Mens badminton
-
Paris Olympics 2024: లక్ష్యసేన్ పరాజయం
పారిస్ ఒలింపక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీఫైనల్లో పరాజయంపాలయ్యాడు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ ఒలింపిక్స్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సేన్ (డెన్మార్క్) చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. రేపు జరుగబోయే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్.. మలేసియాకు చెందిన లీ జీని ఎదుర్కొంటాడు. ఫైనల్లో అక్సెల్సేన్.. థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సర్న్తో అమీతుమీ తేల్చుకుంటాడు. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
కిడాంబి శ్రీకాంత్ గెలిపించగా...
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియానుంచి భారత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్ వరకు వెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 21–16, 21–19తో జీన్ హ్యోక్ జీన్‌పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్‌లో టాప్ జోడి సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్ మిన్ హ్యూక్ – స్యూంగ్ జే సంచలన విజయం సాధించారు. రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–7, 2–19తో లీ యూన్ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల 16–21, 11–21తో కిమ్ వోన్ హో – సంగ్ సియూంగ్ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత కిడాంబి శ్రీకాంత్‌పై పడింది. తొలి గేమ్‌ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్‌పై శ్రీకాంత్ గెలుపొందాడు. -
ప్రియాన్షు సంచలనం.. ప్రపంచ 12వ ర్యాంకర్‌పై విజయం
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతార ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు ప్రపంచ 12వ ర్యాంకర్, టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. గతవారం స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు 21–8, 21–16తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. థామస్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రియాన్షు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 10–0తో ఆధిక్యంలోకి వెళ్లడం విశేషం. రెండో గేమ్‌లో ప్రియాన్షుకు పోటీ ఎదురైనా కీలకదశలో పాయింట్లు గెలిచి 42 నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడతాడు. -
మెయిన్ ‘డ్రా’కు ప్రణవ్ రావు అర్హత
థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు గంధం ప్రణవ్ రావు మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ప్రణవ్ రావు 15–21, 21–14, 21–17తో చాంగ్ షి చియె (చైనీస్ తైపీ)పై గెలుపొంది ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన హేమంత్ గౌడ, రవి కూడా మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టారు. -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 16–21, 21–11, 15–21తో ప్రపంచ 17వ ర్యాంక్ ద్వయం లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8,400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Malaysia Open 2023: సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ ద్వయం 17–21, 22–20, 21–9తో లియు యు చెన్–జువాన్ యి ఒయు (చైనా) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రణయ్ 16–21, 21–19, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్‌కు 6,875 డాలర్ల (రూ. 5 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
17 ఏళ్లకు జాతీయ స్థాయిలో దూసుకొచ్చిన కుర్రాడు.. బ్యాడ్మింటన్‌లో ప్రకాశం
దాదాపు యాభై ఏళ్ల క్రితం.. దక్షిణ భారతదేశంలో బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే! దిగువ స్థాయిలో గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయి.. ఆటంటే బాల్ బ్యాడ్మింటన్ మాత్రమే అనేంతగా పరిస్థితి కనిపించేది. నగరాల్లో కూడా ‘షటిల్ బ్యాడ్మింటన్ ’ గా పిలుచుకునే ఆటకు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇలాంటి స్థితిలో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల కుర్రాడొకడు జాతీయ స్థాయిలో దూసుకొచ్చాడు. నేపథ్యం కారణంగా తొలి అవకాశం తొందరగానే లభించినా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు అతనికి పదేళ్లు పట్టింది. ఆ విజయం తర్వాత అతను ఆగలేదు. దేశంలో బాడ్మింటన్ ఆటకే దిక్సూచిగా మారాడు. ఒక దేశంలో ఒక క్రీడ గురించి చెప్పుకోవడం మొదలు పెట్టగానే అందరికంటే ముందుగా ఒక పేరు స్ఫురిస్తుందంటే ఆ ఆటగాడు సాధించిన ఘనత ఏమిటో, ఆ ఆటకు అతను తెచ్చిన గుర్తింపు ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. అతని పేరే ప్రకాశ్ పడుకోణ్.. భారత బ్యాడ్మింటన్‌కు తొలితరం చిరునామా. ప్రకాశ్ పడుకోణ్ కంటే ముందు కూడా భారత ఆటగాళ్లు అంతర్జాతీయ బ్యాడ్మింట¯Œ లో కొన్ని విజయాలు సాధించారు. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన దినేశ్ ఖన్నా తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన కెరీర్ ఎక్కువ భాగం ఆసియాకే పరిమితమైంది. 60, 70వ దశకాల్లో బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యం లేదు. అలాంటి సమయంలో దినేశ్ ఆసియా స్థాయిలో విజేతగా నిలిచినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. అప్పట్లో బ్యాడ్మింటన్ అడ్డా యూరోప్ మాత్రమే. ఇంగ్లండ్, డెన్మార్క్‌లతో పాటు ప్రతిష్ఠాత్మక యూరోపియన్ లీగ్‌లు, క్లబ్‌లలో బ్యాడ్మింటన్ హవా నడిచేది. విజయాలు సాధించిన వారికే అక్కడ అందలం. సరిగ్గా ఇక్కడే ప్రకాశ్ పడుకోణ్ మిగతావారి కంటే భిన్నంగా నిలిచాడు. ఒక వైపు ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే యూరోప్‌లో సత్తా చాటడంతో ప్రకాశ్ ప్రత్యేకత కనిపించింది. కఠోర శ్రమతో.. ప్రకాశ్ తండ్రి మైసూరు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శిగా పని చేస్తుండటంతో సహజంగానే ప్రకాశ్‌కి ఆ ఆటపై ఆసక్తి కలిగింది. అయితే ఆటలో పదును ఉంటేనే మున్ముందు అవకాశాలు దక్కుతాయని త్వరలోనే ప్రకాశ్‌కి అర్థమైంది. 1962లో అమితోత్సాహంతో రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ బరిలోకి దిగిన అతను తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత మరో రెండేళ్ల శ్రమతో అదే టైటిల్ గెలుచుకున్నాడు. అయినా సరే, ప్రకాశ్ ఆట ఉత్తరాది షట్లర్లతో పోలిస్తే ఇంకా పేలవంగానే ఉండేది. జాతీయ స్థాయికి ఎదగాలంటే అది సరిపోదని గ్రహించాడు. అందుకే తన ఆట శైలిని మార్చుకున్నాడు. దూకుడును పెంచి ప్రత్యర్థిపై చెలరేగేందుకు తగిన అస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. అయినా సరే.. రాష్ట్ర స్థాయి విజేత నుంచి జాతీయ స్థాయికి చేరేందుకు ప్రకాశ్‌కు చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో అతణ్ణి ఎన్నో పరాజయాలు పలకరించాయి. పట్టుదలగా నిలబడ్డాడు. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి జాతీయ జూనియర్ టైటిల్ ప్రకాశ్ చేతికి చిక్కింది. అప్పటికే.. పదునెక్కిన ప్రకాశ్ ఆట సీనియర్లనూ నిలువరిస్తోంది. దాంతో జూనియర్ చాంపియన్ గా మారిన సంవత్సరమే పడుకోణ్ జాతీయ సీనియర్ చాంపియన్ గానూ మారాడు. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఏడు సంవత్సరాల పాటు ప్రకాశ్ జాతీయ చాంపియన్ గా నిలబడ్డాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో.. భారత బ్యాడ్మింటన్ లో శిఖరానికి చేరాక ప్రకాశ్ తర్వాతి అడుగు అంతర్జాతీయ టోర్నీల వైపే. 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించినా.. వ్యక్తిగత విభాగంలో విజయాలకు హైదరాబాద్ నగరమే తొలి వేదికగా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో 21 ఏళ్ల ప్రకాశ్ కాంస్యం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకు కెనడాలోని ఎడ్మాంటన్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల సింగిల్స్‌లో స్వర్ణపతకంతో మెరిశాడు. వరుసగా రెండు వరల్డ్ కప్‌లలో పతకాలు, వరల్డ్ గేమ్స్‌తో పాటు ఆసియా చాంపియన్ షిప్లో మరో పతకంతో ప్రకాశ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అప్పటికే బ్యాడ్మింటన్ అంటే దేశంలో ఒక్క ప్రకాశ్ పడుకోణ్ పేరు మాత్రమే వినిపించేంతగా ప్రసిద్ధికెక్కాడు. యూరోప్ గడ్డపై.. వేర్వేరు అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లిన సమయంలో ప్రకాశ్ ప్రత్యర్థుల ఆటపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా యూరోప్ ఆటగాళ్లతో పోలిస్తే తన ఆట చాలా వెనుకబడి ఉన్నట్లు గ్రహించాడు. అప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో మార్పు తీసుకురాకపోతే వెనుకబడి పోతాననీ అర్థంచేసుకున్నాడు. యూరోప్ వెళ్లి శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే శిక్షణ అంటూ వెళితే ఫలితం ఉండదని.. వీలైనన్ని ఎక్కువ టోర్నీలకు ఆడటంతో ఆటను సానబెట్టుకోవచ్చని అత్యంత సన్నిహితులు అతనికి సూచించారు. దాంతో తన మకాంను యూరోప్‌కు మార్చుకున్నాడు ప్రకాశ్. ఇంగ్లండ్, డెన్మార్క్, స్వీడన్ , నెదర్లాండ్స్.. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి క్లబ్‌లలో ఆడుతూ పోయాడు. అతను ఆశించినట్లుగానే అతని ఆట పైస్థాయికి చేరుకుంది. 1979లో లండన్ లో ‘ఈవెనింగ్ ఆఫ్ చాంపియన్స్’ టోర్నీలో విజయంతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఆట చివరకు ఒక చరిత్రాత్మక గెలుపుకి బాటలు వేసింది. కొనసాగిన విజయపరంపర ఆల్ ఇంగ్లండ్ గెలిచిన తర్వాత ప్రకాశ్‌కు స్వదేశంలో లభించిన స్వాగతం, పెద్ద ఊరేగింపుతో జరిగిన పౌర సన్మానం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ విక్టరీ తర్వాత అతని స్థాయి మరింత పెరిగిపోయింది. వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతో పాటు డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌లోనూ అతను కాంస్యం గెలుచుకున్నాడు. కోపెన్ హాగెన్ నగరంతో అనుబంధాన్ని ఆ తర్వాత కొనసాగిస్తూ ప్రకాశ్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండి లీగ్‌లలో పాల్గొన్నాడు (అతని కూతురు, పాపులర్ నటి దీపికా పడుకోణ్ అక్కడే పుట్టింది). 1986 సియోల్ ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో మరో పతకం అతని ఖాతాలో చేరింది. ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు గెలుచుకున్న ప్రకాశ్ 90వ దశకం ఆరంభంలో ఆటకు దూరంగా జరిగినా, కోచ్‌గా కొత్త బాధ్యతను తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రకాశ్ పడుకోణ్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చి దిద్దుతోంది. ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ ప్రకాశ్ ముందుచూపుకి ప్రతిరూపం. వేర్వేరు క్రీడాంశాల్లో ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, తగిన డైట్నివ్వడం, టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆర్థిక సహకారాన్ని అందించడం.. ఇలా అన్ని రకాలుగా వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ తనదైన రీతిలో అండగా ఉంటోంది. బిలియర్డ్స్ స్టార్ గీత్ సేథీతో కలసి ప్రకాశ్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసింది. ఆల్ ఇంగ్లండ్ ఘనత... బ్యాడ్మింటన్ లో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్. 1899లోనే మొదలైన ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం అంటే అతి పెద్ద ఘనత. ఆ సమయంలో వరల్డ్ చాంపియన్ షిప్‌తో పాటు దానికి సమాన హోదా ఉన్న టోర్నమెంట్ ఇది. యూరోపియన్ సర్క్యూట్లో వరుస విజయాలతో ప్రకాశ్ మంచి ఊపు మీదున్నాడు. కొన్నాళ్ల క్రితమే పెద్ద టోర్నీలు డానిష్ ఓపెన్ , స్వీడిష్ ఓపెన్ లలో అతను టైటిల్ కూడా దక్కించుకున్నాడు. 1980 ఆల్ ఇంగ్లండ్ టోర్నీ మొదలయ్యాక ఏకపక్ష విజయాలతో ఫైనల్ వరకు దూసుకొచ్చాడు. అప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఏ గేమ్‌లోనూ ప్రత్యర్థులు గరిష్ఠంగా 12 పాయింట్లకు మించి సాధించలేకపోయారంటే ప్రకాశ్ దూకుడు ఎలా సాగిందో అర్థమవుతుంది. 15–7, 15–12, 15–0, 15–10, 15–4, 15–4, 15–8, 15–10.. ఇవీ స్కోర్లు! ఫైనల్లో ఇండోనేసియాకు చెందిన లీమ్ స్వీ కింగ్ ఎదురయ్యాడు. ఆ సమయంలో అతను అత్యద్భుత ఫామ్‌లో ఉండి చెలరేగిపోతున్నాడు. ‘స్మాష్ కింగ్’గా గుర్తింపు తెచ్చుకొని అంతకు ముందు వరుసగా రెండేళ్లు ఇదే టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో ప్రకాశ్‌కు కష్టమే అనిపించింది. అయితే భారత స్టార్ ఎక్కడా తొణకలేదు. ప్రత్యర్థి గుర్తింపును పట్టించుకోలేదు. అన్నేళ్లుగా యూరోప్‌లో ఆడిన తన అనుభవాన్ని రంగరించాడు. ఫలితంగా 15–3, 15–10 తేడాతో ఘన విజయం.. ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు. ‘నన్ను ప్రకాశ్ హిప్నటైజ్ చేసినట్లు అనిపించింది’ అంటూ ఓటమి తర్వాత స్వీకింగ్ చేసిన వ్యాఖ్య ఈ గెలుపు ప్రత్యేకతను మరింత పెంచింది. 1980 నుంచి ఇప్పటి వరకు పుల్లెల గోపీచంద్ (2001) మినహా మరే భారత షట్లర్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ టోర్నీ గెలుచుకోలేకపోయారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో లక్ష్య సేన్
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఐదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది. -
చరిత్రకు చేరువలో భారత షట్లర్
సాంటెండర్ (స్పెయిన్): మూడు దశాబ్దాల ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో అండర్–19 పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేందుకు తమిళనాడు టీనేజర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 18 ఏళ్ల శంకర్ 21–13, 21–15తో పనిత్చాపోన్ తీరారత్సకుల్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)తో శంకర్ తలపడతాడు. ఫైనల్ చేరే క్రమంలో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన శంకర్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయాడు. -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
థామస్ కప్ విజయంపై పుల్లెల గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
థామస్ కప్ 2022లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల దాకా అందరూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. టీమిండియా సాధించిన అపురూప విజయంపై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందిస్తూ.. బ్యాడ్మింటన్‌కు ఈ విజయం 1983 క్రికెట్ వరల్డ్‌కప్ విజయం కంటే గొప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిస్తే.. తాజాగా కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని టీమిండియా సైతం 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తు చేసి బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసిందని అన్నాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచాక భారత క్రికెట్ రూపురేఖలు ఎలా మారిపోయాయో.. థామస్ కప్ గెలుపుతో భారత బ్యాడ్మింటన్‌కు కూడా శుభ ఘడియలు మొదలయ్యాయని తెలిపాడు. థామస్ కప్ విజయం ఇచ్చిన స్పూర్తితో భారత షట్లర్లు మున్ముందు మరిన్ని సంచనాలు నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బృందానికి నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను గోపీచంద్ ప్రత్యేకంగా అభినందించాడు. చదవండి: Thomas Cup 2022: షటిల్ కింగ్స్ -
Thomas Cup Final 2022 : బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన భారత్
-
థామస్ కప్ గెలిచిన భారత బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు. A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup! Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022 కాగా, పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..! -
భారత బ్యాడ్మింటన్ జట్టుకు భారీ నజరానా
బ్యాడ్మింటన్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్‌లాండ్ వేదికగా ఇండోనేషియాతో జరిగిన ఫైనల్లో 3-0 తేడాతో విజయం సాధించి తొలి సారి స్వర్ణాన్ని భారత్ ముద్దాడింది. సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియోపై విజయం సాధించారు. ఇక మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15,23-21 వరుస సెట్లలో జొనాతన్ క్రిస్టీని ఓడించి 3-0 అధిక్యంతో థామస్ కప్‌ను కైవసం చేసుకునేలా చేశాడు. ఇక థామస్ కప్ గెలిచన భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ప్రకటించింది. ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. చదవండి: Thomas Cup 2022: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్ కప్ కైవసం -
థామస్ ఉబర్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
-
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
Thomas Cup 2022: కొత్త చరిత్ర సృష్టిస్తారా!
బ్యాంకాక్: అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే ఆకట్టుకున్న భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు తొలి సారి థామస్ కప్‌ను అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే ఫైనల్లో భారత బృందం 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేసియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరడం ద్వారా గురువారం కనీసం కాంస్యం ఖాయం చేసుకున్న మన షట్లర్లు, శుక్రవారం మరో అడుగు ముందుకేసి సెమీస్‌లో కూడా విజయం సాధించారు. నాకౌట్ దశలో మలేసియా, డెన్మార్క్లను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించగా...ఇండోనేసియా జట్టు చైనా, జపాన్ల ను ఓడించింది. గత రికార్డుపరంగా చూస్తే ఇండోనేసియాకంటే భారత్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నా... డెన్మార్క్‌తో సెమీస్ పోరులో మన ఆట కొత్త ఆశలు రేపుతోంది. పైగా రెండు అద్భుత విజయాలు అందించిన ప్రేరణ మన ప్లేయర్లలో ఉత్సాహం పెంచడం ఖాయం. సింగిల్స్‌లో ఇప్పటి కే శ్రీకాంత్, ప్రణయ్ తమ సత్తా చాటగా మరో సింగిల్స్ మ్యాచ్ మాత్రం మనకు కలిసి రావడం లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్ ఈ సారైనా చెలరేగితే జట్టు బెంగ తీరుతుంది. మూడు సింగిల్స్‌లో గెలిచే అవకాశాలు ఉంటే...రెండు డబుల్స్ మ్యాచ్‌లలో కనీసం ఒకటై నా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి తమ పాత్రను సమర్థంగా పోషించగలరు. గాయంతోనే సెమీస్‌లో ఆడిన ప్రణయ్ పూర్తి స్థాయిలో కోలుకోవాల్సి ఉంది. -
ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం
కటక్: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్ జిందాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్ 21–16, 21–19తో అభిషేక్ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–కృష్ణప్రసాద్ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్ జిందాల్–హార్దిక్ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
టెన్నిస్‌లో పురుషులకే ఎక్కువసార్లు శిక్ష
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ క్రీడలో ఇప్పటిదాకా మహిళల కంటే పురుషులకే ఎక్కువ శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఓ నివేదికలో తేలింది. గ్రాం డ్‌స్లామ్ టోర్నీల్లో గత 20 ఏళ్లలో ఆటగాళ్లకు 1517 సార్లు జరిమానాలు విధిస్తే... క్రీడాకారిణిలకు కేవలం 535 సార్లు మాత్రమే జరిమానాలు విధించినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. 1998 నుంచి 2018 వరకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లను పరిశీలించగా 3 రెట్లు అధికంగా పురుషులకే శిక్షలు పడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. ఆటగాళ్లు, క్రీడాకారిణిలు అసహనంతో చేసిన తప్పిదాలకు ఎవరెన్నిసార్లు శిక్షలకు గురయ్యారనే లెక్కలు కూడా ఉన్నాయి. కోర్టులో రాకెట్లను బద్దలు కొట్టిన సందర్భంలో పురుషులు 649 సార్లు, మహిళలు 99 సార్లు పాయింట్ల కోతకు గురయ్యారు. అనుచితంగా నోరు పారేసుకున్న ఘటనల్లో పురుషులు 344 సార్లు, మహిళలు 140 సార్లు, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించిన ఘటనల్లో పురుషులు 287 సార్లు, మహిళలు 67 సార్లు శిక్షకు గురయ్యారు. గత వారం యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్)తో మ్యాచ్ సందర్భంగా సెరెనా విలియమ్స్ ఒక్కసారిగా సహనం కోల్పో యిన సంగతి తెలిసిందే. చైర్ అంపైర్‌ను దూషించడంతో ఆయన అంతే తీవ్రంగా స్పందించి ఆమెకు పాయింట్ల కోత పెట్టారు. పురుషులు ఇలా చేస్తే అలాగే శిక్షించేవారా అని ఆమె గద్దించింది. సమానత్వం కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. సెరెనా నోరు పారేసుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. 2009లో లైన్ విమెన్‌పై విరుచుకుపడింది. ఈ ఏడాది ఇండియన్ వెల్స్ టోర్నీలో మీడియా సమావేశంలో ఓ విలేకరిపై అసహనం ప్రదర్శించింది. -
డెన్మార్క్ ధమాక
తొలిసారి థామస్ కప్ టైటిల్ సొంతం కున్షాన్ (చైనా): ఇన్నాళ్లూ ఆసియా దేశాల ఆధిపత్యం కనిపించిన పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ థామస్ కప్‌లో ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యూరోప్ దేశం డెన్మార్క్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ 3-2తో గతంలో 13సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియాపై విజయం సాధించింది. 67 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ టోర్నీలో డెన్మార్క్ గతంలో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తో సరిపెట్టుకోగా... తొమ్మిదో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. డెన్మార్క్ తరఫున మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్సన్, జార్గెన్‌సన్, విటింగస్ గెలిచి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.