టేబుల్‌ టెన్నిస్‌లో గ్రామీణ కుసుమం | Naga Shravani was selected for national level table tennis tournament 15 times | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌లో గ్రామీణ కుసుమం

Published Sat, Mar 30 2019 1:36 AM | Last Updated on Sat, Mar 30 2019 1:36 AM

Naga Shravani was selected for national level table tennis tournament 15 times - Sakshi

క్రీడల్లో రాణించాలంటే చాలా కష్టపడాలి. జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక కావాలంటేనే ఎంతో శ్రమ అవసరం. అలాంటిది నగరానికి చెందిన బీ. నాగశ్రావణి జాతీయస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలకు ఇప్పటివరకు ఏకంగా 15 సార్లు ఎంపికై తన సత్తాను చాటుకుంది. 8 ఏళ్ల వయస్సులో క్రీడల్లో పాల్గొనింది. ఆట ఏదైనా క్రమపద్ధతి ద్వారా దూసుకుపోవాలనుకుంది. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం ఈఈఈ విభాగంలో చదువుతుంది. క్యాడెట్‌ విభాగం నుంచి ప్రారంభమై ప్రస్తుతం సీనియర్‌ మహిళా విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైంది. తన 11 ఏళ్ల క్రీడాచరిత్రలో ఎందరో క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసింది. 

అక్కకు తనే స్ఫూర్తి
సాధారణంగా క్రీడల్లో తన కంటే పెద్దవారు తన క్రీడకు స్ఫూర్తిగా ఉంటారు. కానీ నాగశ్రావణì మాత్రం తన అక్క ఉమాదేవికి తనే ఆదర్శం. టేబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న చెల్లిని చూసి, తాను కూడా ఆట నేర్చుకుంది ఉమాదేవి. అంతేకాదు, యూనివర్శిటీ పరిధిలో జాతీయస్థాయిలో స్వర్ణపతకాన్ని సాధించింది. వీటితోపాటు ఇంటర్మీడియట్‌లో స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 విభాగంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. దీంతోపాటుగా  తన చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు తనే ఆదర్శంగా నిలుస్తుంది. తన ఆటను చూసి ఎందరో
చిన్నారులు టేబుల్‌ టెన్నిస్‌ను నేర్చుకుంటున్నారు. 

కుటుంబ నేపథ్యం
తండ్రి శ్రీనివాసులు ఓ హోటల్‌ యజమాని. తల్లి సావిత్రి సాధారణ గృహిణి. అక్క ఉమాదేవి. యూనివర్శిటీ స్థాయిలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. పెద్దనాన్న వారితో కలిసి నగరంలోని పాతూరులో ఉన్న బోయవీధిలో నివసిస్తున్నారు. పెద్దనాన్న కుమారుడి ప్రోత్సాహంతో టేబుల్‌టెన్నిస్‌లో తన కెరీర్‌ను మొదలెట్టింది. 

పతకాల పంట
రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు 50 టైటిల్స్‌ సాధించి రాష్ట్రస్థాయి జూనియర్, యూత్‌ విభాగంలో రాష్ట్రఛాంపియన్‌గా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పాయింట్ల పట్టికలోను జూనియర్‌ విభాగంలో 405, యూత్‌లో 420, సీనియర్‌ మహిళా విభాగంలో 315 పాయింట్లతో ముందుంది. తన ఆటతీరును చూస్తే ప్రత్యర్థికి చమటలు పట్టిస్తుంది. ప్రధానంగా ర్యాలీస్, కౌంటర్స్, సర్వీస్‌ చేయడంలో దిట్ట. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది. టీమ్‌ ఈవెంట్‌లోను రెండు కాంస్య పతకాలు సాధించింది.  

జాతీయస్థాయిలో ప్రతిభ
రెండవ తరగతిలో టేబుల్‌టెన్నిస్‌ క్రీడలో ప్రవేశించి 6వ తరగతిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యపతకం సాధించి ఘనత సాధించింది శ్రావణి. దీంతోపాటు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోను కాంస్యపతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో టేబుల్‌టెన్నిస్‌ క్రీడా పోటీల్లో సాధించిన ఘనతతో తను 10వ తరగతి వరకు మొదటి మూడు ర్యాంకులలో  కొనసాగింది. 

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా... 
ఆంధ్ర నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనేదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది నాగశ్రావణి. పాఠశాల స్థాయిలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత అందించేది. ప్రస్తుతం దీనికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఆదుకునే వారే లేరు. అయినా, కోచ్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ స్థాయి క్రీడలో రాణించగలుగుతున్నాననీ, క్రీడల్లో రాణించాలంటే ఆర్థికతోడ్పాటు కూడా ఉండాలనీ, కానీ తనకు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది నాగ శ్రావణి. 

క్రీడ ద్వారా ఉద్యోగాన్ని సాధించాలి
‘‘నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు సాధించి పెట్టిన క్రీడ ద్వారానే ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను. ఇంజినీరింగ్‌ను పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. ఆంధ్రనుంచి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలి’’ అంటున్న ఈ    గ్రామీణ క్రీడా కుసుమం నాగ శ్రావణి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. 

– మైనుద్దీన్, సాక్షి, అనంతపురం
ఫొటోలు: వీరేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement