ఆటలే ఆరోప్రాణం | He was a regular student in the field of Sports | Sakshi
Sakshi News home page

ఆటలే ఆరోప్రాణం

Published Fri, Nov 28 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

ఆటలే ఆరోప్రాణం

ఆటలే ఆరోప్రాణం

సాక్షి, రాజమండ్రి : క్రీడా రంగంలో ఆయనొక నిత్య విద్యార్థి. తాను నేర్చుకుంటూనే ఉన్నారు. ఇతరులకు నేర్పే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 58 సంవత్సరాలు. క్రీడలే సర్వస్వంగా జీవిస్తున్న ఆయన నేటి యువతరానికి ఓ స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు సుంకర నాగేంద్ర కిషోర్. తండ్రి సుంకర భాస్కరరావు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తండ్రి ఆదర్శంగా చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న నాగేంద్ర కిషోర్ టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణించారు.

ఆ క్రీడలో వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాల పంటలు పండించిన సుంకర క్రీడల కోటాలో భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించారు. ఆ సంస్థ టీటీ జట్టు సభ్యునిగా పలు టోర్నీల్లో పాల్గొన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగం నుంచి రిటైరైనా క్రీడారంగంలో కృషి నుంచి విరమించలేదు. తండ్రి పేరుతో దానవాయిపేటలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధనా కేంద్రాన్ని, ఇంటి వద్దే తల్లి రాఘవమ్మ పేరుతో టీటీ శిక్షణ, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా విద్యార్థులు, యువతలో క్రీడా సామర్థ్యానికి సానబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. క్రీడలు చదువులకు అడ్డంకి కాదని, శారీరక, మానసిక, జీవన వికాసాలకు దోహదపడతాయని నిరూపించే దిశగా  ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు.
 
విద్యార్థి దశ నుంచీ క్రీడాసక్తి
రాజమండ్రిలో 58 సంవత్సరాల క్రితం జన్మించిన కిషోర్ గాంధీపురం మున్సిపల్ పాఠశాల, నివేదిత కిషోర్ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో చదివిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఇంటర్ వరకూ వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో అన్ని స్థాయిల  పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. పదో తరగతి నుంచే టీటీపై మరింత మక్కువ చూపుతూ డిగ్రీ తర్వాత ఆ క్రీడ పైనే దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర, అంతర్ యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పలు పతకాలు సాధించారు.

భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించాక ఆ సంస్థ సౌత్‌జోన్ టీం తరఫున 30 ఏళ్లు వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. బీఎస్సీ విద్యార్హతకు తోడు ఇప్పటికే ఎంబీఏ కూడా పూర్తి చేసిన కిషోర్ కో ఆపరేటివ్, రూరల్ స్టడీస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్‌మెంటు, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో డిప్లమోలు చేశారు. ప్రస్తుతం ‘సొసైటీ ఓరియంటెడ్ పార్టిసిపేటివ్ రీసెర్చి’ పేరుతో క్రీడలను సామాజిక అవ సరం గా అన్వయించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.లలితారాణి పర్యవేక్షణలో పరిశోధన చేస్తూనే ఎంఏ సైకాలజీ చదువుతున్నారు.
 
ఘనత వహించిన క్రీడా కుటుంబం
కిషోర్ తండ్రి భాస్కరరావు, ఆయన ఐదుగురు సోదరులు జాతీయస్థాయిలో రాణించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు. భాస్కరరావు ‘ఆంధ్ర రాష్ట్ర క్రీడా పితామహుడు’గా బిరుదు పొందారు. 1978లో ఇండియా- స్వీడన్‌ల మధ్య అంతర్జాతీయ మహిళా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించి  రాజమండ్రికి ఖ్యాతి తెచ్చారు. వివిధ దేశాల ఫుట్‌బాల్ టీంలను ఈ అన్నదమ్ములు మట్టి కరిపించి దేశానికి పతకాలు పండించారు.
 
యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపు, మానవ క్రీడా వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. ఇందుకోసం ఏడేళ్ల లోపు విద్యార్థుల్లో క్రీడా సామర్థాన్ని సూచించే స్పోర్ట్స్ ఇన్వెన్షన్ కార్డులు, క్రీడలకు అవసరమైన శారీరక సంసిద్ధత యువత, విద్యార్థుల్లో ఏ మేరకు ఉన్నదీ ధృవీకరిస్తూ స్పోర్ట్స్ అసెస్‌మెంటు కార్డులు, వారి ఆరోగ్య ప్రమాణాలను సూచి స్తూ హెల్త్ కాన్షస్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందుకు ప్రత్యేక పరీక్షలు, తర్ఫీదు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ప్ర శాంతి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ సీవీ ఎస్ శాస్త్రిల సహకారంతో క్రీడాపరమైన కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement