్–500 విజేతగా నిలిచాడు. Thankyou so much sir 🙏🏻 https://t.co/XR11LSRPLU — Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) August 5, 2022 సంబరాల్లో కుటుంబ సభ్యులు సాత్విక్ ఘన విజయంతో అతడి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. సాత్విక్ గెలిచిన వెంటనే అతడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు కేక్ కట్ చేసి పంచుకున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఆర్డీఓ బి.వసంతరాయుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి చుండ్రు గోవిందరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్ మెట్ల సూర్యనారాయణలు వారిని అభినందించారు. మన పిల్లలు బాగా ఆడారు ఈ రోజు భారత్ బ్యాడ్మింటన్‌కు మంచి రోజు. మన పిల్లలు సాత్విక్, చిరాగ్‌శెట్టి, మహిళా సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యాసేన్ స్వర్ణ పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. సాత్విక్ తండ్రిగా కన్నా అభిమానిగానే ఆటను ఆస్వాదించాను. ఈ విజయం ఊహించిందే. అయినా గెలుపు మంచి ఉత్సాహాన్నిచ్చింది. - రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్, సాత్విక్ తండ్రి -
కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్ లిఫ్టింగ్లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్.. జూడో (2), లాన్స్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1), బ్యాడ్మింటన్ (1) క్రీడల్లో గెలిచినవి. ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్‌పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్ ఆడిన నాలుగు గేమ్‌ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్ బంగారు ఆశలను నీరుగార్చారు. అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్.. తన వల్లే భారత్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్ అన్నాడు. చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్ కప్‌లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్‌గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్‌లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్‌ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్‌కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్‌పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్‌లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, ప్రణయ్‌లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్‌కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్‌కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
Thomas Cup 2022: ఆకాశాన మన ‘స్మాష్’...
కిడాంబి శ్రీకాంత్ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్‌కోర్ట్ స్మాష్‌ను సంధించాడు... ప్రత్యర్థి క్రిస్టీ వద్ద దానికి జవాబు లేకపోయింది... అంతే! శ్రీకాంత్ వెనుదిరిగి రాకెట్ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు... కనీసం ప్రత్యర్థికి మర్యాదపూర్వకంగా శ్రీకాంత్ ఒక షేక్ హ్యాండ్ అన్నా ఇవ్వమంటూ రిఫరీ చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా మన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది... శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు... ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించాడు... వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. లక్ష్య సేన్ 20 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడంతోపాటు మూడు బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ అందుకున్నాడు... హెచ్ఎస్ ప్రణయ్ ఖాతాలోనూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ ఉండగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్... డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఇటీవల సంచలనాలు సృష్టిస్తోంది. విడివిడిగా చూస్తే వీరంతా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించారు... అంతకుముందు తరంలో ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ కూడా భారత బ్యాడ్మింటన్ స్థాయిని పెంచే ఆటను ప్రదర్శించారు. కానీ జట్టుగా, కలిసికట్టుగా, సమష్టిగా చూస్తే మాత్రం భారత్ ఖాతాలో భారీ విజయం లోటు ఇన్నేళ్లుగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. ఈ చిరస్మరణీయ ఘట్టం ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనే ఆవిష్కృతమైంది కాదు... గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరిన ప్రస్థానమిది. సాక్షి క్రీడా విభాగం భారత జట్టు థామస్ కప్ కోసం వెళ్లినప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు... గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న ఆటగాళ్లతో పాటు అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లు ఉన్న ప్రత్యర్థులను దాటి మన జట్టు ముందంజ వేయడం కష్టమనిపించింది. ఎవరి నుంచైనా ఏదైనా అద్భుత ప్రదర్శన వచ్చినా ఇతర మ్యాచ్‌లూ వరుసగా గెలిస్తే తప్ప జట్టుకు విజయం దక్కదు. అయితే ఎలాంటి ఆశలు లేకుండా పోవడమే టీమ్‌కు మేలు చేసింది. తమను ఎవరూ నమ్మని సమయంలో ఆటగాళ్లే తమను తాము నమ్మారు... వారికి కోచ్‌లు అండగా నిలిచి స్ఫూర్తిని నింపారు. జట్టు ప్రకటించిన తర్వాత టోర్నీ ఆరంభానికి ముందు భారత బృందం ‘వి విల్ బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసుకుంది. చాంపియన్‌గా నిలిచే వరకు ఇందులో ప్రతీ క్షణం స్ఫూర్తి నింపే సందేశాలే. చివరకు మన షట్లర్లు చిరస్మరణీయ విజయంతో తామేంటో చూపించారు. సెమీస్ చేరడంతోనే కనీసం కాంస్యం ఖాయం చేసుకొని మన టీమ్ టోర్నీలో తొలి పతకంతో కొత్త చరిత్ర సృష్టించింది. కానీ ఆ జోరు తుది లక్ష్యాన్ని అందుకునే వరకు ఆగలేదు. అందరూ అదరగొట్టగా... బ్యాడ్మింటన్‌కు ప్రపంచకప్‌లాంటి థామస్ కప్‌లో భారత్‌కు విజయం అందించినవారిని చూస్తే ఒక్కరి ఖాతాలోనూ ఒలింపిక్ పతకం లేదు! కానీ ఈ మెగా టోర్నీకి వచ్చేసరికి అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. అజేయ ఆటతో శ్రీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లీగ్ దశలో భారత్ ఒక మ్యాచ్ ఓడినా శ్రీకాంత్ మాత్రం ఒక్కసారి కూడా నిరాశపర్చలేదు. ఇక క్వార్టర్స్, సెమీస్‌లలో ప్రణయ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు 2–2తో సమంగా నిలిచిన స్థితిలో చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే ఆటగాడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రణయ్ ఎంతో పట్టుదలగా నిలబడ్డాడు. తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడి జట్టును గెలిపించాడు. అదృష్టవశాత్తూ ఫైనల్లో అతను ఆడాల్సిన అవసరమే రాలేదు. రెండు నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశపర్చిన లక్ష్య సేన్ అసలు సమరంలో సత్తా చాటాడు. ఫైనల్లో అతడు తన స్థాయిని ప్రదర్శించడం భారత్ అవకాశాలు పెంచింది. ఇక విశ్వసనీయమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్–చిరాగ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే థామస్ కప్‌లాంటి ఈవెంట్లలో బలహీన డబుల్స్ కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడుతూ వచ్చిన భారత్‌కు ఈ ద్వయం కారణంగా ముందంజ వేసే అవకాశం దక్కింది. ఇంతింతై వటుడింతై... థామస్ కప్‌లో భారత్ గెలవడమే కాదు, గెలిచిన తీరుకు కూడా జేజేలు పలకాల్సిందే. ఈ రోజు మన ఘనతను చూసి సాధారణ అభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆటను దగ్గరి నుంచి చూసిన వారికి ఈ విజయం విలువేమిటో మరింత బాగా కనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా షటిల్ పరిస్థితులు గొప్పగా ఏమీ లేవు. కానీ గోపీచంద్ కోచ్‌గా మారిన తర్వాత షటిల్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సరిగ్గా చెప్పాలంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత ఆటపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సైనా సాధించిన వరుస విజయాలు ఈ క్రీడ స్థాయిని పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సైనా మెరవడంతో బ్యాడ్మింటన్ కూడా ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటిగా మారింది. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన రజతం ఈ క్రీడ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. సాధారణ క్రీడాభిమానులు కూడా బ్యాడ్మింటన్‌ను అనుసరించసాగారు. ప్రపంచంలో ఏ మూల టోర్నీ జరిగినా వాటి ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇక ఆయా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు టోర్నీ వేదికలకు వెళ్లి మరీ మన షట్లర్లను ప్రోత్సహించసాగారు. పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా బ్యాడ్మింటన్ ఫలితాలను చర్చిస్తుండటంతో సంబంధం లేనివారి దృష్టి కూడా ఆటపై పడింది. కొన్నేళ్ల క్రితం వరకు మన షట్లర్లు మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టడం, టాప్–100 ర్యాంకుల్లో ఉండటం కలగానే అనిపించేది. కానీ ఇప్పుడు ఎంతో మంది నేరుగా పెద్ద టోర్నీల్లో తలపడుతున్నారు. ఈ పురోగతి అంతా నేటి థామస్ కప్ విజయం వరకు తీసుకెళ్లిందంటే అతశయోక్తి కాదు. -
Thomas Cup 2022: భళా భారత్...
బ్యాంకాక్‌లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ప్రతిష్టాత్మక థామస్ కప్ టీమ్ టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2016 చాంపియన్ డెన్మార్క్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. బ్యాంకాక్: థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నమెంట్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1949లో మొదలైన ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్ డెన్మార్క్ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో 14 సార్లు విజేత ఇండోనేసియా 3–2తో మాజీ విజేత జపాన్ను ఓడించి ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. సాత్విక్–చిరాగ్ చెలరేగి... డెన్మార్క్‌తో పోటీని భారత్ ఓటమితో మొదలుపెట్టింది. భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 49 నిమిషాల్లో 13–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం అద్భుత ఆటతీరు కనబరిచింది. 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–23, 22–20తో కిమ్ ఆస్ట్రప్–మథియాస్ క్రిస్టియాన్సన్ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి కీలకదశలో పాయింట్లు రాబట్టి పైచేయి సాధించారు. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 80 నిమిషాల్లో 21–18, 12–21, 21–15తో గెలుపొంది భారత్‌కు 2–1 ఆధిక్యాన్ని అందించాడు. పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో డెన్మార్క్ జట్టు రాణించింది. ఆండెర్స్ రస్ముసెన్–ఫ్రెడెరిక్ ద్వయం 21–14, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంటను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. ప్రణయ్ ప్రతాపం స్కోరు 2–2తో సమం కావడంతో భారత ఆశలన్నీ ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్‌పై ఆధారపడ్డాయి. మలేసియాతో క్వార్టర్ ఫైనల్లో చివరి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన ప్రణయ్ ఈసారీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ప్రపంచ 13వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కెతో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్ ప్రణయ్ 73 నిమిషాల్లో 13–21, 21–9, 21–12తో గెలుపొంది భారత్‌ను తొలిసారి థామస్ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు. మ్యాచ్ మధ్యలో ప్రణయ్ చీలమండకు గాయమైనా ఆ బాధను ఓర్చుకుంటూ పట్టువదలకుండా పోరాడిన అతను భారత్‌కు మరో చిరస్మరణీయ విజయం కట్టబెట్టాడు. -
నాకౌట్ దశకు భారత్ అర్హత
బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు అర్హత పొందింది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్‌తోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్‌ను 52 నిమిషాల్లో ఓడించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్ ఆంథోనీ–కెవిన్ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–15, 21–12తో సంకీర్త్‌ను ఓడించి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో గారగ కృష్ణప్రసాద్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–15, 21–11తో డాంగ్ ఆడమ్–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 21–13, 20–22, 21–14తో విక్టర్ లాయ్‌పై గెలవడంతో భారత్ 5–0తో కెనడాను క్లీన్‌స్వీప్ చేసింది. ఉబెర్ కప్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. -
‘వరల్డ్ టూర్ ఫైనల్స్’కు సాత్విక్ జోడీ అర్హత
బాలి (ఇండోనేసియా): బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్ స్టార్‌జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. గతవారం ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్ చేరింది. వీరికి పోటీగా ఉన్న జపాన్ జోడీ అకిరా కొగా–తైచి సయితో కూడా సెమీస్‌లోనే ఓడింది. ఆ సెమీస్‌లో తప్పక గెలిస్తేనే క్వాలిఫై కావాల్సి ఉండగా, జపాన్ జంట కూడా ఓడిపోవడంతో సాత్విక్–చిరాగ్ ద్వయానికి మార్గం సుగమమైంది. బుధవారం బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు. -
Tokyo Olympics: మ్యాచ్ గెలిచినా ఇంటిదారి పట్టిన భారత జోడీ
టోక్యో: భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జోడీ మంగళవారం జరిగిన గ్రూప్ ఎ పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించారు. బ్రిటన్‌కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-17, 21-19 తేడాతో గెలుపొందారు. అయితే గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉన్నా క్వార్టర్స్‌కు మాత్రం వీళ్లు క్వాలిఫై కాలేకపోయారు. మరో మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ లీ యాంగ్, వాంగ్ చిలిన్ జోడీ ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడీ మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో జోడీపై గెలవడం సాత్విక్, చిరాగ్ అవకాశాలను దెబ్బతీసింది. కాగా, సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మార్కస్ గిడియోన్, కెవిన్ సుకముల్జో జోడీ 21-13, 21-12 తేడాతో సాత్విక్, చిరాగ్‌ల జోడీపై గెలుపొందిన విషయం తెలిసిందే. -
సూపర్ సాత్విక్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో... చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్ జోడీ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సాత్విక్ జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్ యెవ్ సిన్–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సమీర్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
సూపర్‌గా ఆడి... సెమీస్‌కు చేరి...
పారిస్: అంతర్జాతీయ వేదికపై పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరోసారి సత్తా చాటుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–13, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్)ను బోల్తా కొట్టించింది. గురువారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్ మొహమ్మద్ హసన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా)లపై నెగ్గి సంచలనం సృష్టించిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ అదే జోరులో మరో గొప్ప విజయం నమోదు చేసి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గతంలో కిమ్–ఆండెర్స్‌లతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాతి్వక్–చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. తొలి గేమ్‌లో చెలరేగి ఆడిన భారత జంట ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకుంటూ గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో డెన్మార్క్ జోడీ పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 4–0తో ముందంజ వేసింది. అయితే వెంటనే తేరుకున్న భారత జంట 9–9 వద్ద స్కోరును సమం చేసింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టువదలని డెన్మార్క్ జంట పాయింట్లు సాధించి 20–19తో గేమ్‌ను గెలిచే దిశగా నిలిచింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేయకుండా ఆడిన సాతి్వక్–చిరాగ్ వరుసగా మూడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈసారి సైనాను... మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు, సైనా క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. డెన్మార్క్ ఓపెన్‌లో సింధును ఓడించిన 17 ఏళ్ల కొరియా అమ్మాయి యాన్ సె యంగ్ ఈసారి సైనాకు షాక్ ఇచ్చింది. 49 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యాన్ సె యంగ్ 22–20, 23–21తో సైనాను ఓడించి సెమీస్‌కు చేరింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో 75 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ఆరోర్యాంకర్ సింధు 16–21, 26–24, 17–21తో ఓడిపోయింది. ప్రపంచ చాంపియన్ అయ్యాక తాను పాల్గొన్న నాలుగో టోర్నమెంట్లోనూ సింధు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోవడం గమనార్హం. -
సాత్విక్–అశ్విని జోడీ సంచలనం
చాంగ్జౌ (చైనా): భారత మిక్స్డ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప సంచలన ప్రదర్శనతో చైనా ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ 26వ ర్యాంకులో ఉన్న సాత్విక్–అశ్విని ద్వయం... ప్రపంచ ఏడో ర్యాంక్, ఆరో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలతి దేవా ఒక్తవియంతి (ఇండోనేసియా) జంటకు షాక్ ఇచి్చంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భారత జోడీ 22–20, 17–21, 21–17తో ప్రవీణ్–మెలతి జంటను ఇంటిదారి పట్టించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను చెమటోడ్చి దక్కించుకున్న భారత జంటకు రెండో గేమ్‌లో పరాజయం ఎదురైంది. వెంటనే పుంజుకున్న సాతి్వక్ జంట నిర్ణాయక గేమ్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా దక్కించుకోవడంతో విజయం సాధించింది. గతేడాది ఇండియా ఓపెన్ సహా ఐదు టోరీ్నల్లో ఫైనల్ చేరిన ఇండోనేసియా జోడీ... ఇక్కడ సాతి్వక్–అశ్వినిల జోరుకు తొలిరౌండ్లోనే ని్రష్కమించడం విశేషం. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో చిరాగ్ షెట్టితో జతకట్టిన సాతి్వక్ 21–7, 21–18తో జాసన్ ఆంథోని–నైల్ యకుర (కెనడా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో ఎనిమిదో సీడ్ సైనా నెహా్వల్; ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో పారుపల్లి కశ్యప్ తలపడతారు. -
సాత్విక్–చిరాగ్ జంట చిరస్మరణీయ విజయం
నిరీక్షణ ముగిసింది. లోటు తీరింది. ఆందోళనకు తెర పడింది. అంతర్జాతీయస్థాయి డబుల్స్ విభాగంలో మనకు అత్యున్నత విజయాలు లభించట్లేదని విమర్శిస్తున్న వారందరికీ భారత యువతారలు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ అద్వితీయ ఆటతో సమాధానం ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించి ఔరా అనిపించారు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ టైటిల్ పోరుకు చేరిన సాత్విక్–చిరాగ్ అంతిమ సమరంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీని బోల్తా కొట్టించి అద్భుతమే చేశారు. బ్యాంకాక్: ఈ ఏడాది సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతున్న దశలో... ఎవరూ ఊహించని విధంగా డబుల్స్ విభాగంలో భారత్‌కు గొప్ప టైటిల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, ముంబై ఆటగాడు చిరాగ్ శెట్టి థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో చిరస్మరణీయ విజయం సాధించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 21–19, 18–21, 21–18తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న లి జున్ హుయ్–లియు యు చెన్ (చైనా) జోడీపై గెలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపుతో సాత్విక్–చిరాగ్ ద్వయం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. సూపర్–500 స్థాయి టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 27,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 27 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జంటకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గత మేలో ఈ జోడీ బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో విజేతగా నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన 18 ఏళ్ల సాత్విక్ 2012 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ముంబైకి చెందిన 22 ఏళ్ల చిరాగ్ శెట్టి మూడేళ్లుగా సాత్విక్‌తో కలిసి డబుల్స్‌లో ఆడుతున్నాడు. ఓవరాల్‌గా ఈ జోడీ ఇప్పటివరకు మొత్తం ఎనిమిది టైటిల్స్ సొంతం చేసుకుంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం దక్కించుకుంది. హోరాహోరీ... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లి జున్ హుయ్– లియు యు చెన్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన సాత్విక్–చిరాగ్ జంట ఈసారి మాత్రం ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. 62 నిమిషాలపాటు సాగిన పోరులో ప్రతి పాయింట్ కోసం రెండు జోడీలు తీవ్రంగా పోరాడాయి. మూడు గేముల్లోనూ అంతరం మూడు పాయింట్లలోపే ఉండటం మ్యాచ్ తీవ్రతను చాటి చెబుతోంది. గతంలో కీలకదశలో తడబాటుకు లోనై పాయింట్లు కోల్పోయి గొప్ప విజయాలు చేజార్చుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి సంయమనంతో ఆడి పైచేయి సాధించింది. సుదీర్ఘ ర్యాలీలకు అవకాశం ఇవ్వకుండా తక్కువ షాట్లలోనే పాయింట్లను ముగించిన సాత్విక్–చిరాగ్ జోడీ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 1–4తో, 3–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి 8–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని చేజిక్కించుకుంది. నాకు భుజం నొప్పిగా ఉండటంతో ఫైనల్లో నేను ముందుండి ఆడాలని, చిరాగ్ వెనుకుండి ఆడాలని నిర్ణయించాం. నేను ఎక్కువగా సర్వీస్, నెట్ వద్ద దృష్టి పెట్టాను. షటిల్‌ను తక్కువ ఎత్తులో ఉంచాలని, పాయింట్లను ముగించేందుకు తొందరపడకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాం. మా వ్యూహం ఫలించింది. టోర్నీ మొత్తం ప్రతి మ్యాచ్‌లోనూ మేము ఆశావహ దృక్పథంతో ఆడాం. వెనుకబడిన దశల్లోనూ నిగ్రహం కోల్పోకుండా సంయమనం ప్రదర్శించాం. మా జీవితంలోనే ఇది అతి పెద్ద విజయం. –సాత్విక్ సాయిరాజ్ ఈ విజయం సాత్విక్–చిరాగ్ కెరీర్లో ఎంతో గొప్పది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో మేటి జోడీలు బరిలోకి దిగాయి. ఈ గెలుపు భవిష్యత్‌లో వారికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక నుంచి డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలకు సాత్విక్–చిరాగ్ జంట నుంచి మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. –పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్ -
సాత్విక్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో భారత్‌కు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–14తో మూడో సీడ్ అక్బర్–ఇస్ఫహాని (ఇండోనేసియా) జంటపై నెగ్గింది. మిక్స్డ్ ఫైనల్లో టాప్ సీడ్ సిక్కిరెడ్డి–ప్రణవ్ (భారత్) ద్వయం 21–15, 19–21, 23–25తో ఆరో సీడ్ అక్బర్–వినీ ఒక్తవినా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కిరెడ్డి ద్వయం 3 మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సమీర్ వర్మ 21–15, 21–18తో సూంగ్ జూ వెన్ (మలేసియా)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకున్నాడు. -
ఫైనల్లో సాత్విక్ జంట
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సారుురాజ్ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక్-చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 8-11, 11-6, 11-2, 11-3తో ఆరోన్ చియా-జిన్ హవా తాన్ (మలేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ విభాగంలో శ్రేయాన్షి పరదేశి (భారత్) 12-11, 11-6, 11-7తో ఐదో సీడ్ హు జెన్ గ్రేస్ చువా (సింగపూర్)పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
చాంపియన్ రుత్విక శివాని
♦ కృష్ణప్రసాద్-సాత్విక్ జోడీకి డబుల్స్ టైటిల్ ♦ అంతర్జాతీయ జూ. బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : సుశాంత్ చిపల్కట్టి స్మారక అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా నాలుగో ఏడాది రుత్విక టైటిల్ గెలవడం విశేషం. మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఫైనల్లో టాప్ సీడ్ రుత్విక 21-9, 21-6తో రెండో సీడ్ సుపమర్త్ మింగ్‌చువా (థాయిలాండ్)ను చిత్తుగా ఓడించింది. 26 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. పురుషుల డబుల్స్‌లో కూడా తెలుగు కుర్రాళ్లు కృష్ణప్రసాద్-సాత్విక్ సాయిరాజ్ ద్వయం సత్తా చాటి టైటిల్ చేజిక్కించుకున్నారు. మూడో సీడ్ ప్రసాద్-సాత్విక్ జోడి ఫైనల్లో 21-15, 21-17 స్కోరుతో వారిత్ సరపత్-పనచై వోరసక్త్యాన్పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ విజేతగా నిలవగా... మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్‌ను ఇం డోనేసియా జోడీలు కైవసం చేసుకున్నాయి.