భావి ఒలింపిక్స్ క్రీడాకారులకు శిక్షణ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో: సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ (నాలుగో నగరం)లో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో క్రీడల వాతావరణం పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ దోహద పడుతుంది. ఇందులో భాగంగా సుమారు డజనుకు పైగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను నెలకొల్పు తారు. క్రీడా విజ్ఞాన శాస్త్రం, క్రీడల వైద్యానికి సంబంధించిన కేంద్రాలు కూడా ఇందులో ఉంటాయి.
ఈ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రీడా రంగంలో ఇది అగ్రస్థానంలో ఉంది. 1976లో ఏర్పాటైన ఈ వర్సిటీలో అథ్లెటిక్స్‌కు సంబంధించిన అనేక కోర్సులు అందిస్తున్నారు.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. కాగా యూనివర్సిటీ సందర్శన సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో విలువిద్య పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన లిమ్ సి హైయోన్‌తోనూ సీఎం భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను సాంకేతిక భాగస్వాములుగా చేర్చుకుని భవిష్యత్తు ఒలింపిక్స్ విజేతలకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్ష
కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రహదారులు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి అజిత్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్‌లతో శనివారం తన నివాసంలో సీఎం సమీక్షించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాల, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment