ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మంత్రి ఆర్‌కే రోజా, అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు, పీవీ సింధు, సాకేత్ మైనేని, వి.జ్యోతి సురేఖ, ఎస్‌కె జఫ్రీన్
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని బెంచ్ మార్క్‌లా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. దీనిద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర జీవనాన్ని పెంపొందించడంలో భాగంగా వ్యాయామం, క్రీడలను ప్రోత్సహించడం ఒక ప్రధాన కారణమైతే.. మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికితీసి ప్రపంచ వేదికలపై నిలబెట్టే మహోన్నత ఉద్దేశంతో ఐదు రకాల క్రీడలను ప్రమోట్ చేస్తున్నామన్నారు. ఈ రెండు ప్రధానాంశాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెగా క్రీడాటోర్నీకి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఏటా డిసెంబరులో ‘ఆడుదాం ఆంధ్ర’ను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈనెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు చేపట్టాలని నిర్దేశించారు. 15 వేల గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రకు అన్ని రకాలుగా సన్నద్ధమవ్వాలని సూచించారు. ఈమేరకు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో ప్రత్యేక ఎస్‌వోపీలను రూపొందించి అమలు చేయాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
సంకల్ప బలంతో.. అంచనాలకు మించి
నాడు– నేడు ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్పు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే 15 వేల సచివాలయాలను స్థ్ధాపించగలుగుతామా? ప్రతి సచివాలయం పరిధిలో విలేజ్ క్లినిక్ పెట్టగలుగుతామా? 1.30 లక్షల మందిని అతి తక్కువ కాలంలో సచివాలయాల్లో నియమించగలుగతామా? అన్నవి కూడా గతంలో ప్రశ్నార్థకాలుగా ఉన్నవే.
ప్రజలకు మంచి చేయాలనే మన సంకల్పమే వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసింది. సచివాలయాల దగ్గర నుంచి నేడు ఆరోగ్య సురక్ష వరకు ప్రతి కార్యక్రమాన్నీ ఒక చాలెంజ్‌గానే చేపట్టాం. ప్రతి అడుగులోనూ అంచనాలకు మించి పని చేశాం. అందులో భాగమే ‘ఆడుదాం ఆంధ్ర’ తలపెట్టాం.
ఐదు రకాల క్రీడలు..
ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. విలేజ్ క్లినిక్స్ ద్వారా ప్రివెంటివ్ కేర్‌పై దృష్టి పెట్టాం. ప్రివెంటివ్ కేర్ మరింత సమర్థంగా పని చేయాలంటే నిత్యం వ్యాయామం అవసరం. ఆరోగ్య సురక్ష ద్వారా డయాబెటిక్, బీపీ కేసులు బయటపడ్డాయి. ప్రివెంటివ్ కేర్‌లో భాగంగా ప్రతి ఇంటిలో ఫిజికల్ యాక్టివిటీస్ పెరిగితే భవిష్యత్తులో అవన్నీ తగ్గుతాయి. అందుకే ఆడుదాం ఆంధ్రను ప్రాముఖ్యత ఉన్న అంశంగా గుర్తించాలి. గ్రామీణ క్రీడాకారులకు సరైన గుర్తింపు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుంది.
ఇందులో భాగంగానే ఐదు రకాల క్రీడలు.. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ప్రమోట్ చేయాలి. ప్రతిభగల క్రీడాకారులకు ఉన్నతస్థాయి శిక్షణ అందించే దిశగా అడుగులు వేయాలి. పోటీల ప్రారంభానికి ముందే అన్ని స్థాయిల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలి. 3 కిలోమీటర్ల మారథాన్ లాంటి కార్యక్రమాలు జిల్లా స్ధాయిలో నిర్వహించాలి. దీనిద్వారా ఆడుదాం ఆంధ్రకు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలుగుతాం.
మైదానాలు మెరవాలి..
ఆడుదాం ఆంధ్రలో భాగంగా 14,997 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 9,043 క్రీడా మైదానాలను గుర్తించారు. క్రీడల నిర్వహణ కోసం మైదానాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంపై నిరంతరం పర్యవేక్షించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు క్రీడలతో మెరిసేలా వినియోగంలోకి తేవాలి. ఇకపై ఏటా గ్రామ స్థాయి నుంచి మట్టిలోని క్రీడా రత్నాలను వెతికి పట్టుకుందాం. అప్పుడే పీవీ సింధు, జ్యోతి సురేఖ, రాయుడు, శ్రీకాంత్, సాకేత్ లాంటి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులను చూడగలుగుతాం.
సచివాలయాల్లో పోస్టర్లు
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించేలా వెంటనే సచివాలయం పరిధిలో పోస్టర్లను ప్రదర్శించాలి. వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు ఈ టోర్నీ విశిష్టతను వివరించాలి. 15 ఏళ్లు పైబడిన వారిని, ప్రధానంగా గ్రామాల్లో బాలికలను ఎక్కువగా క్రీడలవైపు నడిపించాలి. ఇప్పటికే 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఏకంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు ‘ఆడుదాం ఆంధ్ర’లో పోటీపడతారు. వీరికి నాణ్యమైన కిట్లను అందించాలి.
ప్రొఫెషనల్స్ గుర్తింపు..
నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించి వారికి చేయూతనిచ్చే గొప్ప కార్యక్రమాలన్ని తలపెడుతున్నాం. క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ టాలెంట్ హంట్‌లో భాగస్వాములవుతాయి. బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీసేందుకు ముందుకొచ్చారు.
వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ఉత్తమ ప్రతిభను ఎంపిక చేస్తారు. క్రీడలను ప్రమోట్ చేసేందుకు 21 మంది రాష్ట్రస్థాయి అంబాసిడర్‌లు, 345 మంది జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు ముందుకు వచ్చారు. దీంతో నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్ గేమ్స్ మొదలవుతాయి.
ప్రతిభకు నగదు బహుమతి
క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో ప్రథమ విజేతలకు రాష్ట్రస్థాయిలో రూ.5 లక్షలు, జిల్లాలో రూ.60 వేలు, నియోజకవర్గంలో రూ.35 వేలు చొప్పున నగదు బహుమతి ఇస్తున్నాం. ఈ క్రీడలకు సంబంధించి ద్వితీయ బహుమతి కింద రాష్ట్రస్థాయిలో రూ.3 లక్షలు, జిల్లాలో రూ.30 వేలు, నియోజక వర్గంలో రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.2 లక్షలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున అందజేస్తాం.
బ్యాడ్మింటన్ డబుల్స్ విజేతలకు రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, జిల్లాలో రూ.35 వేలు, నియోజకవర్గంలో రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద వరుసగా రూ.లక్ష, రూ.20 వేలు, రూ.10 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందచేస్తాం.
► విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖల మంత్రి ఆర్‌కే రోజా, సీఎస్ డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, శాప్ ఎండీ హెచ్‌ఎం.ధ్యానచంద్ర, అంతర్జాతీయ క్రీడాకారులు అంబటి రాయుడు, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, వి.జ్యోతి సురేఖ, ఎస్‌కె జఫ్రీన్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment