కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు.
73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్‌లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment