Table tennis sport
-
టేబుల్ టెన్నిస్‌లో గ్రామీణ కుసుమం
క్రీడల్లో రాణించాలంటే చాలా కష్టపడాలి. జిల్లా స్థాయి జట్టుకు ఎంపిక కావాలంటేనే ఎంతో శ్రమ అవసరం. అలాంటిది నగరానికి చెందిన బీ. నాగశ్రావణి జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఇప్పటివరకు ఏకంగా 15 సార్లు ఎంపికై తన సత్తాను చాటుకుంది. 8 ఏళ్ల వయస్సులో క్రీడల్లో పాల్గొనింది. ఆట ఏదైనా క్రమపద్ధతి ద్వారా దూసుకుపోవాలనుకుంది. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ఈఈఈ విభాగంలో చదువుతుంది. క్యాడెట్ విభాగం నుంచి ప్రారంభమై ప్రస్తుతం సీనియర్ మహిళా విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైంది. తన 11 ఏళ్ల క్రీడాచరిత్రలో ఎందరో క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసింది. అక్కకు తనే స్ఫూర్తి సాధారణంగా క్రీడల్లో తన కంటే పెద్దవారు తన క్రీడకు స్ఫూర్తిగా ఉంటారు. కానీ నాగశ్రావణì మాత్రం తన అక్క ఉమాదేవికి తనే ఆదర్శం. టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తున్న చెల్లిని చూసి, తాను కూడా ఆట నేర్చుకుంది ఉమాదేవి. అంతేకాదు, యూనివర్శిటీ పరిధిలో జాతీయస్థాయిలో స్వర్ణపతకాన్ని సాధించింది. వీటితోపాటు ఇంటర్మీడియట్లో స్కూల్ గేమ్స్ అండర్–19 విభాగంలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. దీంతోపాటుగా తన చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు తనే ఆదర్శంగా నిలుస్తుంది. తన ఆటను చూసి ఎందరో చిన్నారులు టేబుల్ టెన్నిస్‌ను నేర్చుకుంటున్నారు. కుటుంబ నేపథ్యం తండ్రి శ్రీనివాసులు ఓ హోటల్ యజమాని. తల్లి సావిత్రి సాధారణ గృహిణి. అక్క ఉమాదేవి. యూనివర్శిటీ స్థాయిలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. పెద్దనాన్న వారితో కలిసి నగరంలోని పాతూరులో ఉన్న బోయవీధిలో నివసిస్తున్నారు. పెద్దనాన్న కుమారుడి ప్రోత్సాహంతో టేబుల్‌టెన్నిస్‌లో తన కెరీర్‌ను మొదలెట్టింది. పతకాల పంట రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు 50 టైటిల్స్ సాధించి రాష్ట్రస్థాయి జూనియర్, యూత్ విభాగంలో రాష్ట్రఛాంపియన్‌గా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పాయింట్ల పట్టికలోను జూనియర్ విభాగంలో 405, యూత్‌లో 420, సీనియర్ మహిళా విభాగంలో 315 పాయింట్లతో ముందుంది. తన ఆటతీరును చూస్తే ప్రత్యర్థికి చమటలు పట్టిస్తుంది. ప్రధానంగా ర్యాలీస్, కౌంటర్స్, సర్వీస్ చేయడంలో దిట్ట. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది. టీమ్ ఈవెంట్లోను రెండు కాంస్య పతకాలు సాధించింది. జాతీయస్థాయిలో ప్రతిభ రెండవ తరగతిలో టేబుల్‌టెన్నిస్ క్రీడలో ప్రవేశించి 6వ తరగతిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యపతకం సాధించి ఘనత సాధించింది శ్రావణి. దీంతోపాటు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోను కాంస్యపతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో టేబుల్‌టెన్నిస్ క్రీడా పోటీల్లో సాధించిన ఘనతతో తను 10వ తరగతి వరకు మొదటి మూడు ర్యాంకులలో కొనసాగింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా... ఆంధ్ర నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనేదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది నాగశ్రావణి. పాఠశాల స్థాయిలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత అందించేది. ప్రస్తుతం దీనికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఆదుకునే వారే లేరు. అయినా, కోచ్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ స్థాయి క్రీడలో రాణించగలుగుతున్నాననీ, క్రీడల్లో రాణించాలంటే ఆర్థికతోడ్పాటు కూడా ఉండాలనీ, కానీ తనకు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది నాగ శ్రావణి. క్రీడ ద్వారా ఉద్యోగాన్ని సాధించాలి ‘‘నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు సాధించి పెట్టిన క్రీడ ద్వారానే ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను. ఇంజినీరింగ్‌ను పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. ఆంధ్రనుంచి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలి’’ అంటున్న ఈ గ్రామీణ క్రీడా కుసుమం నాగ శ్రావణి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం. – మైనుద్దీన్, సాక్షి, అనంతపురం ఫొటోలు: వీరేష్ -
ఆటలే ఆరోప్రాణం
సాక్షి, రాజమండ్రి : క్రీడా రంగంలో ఆయనొక నిత్య విద్యార్థి. తాను నేర్చుకుంటూనే ఉన్నారు. ఇతరులకు నేర్పే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 58 సంవత్సరాలు. క్రీడలే సర్వస్వంగా జీవిస్తున్న ఆయన నేటి యువతరానికి ఓ స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు సుంకర నాగేంద్ర కిషోర్. తండ్రి సుంకర భాస్కరరావు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తండ్రి ఆదర్శంగా చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న నాగేంద్ర కిషోర్ టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణించారు. ఆ క్రీడలో వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాల పంటలు పండించిన సుంకర క్రీడల కోటాలో భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించారు. ఆ సంస్థ టీటీ జట్టు సభ్యునిగా పలు టోర్నీల్లో పాల్గొన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగం నుంచి రిటైరైనా క్రీడారంగంలో కృషి నుంచి విరమించలేదు. తండ్రి పేరుతో దానవాయిపేటలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధనా కేంద్రాన్ని, ఇంటి వద్దే తల్లి రాఘవమ్మ పేరుతో టీటీ శిక్షణ, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా విద్యార్థులు, యువతలో క్రీడా సామర్థ్యానికి సానబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. క్రీడలు చదువులకు అడ్డంకి కాదని, శారీరక, మానసిక, జీవన వికాసాలకు దోహదపడతాయని నిరూపించే దిశగా ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ క్రీడాసక్తి రాజమండ్రిలో 58 సంవత్సరాల క్రితం జన్మించిన కిషోర్ గాంధీపురం మున్సిపల్ పాఠశాల, నివేదిత కిషోర్ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో చదివిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఇంటర్ వరకూ వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో అన్ని స్థాయిల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. పదో తరగతి నుంచే టీటీపై మరింత మక్కువ చూపుతూ డిగ్రీ తర్వాత ఆ క్రీడ పైనే దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర, అంతర్ యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పలు పతకాలు సాధించారు. భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించాక ఆ సంస్థ సౌత్‌జోన్ టీం తరఫున 30 ఏళ్లు వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. బీఎస్సీ విద్యార్హతకు తోడు ఇప్పటికే ఎంబీఏ కూడా పూర్తి చేసిన కిషోర్ కో ఆపరేటివ్, రూరల్ స్టడీస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంటు, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో డిప్లమోలు చేశారు. ప్రస్తుతం ‘సొసైటీ ఓరియంటెడ్ పార్టిసిపేటివ్ రీసెర్చి’ పేరుతో క్రీడలను సామాజిక అవ సరం గా అన్వయించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.లలితారాణి పర్యవేక్షణలో పరిశోధన చేస్తూనే ఎంఏ సైకాలజీ చదువుతున్నారు. ఘనత వహించిన క్రీడా కుటుంబం కిషోర్ తండ్రి భాస్కరరావు, ఆయన ఐదుగురు సోదరులు జాతీయస్థాయిలో రాణించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు. భాస్కరరావు ‘ఆంధ్ర రాష్ట్ర క్రీడా పితామహుడు’గా బిరుదు పొందారు. 1978లో ఇండియా- స్వీడన్ల మధ్య అంతర్జాతీయ మహిళా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించి రాజమండ్రికి ఖ్యాతి తెచ్చారు. వివిధ దేశాల ఫుట్‌బాల్ టీంలను ఈ అన్నదమ్ములు మట్టి కరిపించి దేశానికి పతకాలు పండించారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపు, మానవ క్రీడా వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. ఇందుకోసం ఏడేళ్ల లోపు విద్యార్థుల్లో క్రీడా సామర్థాన్ని సూచించే స్పోర్ట్స్ ఇన్వెన్షన్ కార్డులు, క్రీడలకు అవసరమైన శారీరక సంసిద్ధత యువత, విద్యార్థుల్లో ఏ మేరకు ఉన్నదీ ధృవీకరిస్తూ స్పోర్ట్స్ అసెస్మెంటు కార్డులు, వారి ఆరోగ్య ప్రమాణాలను సూచి స్తూ హెల్త్ కాన్షస్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందుకు ప్రత్యేక పరీక్షలు, తర్ఫీదు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ప్ర శాంతి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ సీవీ ఎస్ శాస్త్రిల సహకారంతో క్రీడాపరమైన కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు.