strategy consultant
-
ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆదాయం 35 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నమెంటు సీజన్లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగం ఆదాయం రూ. 2,900–3,100 కోట్లకు చేరనుంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే 30–35 శాతం పెరగనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్ ఈ విషయాలు వెల్లడించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 6.5–7 కోట్ల మంది యూజర్లు లావాదేవీలు జరపవచ్చని అంచనా వేసింది. గత 4–5 ఏళ్లుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతుండగా, ఈ ఏడాది 20–30% స్థాయిలో పెరగవచ్చని సంస్థ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. ప్రతి యూజరుపై ఆదాయం గత ఐపీఎల్ సీజన్లో రూ. 410గా ఉండగా ఈ సీజన్లో రూ. 440కి చేరవచ్చని పేర్కొన్నారు. మార్కెటింగ్‌పై గణనీయంగా ఖర్చు చేస్తుండటంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెరుగుతోందని చౌదరి చెప్పారు. ‘నిబంధనలు, జీఎస్టీపై స్పష్టత వచ్చింది. గూగుల్ కూడా తమ ప్లేస్టోర్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తుండటం మరో సానుకూలాంశం. ఇవన్నీ కూడా భారత్‌లో ఈ స్పోర్ట్స్‌కు అనుకూలమైన పరిణామాలే‘ అని పేర్కొన్నారు. పైలట్ ప్రోగ్రాం కింద డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ రమ్మీ, ఫ్యాంటసీ క్రికెట్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ తమ ప్లేస్టోర్‌లో అనుమతించింది. మార్చి 31తో ప్రారంభమైన ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నీ.. మే నెలాఖరు వరకు కొనసాగనుంది. రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం.. ఏడాది మొత్తం మీద ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ఆదాయంలో ఐపీఎల్ సీజన్ వాటా 35–40% ఉంటుంది. -
ఎనిమిదేళ్లలో 2.2 కోట్ల ఈ–టూవీలర్లు
ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 2030 నాటికి భారత్‌లో 2.2 కోట్ల యూనిట్లకు చేరతాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక వెల్లడించింది. అందుబాటు ధరలో రవాణా సౌకర్యాలకు డిమాండ్, కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యం ఇందుకు కారణమని వివరించింది. ‘2022లో దేశంలో జరిగిన మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా కేవలం 3 శాతమే. అదే యూఎస్‌లో అయితే ఈవీల వాటా ఏకంగా 63 శాతం, చైనాలో 56 శాతం ఉంది. పెట్రోల్‌తో పోలిస్తే ఈవీలతో యాజమాన్య ఖర్చులు చాలా తక్కువ. అందుకే క్రమంగా కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. దిగుమతులను ఆసరాగా చేసుకుని చాలా బ్రాండ్లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. మార్కెట్ పరిపక్వత చెంది, నిబంధనలు కఠినతరం అయితే ఈ రంగం ఏకీకృతం (కన్సాలిడేట్) అవుతుంది’ అని తెలిపింది. ప్రయాణ ఖర్చు తక్కువ.. ‘కొత్త కొత్త బ్రాండ్ల చేరికతో మోడళ్లను ఎంపిక చేసుకోవడానికి కస్టమర్లకు అవకాశం ఉంటుంది. ఫీచర్లు, రోజువారీ వ్యయం, వాహన ధర ఆధారంగా ఈవీ కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. కొనుగోలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ టూ వీలర్లతో పోలిస్తే ప్రయాణానికి అయ్యే ఖర్చు తక్కువ. ‘ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుంది’ అన్న వినియోగదార్ల ఆందోళన పరిశ్రమకు పెద్ద అడ్డంకిగా ఉంది. ఈవీ అమ్మకాలు పెరిగేకొద్దీ సుదూర ప్రయాణాలకు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అవసరం అవుతుంది. ప్రధానంగా వేగంగా చార్జింగ్ పూర్తి అయ్యేలా ఫాస్ట్ చార్జింగ్ వసతులు ఉండాలి. ఈవీలు సింహ భాగం చేజిక్కించుకునే వరకు ఫేమ్, పీఎల్ఐ పథకాలు కొనసాగాలి’ అని నివేదిక వివరించింది. -
మోడీ- సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ..?
నరేంద్ర మోడీ- సామాజిక కార్యకర్త, ఎల్ కే అద్వానీ- జర్నలిస్ట్, రాజ్‌నాథ్ సింగ్- టీచర్, మురళీ మనోహర్ జోషి- ప్రొఫెసర్, సోనియా గాంధీ- రాజకీయ, సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ- వ్యూహ సలహాదారు(స్ట్రాటజీ కన్సల్టెంట్)... ఏమిటీ అగ్ర నాయకులందరూ రాజకీయాలు వదిలేసి ఇలా ఎప్పుడు మారిపోయారని అనుకుంటున్నారా. కంగారు పడకండి వీరంతా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. రాజకీయాల పరంగా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారన్న ప్రశ్నకు ఆయా నాయకులు ఇచ్చిన సమాధానాలివి. ఈ జాబితాను పార్లమెంట్ వెబ్సైట్ లో పెట్టారు. 16వ లోక్‌సభలో ఉన్న 539 మంది ఎంపీలను ఆయా వృత్తులు పరంగా 33 విభాగాల కింద పొందుపరిచారు. ఇందులో వ్యవసాయదారులు, బిల్డర్లు, వైద్యులు, విద్యావేత్తలు, టీచర్లు, క్రీడాకారులు, కళాకారులు, మతబోధకుడు, సామాజిక సంస్కర్తలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను రచించిన వ్యూహాలు ఘోరంగా విఫలమైనా రాహుల్ గాంధీ తనను స్ట్రాటజీ కన్సల్టెంట్ గా చెప్పుకోవడం విశేషం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బర్హంపూర్ ఎంపీ ఆదిర్ రాజన్ చౌదరీ.. తాను సామాజిక సంస్కర్తగా పేర్కొనడం మరీ విడ్డూరం. ఎందుకంటే ఆయనపై ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. భారత టెస్టు క్రికెటర్ కీర్తి ఆజాద్- క్రీడాకారుడిగా చెప్పుకోవడానికే ఇష్టపడ్డారు. ఇక యువ ఎంపీ అనురాగ్ థాకూర్ ఒక్కరే క్రికెటర్ గా చెప్పుకున్నారు. శశి థరూర్ తనను తాను దౌత్యవేత్తగా పరిచయం చేసుకున్నారు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే మత బోధకుడిగా చెప్పుకున్నారు. పూనమ్ మహాజన్- బిజినెస్ పర్సన్-గా, మేనకా గాంధీ- రచయితగా, సౌగతా రాయ్-విద్యావేత్తగా తమను తామను నిర్వచించుకున్నారు. సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లు న్యాయవాద వృత్తిపై మక్కువ చూపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా-రాజకీయ, సామాజిక కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడ్డారు.