సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. లక్నోలో నిర్వహించిన ఆల్‌ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వివిధ పోటీల్లో కలిపి మొత్తం ఐదు బంగారు పతకాలు, ఏడు వెండి పతకాలు తెలంగాణ పోలీస్‌శాఖకు దక్కాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించి, ప్రతిష్టాత్మకమైన చార్మినార్ ట్రోఫీ దక్కించుకున్నారు.12 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ ఘనత సాధించారు.
శెభాష్ తెలంగాణ పోలీస్: ప్రతిభను చాటిన తెలంగాణ పోలీసులను అభినందిస్తూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘పతకాలు సాధించిన విజేతలు, డీజీపీ రవిగుప్తా, మొత్తం తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు ’అని సీఎం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన వారిలో జి.రామకృష్ణారెడ్డి, డి.విజయ్‌కుమార్, వి.కిరణ్‌కుమార్, పి.అనంతరెడ్డి, ఎం.దేవేందర్‌ప్రసాద్, వెండి పతకాలు సాధించినవారిలో పి.పవన్, ఎన్.వెంకటరమణ, ఎం.హరిప్రసాద్, కె.శ్రీనివాస్, షేక్‌ఖాదర్ షరీఫ్, సీహెచ్.సంతోష్, కె.సతీష్లు ఉన్నారని డీజీపీ రవిగుప్తా తెలిపారు.
ఆయా విభాగాల వారీగా చూస్తే..
► కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం
► పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో ఒక బంగారు, ఒక వెండి పతకం
► డాగ్ స్క్వాడ్ పోటీల్లో ఒక బంగారు, ఒక వెండి పతకం
► యాంటీ స్టాబేజ్ చెక్‌లో రెండు బంగారు, మూడు వెండి పతకాలు
► పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం దక్కాయి.
►జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు ఒక వెండి, మూడు కాంస్య పతకాలు, మూడోస్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment