న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నమెంటు సీజన్‌లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగం ఆదాయం రూ. 2,900–3,100 కోట్లకు చేరనుంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే 30–35 శాతం పెరగనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్ ఈ విషయాలు వెల్లడించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 6.5–7 కోట్ల మంది యూజర్లు లావాదేవీలు జరపవచ్చని అంచనా వేసింది. గత 4–5 ఏళ్లుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతుండగా, ఈ ఏడాది 20–30% స్థాయిలో పెరగవచ్చని సంస్థ పార్ట్‌నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు.
ప్రతి యూజరుపై ఆదాయం గత ఐపీఎల్ సీజన్‌లో రూ. 410గా ఉండగా ఈ సీజన్‌లో రూ. 440కి చేరవచ్చని పేర్కొన్నారు. మార్కెటింగ్‌పై గణనీయంగా ఖర్చు చేస్తుండటంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెరుగుతోందని చౌదరి చెప్పారు. ‘నిబంధనలు, జీఎస్‌టీపై స్పష్టత వచ్చింది. గూగుల్ కూడా తమ ప్లేస్టోర్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తుండటం మరో సానుకూలాంశం.
ఇవన్నీ కూడా భారత్‌లో ఈ స్పోర్ట్స్‌కు అనుకూలమైన పరిణామాలే‘ అని పేర్కొన్నారు. పైలట్ ప్రోగ్రాం కింద డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ రమ్మీ, ఫ్యాంటసీ క్రికెట్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ తమ ప్లేస్టోర్‌లో అనుమతించింది. మార్చి 31తో ప్రారంభమైన ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నీ.. మే నెలాఖరు వరకు కొనసాగనుంది. రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం.. ఏడాది మొత్తం మీద ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ఆదాయంలో ఐపీఎల్ సీజన్ వాటా 35–40% ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment